చిన్నపాటి నేరాలతో పెరుగుతున్న ఈ–పెట్టి కేసులు! | Online Petty Cases Are Increasing In Sangareddy District With Petty Crimes | Sakshi
Sakshi News home page

చిన్నపాటి నేరాలతో పెరుగుతున్న ఈ–పెట్టి కేసులు!

Published Thu, Dec 19 2019 9:23 AM | Last Updated on Thu, Dec 19 2019 9:23 AM

Online Petty Cases Are Increasing In Sangareddy District With Petty Crimes - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో ఈ–పెట్టి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ–పెట్టి కేసుల్లో ఐపీసీ (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌) సెక్షన్లు వర్తించకుండా అత్యవసరంగా ఆన్‌లైన్‌లోనే కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా లేదా పోలీసులకు ఆధారాలు లభించినా వీటిపై వెంటనే ఆన్‌లైన్‌లోనే పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు. న్యూసెన్స్‌ చేయడం, ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించడం, అర్ధరాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచి ఉంచి ఇబ్బంది కలిగించినా ఈ విభాగంలోనే కేసులు నమోదు చేస్తున్నారు.

పార్టీల పేరుతో డీజే సౌండ్‌తో ప్రజలకు ఇబ్బంది కలిగించినా, పేకాట ఆడడం నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్‌ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, ఎక్కువ శబ్ధాలతో వాహనాలు నడిపి ఇతరులకు ఇబ్బంది కలిగించడం వంటివి కూడా ఈ–పెట్టి కేసులుగా నమోదు చేస్తున్నారు. ఇక రోడ్లపై అసభ్యంగా ప్రవర్తించడం, డ్రంకెన్‌ డ్రైవ్‌ తదితర చర్యలపై పెట్టి కేసుల కింద పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో వీడియో, ఫొటోలు సాక్ష్యాలుగా లభిస్తే పోలీసులు స్వయంగా ఆన్‌లైన్‌లోనే కేసులు నమోదు చేస్తున్నారు.  

జిల్లాలో పెట్టి కేసులు ఇలా.. 
పెట్టి కేసుల నమోదును 2018 నుంచి అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితోపాటు నారాయణఖేడ్, పటాన్‌చెరు, జహీరాబాద్‌ పోలీసు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి గత నెలాఖరు వరకు జిల్లాలో 2,407 పెట్టి కేసులు నమోదయ్యాయి. ఒక్క సంగారెడ్డి పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలోనే 1,626 కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు సదాశివపేట, జోగిపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలు సంగారెడ్డి పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలోకి వస్తాయి.

జనాభా అధికంగా ఉండడం, వ్యాపార విస్తృతి ఉండడం, మూడు మార్కెట్‌ కమిటీలు ఈ పరిధిలోకే రావడం, హైదరాబాద్‌– ముంబై జాతీయ రహదారి (నంబర్‌ 65), అకోలా–నాందేడ్‌ జాతీయ రహదారి (నంబర్‌ 161) ఉండడం, బెంగళూరు–ముంబై జాతీయ రహదారి ఉండడంతో పెట్టి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గజ్వేల్‌–తూప్రాన్‌ జాతీయ రహదారి సైతం సంగారెడ్డి సబ్‌డివిజనల్‌ పరిధిలోకి వస్తుంది. ఈ రహదారుల వెంట హోటళ్లు, దాబాలు రేయింబవళ్లు తెరిచి ఉండడంతో న్యూసెన్స్‌కు కారణమవుతున్నాయి. అంతేకాకుండా పలు పరిశ్రమలు ఉండడం కూడా ఈ కేసులు ఎక్కువ కావడానికి కారణాలవుతున్నాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్‌ నగరానికి సమీపంలో పటాన్‌చెరులో 454, కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దుగా ఉన్న జహీరాబాద్‌ సబ్‌ డివిజన్‌లో 118, నారాయణఖేడ్‌లో 209 కేసులు నమోదయ్యాయి.  

నమోదు ఇలా.. 
సాధారణంగా ఏదైనా నేరం రుజువైతే ఐపీసీ (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. శిక్షలుపడే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. కాగా పెట్టి కేసులకు మాత్రం ఐపీసీ సెక్షన్లు వర్తించవు. చిన్న నేరాలకు పోలీసులే స్వయంగా లేదా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే ఆన్‌లైన్‌లో పెట్టి కేసు నమోదు చేస్తారు. ఫొటో లేదా వీడియో రూపంలో సాక్ష్యాధారాలను సేకరిస్తారు. ఆధారాల కోసం పోలీసు అధికారులు పరిశోధన చేయాల్సిన పని ఈ కేసుల్లో ఉండదు. ప్రత్యేకమైన అనుమానిత సంఘటనలకు సంబంధించి తప్ప మిగతా వాటిలో పెట్టి కేసులను వెంటనే నమోదు చేస్తారు.

పోలీసు పెట్రోలింగ్‌ అధికారులు, సిబ్బంది వారివద్ద ఉన్న సాక్ష్యాలను ట్యాబ్‌లలో పొందుపరిచి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి కేసులు నమోదు చేస్తారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా జరిమానా గాని, శిక్షగాని విధిస్తారు. ఇలాంటి కేసులు ఆన్‌లైన్‌ కాకముందు మధ్యవర్తుల ద్వారా ఒప్పందంతో కేసులు రాజీ జరిగేవి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానంలో ఈ–పెట్టి కేసులు నమోదవుతుండడంతో జరిమానా లేదా శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పెట్టి కేసులు జిల్లాలో అధికంగానే నమోదుతున్నాయి.  

ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం 
ఈ–పెట్టి కేసులకు సంబంధించి ఎక్కడా కూడా రాజీ లేకుండా వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. న్యూసెన్స్‌ చేయడం, తోపుడు బండ్లు, బైకులపై అడ్డదిడ్డంగా తిరగడం, డీజే, వేధించడం, రోడ్డు పక్కన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం.. తదితర వాటిపై వెంటనే స్పందిస్తున్నాం. పోలీసులు స్వయంగా చూసినా, ఎవరైనా ఫిర్యాదు చేసినా ట్యాబ్‌లో ఫొటోలు తీసి కేసులు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రజలు ఈ–పెట్టి కేసులపై ప్రజలతోపాటు పోలీసు సిబ్బందికి అవగాహన కలి్పస్తున్నాం. 
– శ్రీధర్‌రెడ్డి, డీఎస్పీ, సంగారెడ్డి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement