petty thief
-
చిన్నపాటి నేరాలతో పెరుగుతున్న ఈ–పెట్టి కేసులు!
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో ఈ–పెట్టి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ–పెట్టి కేసుల్లో ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్లు వర్తించకుండా అత్యవసరంగా ఆన్లైన్లోనే కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా లేదా పోలీసులకు ఆధారాలు లభించినా వీటిపై వెంటనే ఆన్లైన్లోనే పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు. న్యూసెన్స్ చేయడం, ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించడం, అర్ధరాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచి ఉంచి ఇబ్బంది కలిగించినా ఈ విభాగంలోనే కేసులు నమోదు చేస్తున్నారు. పార్టీల పేరుతో డీజే సౌండ్‌తో ప్రజలకు ఇబ్బంది కలిగించినా, పేకాట ఆడడం నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, ఎక్కువ శబ్ధాలతో వాహనాలు నడిపి ఇతరులకు ఇబ్బంది కలిగించడం వంటివి కూడా ఈ–పెట్టి కేసులుగా నమోదు చేస్తున్నారు. ఇక రోడ్లపై అసభ్యంగా ప్రవర్తించడం, డ్రంకెన్ డ్రైవ్ తదితర చర్యలపై పెట్టి కేసుల కింద పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో వీడియో, ఫొటోలు సాక్ష్యాలుగా లభిస్తే పోలీసులు స్వయంగా ఆన్లైన్లోనే కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో పెట్టి కేసులు ఇలా.. పెట్టి కేసుల నమోదును 2018 నుంచి అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితోపాటు నారాయణఖేడ్, పటాన్చెరు, జహీరాబాద్ పోలీసు సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి గత నెలాఖరు వరకు జిల్లాలో 2,407 పెట్టి కేసులు నమోదయ్యాయి. ఒక్క సంగారెడ్డి పోలీసు సబ్ డివిజన్ పరిధిలోనే 1,626 కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు సదాశివపేట, జోగిపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలు సంగారెడ్డి పోలీసు సబ్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. జనాభా అధికంగా ఉండడం, వ్యాపార విస్తృతి ఉండడం, మూడు మార్కెట్ కమిటీలు ఈ పరిధిలోకే రావడం, హైదరాబాద్– ముంబై జాతీయ రహదారి (నంబర్ 65), అకోలా–నాందేడ్ జాతీయ రహదారి (నంబర్ 161) ఉండడం, బెంగళూరు–ముంబై జాతీయ రహదారి ఉండడంతో పెట్టి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గజ్వేల్–తూప్రాన్ జాతీయ రహదారి సైతం సంగారెడ్డి సబ్‌డివిజనల్ పరిధిలోకి వస్తుంది. ఈ రహదారుల వెంట హోటళ్లు, దాబాలు రేయింబవళ్లు తెరిచి ఉండడంతో న్యూసెన్స్‌కు కారణమవుతున్నాయి. అంతేకాకుండా పలు పరిశ్రమలు ఉండడం కూడా ఈ కేసులు ఎక్కువ కావడానికి కారణాలవుతున్నాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరానికి సమీపంలో పటాన్చెరులో 454, కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దుగా ఉన్న జహీరాబాద్ సబ్ డివిజన్లో 118, నారాయణఖేడ్‌లో 209 కేసులు నమోదయ్యాయి. నమోదు ఇలా.. సాధారణంగా ఏదైనా నేరం రుజువైతే ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. శిక్షలుపడే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. కాగా పెట్టి కేసులకు మాత్రం ఐపీసీ సెక్షన్లు వర్తించవు. చిన్న నేరాలకు పోలీసులే స్వయంగా లేదా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే ఆన్లైన్లో పెట్టి కేసు నమోదు చేస్తారు. ఫొటో లేదా వీడియో రూపంలో సాక్ష్యాధారాలను సేకరిస్తారు. ఆధారాల కోసం పోలీసు అధికారులు పరిశోధన చేయాల్సిన పని ఈ కేసుల్లో ఉండదు. ప్రత్యేకమైన అనుమానిత సంఘటనలకు సంబంధించి తప్ప మిగతా వాటిలో పెట్టి కేసులను వెంటనే నమోదు చేస్తారు. పోలీసు పెట్రోలింగ్ అధికారులు, సిబ్బంది వారివద్ద ఉన్న సాక్ష్యాలను ట్యాబ్‌లలో పొందుపరిచి ఆన్లైన్లో అప్లోడ్ చేసి కేసులు నమోదు చేస్తారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా జరిమానా గాని, శిక్షగాని విధిస్తారు. ఇలాంటి కేసులు ఆన్లైన్ కాకముందు మధ్యవర్తుల ద్వారా ఒప్పందంతో కేసులు రాజీ జరిగేవి. ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో ఈ–పెట్టి కేసులు నమోదవుతుండడంతో జరిమానా లేదా శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పెట్టి కేసులు జిల్లాలో అధికంగానే నమోదుతున్నాయి. ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం ఈ–పెట్టి కేసులకు సంబంధించి ఎక్కడా కూడా రాజీ లేకుండా వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. న్యూసెన్స్ చేయడం, తోపుడు బండ్లు, బైకులపై అడ్డదిడ్డంగా తిరగడం, డీజే, వేధించడం, రోడ్డు పక్కన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం.. తదితర వాటిపై వెంటనే స్పందిస్తున్నాం. పోలీసులు స్వయంగా చూసినా, ఎవరైనా ఫిర్యాదు చేసినా ట్యాబ్‌లో ఫొటోలు తీసి కేసులు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రజలు ఈ–పెట్టి కేసులపై ప్రజలతోపాటు పోలీసు సిబ్బందికి అవగాహన కలి్పస్తున్నాం. – శ్రీధర్‌రెడ్డి, డీఎస్పీ, సంగారెడ్డి -
నేను చిల్లర దొంగను కాను: శశికళ
-
నేను చిల్లర దొంగను కాను: శశికళ
పరప్పణ అగ్రహార జైల్లో సాధారణ ఖైదీలా కాలం గడపాల్సి రావడం చిన్నమ్మ శశికళకు బాగా అవమానకరంగా అనిపించింది. దాంతో ఆమె జైలు అధికారులతో ఈ విషయంలో కాస్తంత గొడవ పడినట్లు తెలుస్తోంది. వాళ్లకు.. తాను చిల్లర దొంగను కానని ఆమె చెప్పినట్లు జాతీయ మీడియా సమాచారం. అందరు ఖైదీల్లాగే తనను జీపులో తీసుకెళ్తామని చెబితే దానికి ఆమె ససేమిరా అన్నారు. దానికంటే లోపలకు నడుచుకుంటూనే వస్తానని చెప్పి.. ఇళవరసి, సుధాకరన్‌లతో కలిసి నడుచుకుంటూనే జైలు ప్రాంగణంలోకి వెళ్లారు. అది ఎంత దూరమైనా తాను నడిచే వస్తాను తప్ప చిల్లర దొంగలను తీసుకెళ్లినట్లు తనను పోలీసు జీపులో తీసుకెళ్తానంటే కుదరదని స్పష్టం చేశారంటున్నారు. ఇంతకుముందు జయలలితతో కలిసి వచ్చినప్పుడు తనకు ఏవేం సౌకర్యాలు కల్పించారో, అవన్నీ ఇప్పుడు కూడా ఉంటాయని ఆమె అనుకున్నారని, కానీ అవేవీ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందారని జైలు వర్గాలు తెలిపాయి. అప్పట్లో జయలలిత మాజీ ముఖ్యమంత్రి కావడం, దానికితోడు అనారోగ్యంగా ఉండటం వల్లే ఆమెకు ఎ గ్రేడు సౌకర్యాలు కల్పించారని, కానీ ఇప్పుడు పరిస్థితి వేరని అంటున్నారు. శశికళ ఎప్పుడూ ముఖ్యమంత్రిగా పనిచేయకపోవడంతో ఆమెకు ఆ స్థాయి సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్య ఏదీ తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే ఆమెను జైలు లోపలి వరకు జీపులో తీసుకెళ్లాలని భావించారు. కానీ ఆమె నిరాకరించడంతో నడిపించుకుంటూనే తీసుకెళ్లారు. ఆమెకు 10/8 సైజు సెల్ కేటాయించారని, అందులోనే ఆమె తన మరదలు ఇళవరసితో కలిసి ఉంటున్నారని జైలు అధికారులు తెలిపారు. శశికళకు తెల్లచీర ఇచ్చినా దాన్ని ఆమె కట్టుకోలేదని తెలిసింది. చాలా కొద్దిసేపు మాత్రమే నిద్రపోయారని, పులిహోర తిని కాఫీ తాగారని చెప్పారు. -
గుట్టల్లో జీవనం.. గుళ్లకు కన్నం
ఆరు నెలలుగా ఇదే జీవితం పోలీసులకు చిక్కిన చిల్లరదొంగ కరీంనగర్ క్రై ం: అతడో చిల్లర దొంగ. ఓసారి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత కూడా పాత బాటనే అనుసరిస్తున్నాడు. అయితే, పోలీసుల భయంతో తన మకాంను గుట్టల్లోకి మార్చేశాడు. ఆర్నెల్లుగా గుట్టల్లో నివాసముంటూ చిన్నచిన్న చోరీలకు పాల్పడుతున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు గుట్టల వద్ద నిఘా వేయడంతో దొరికిపోయాడు. శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన పెద్దాపురం ఆనంద్(25) పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చిల్లర దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. గతంలో పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లిన అతడు ఈ ఏడాది మే 11న బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడతాననే భయంతో తన మకాంను గుట్టల్లోకి మార్చాడు. మండలంలోని ఇల్లందు, శాంతినగర్, గన్నేరువరం, మైలారం గుట్టలు మారుతూ సమీప ప్రాంతాల్లో ఉన్న ఆలయాలతోపాటు కరీంనగర్, చిగురుమామిడి మండలాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం మైలారం గుట్టల వద్ద ఓ బైక్ కనిపించింది. వారం గడిచినా ఎవరూ రాకపోవడంతో పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్ ప్రతిరోజు రాత్రి మైలారం గుట్ట సమీపంలో ఉన్న గుడి వద్దకు వచ్చి సెల్, ట్యాబ్ చార్జింగ్ పెట్టుకుని మళ్లీ గుట్టల్లోకి వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో ఆలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి సంచరిస్తున్నాడనే అనుమానంతో గ్రామస్తులు కాపాలా పెట్టారు. అయితే, రాత్రి సమయంలో ఆలయం వద్దకు ఎలుగుబంట్లు వస్తాయి. దీంతో రాత్రి కాగానే గ్రామస్తులు వెళ్లిపోయేవారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఆనంద్ ఆలయం వద్దకు వచ్చి తన పనులు చేసుకుంటున్నాడు. నాలుగైదు రోజులకోసారి బయటకు వచ్చి సరుకులు కొనుక్కుని మళ్లీ గుట్టల్లోకి వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి కదలికలపై సమాచారం అందుకున్న గన్నేరువరం ఎస్సై కోటేశ్ ఆలయం వద్ద నిఘా పెట్టాడు. ఈనెల 24న రాత్రి ఆలయం వద్దకు వచ్చిన ఆనంద్‌ను పట్టుకుని విచారించగా వివరాలు బయటపెట్టాడు. పోలీసులు సదరుగుట్టలను సందర్శించి అతడి జీవనాన్ని పరిశీలించారు. ఆనంద్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి, అతడిలో మార్పుతీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు.