గుట్టల్లో జీవనం.. గుళ్లకు కన్నం
గుట్టల్లో జీవనం.. గుళ్లకు కన్నం
Published Sat, Nov 26 2016 1:33 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
ఆరు నెలలుగా ఇదే జీవితం
పోలీసులకు చిక్కిన చిల్లరదొంగ
కరీంనగర్ క్రై ం: అతడో చిల్లర దొంగ. ఓసారి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత కూడా పాత బాటనే అనుసరిస్తున్నాడు. అయితే, పోలీసుల భయంతో తన మకాంను గుట్టల్లోకి మార్చేశాడు. ఆర్నెల్లుగా గుట్టల్లో నివాసముంటూ చిన్నచిన్న చోరీలకు పాల్పడుతున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు గుట్టల వద్ద నిఘా వేయడంతో దొరికిపోయాడు. శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన పెద్దాపురం ఆనంద్(25) పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చిల్లర దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. గతంలో పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లిన అతడు ఈ ఏడాది మే 11న బయటకు వచ్చాడు.
ఆ తర్వాత కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడతాననే భయంతో తన మకాంను గుట్టల్లోకి మార్చాడు. మండలంలోని ఇల్లందు, శాంతినగర్, గన్నేరువరం, మైలారం గుట్టలు మారుతూ సమీప ప్రాంతాల్లో ఉన్న ఆలయాలతోపాటు కరీంనగర్, చిగురుమామిడి మండలాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం మైలారం గుట్టల వద్ద ఓ బైక్ కనిపించింది. వారం గడిచినా ఎవరూ రాకపోవడంతో పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్ ప్రతిరోజు రాత్రి మైలారం గుట్ట సమీపంలో ఉన్న గుడి వద్దకు వచ్చి సెల్, ట్యాబ్ చార్జింగ్ పెట్టుకుని మళ్లీ గుట్టల్లోకి వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో ఆలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి సంచరిస్తున్నాడనే అనుమానంతో గ్రామస్తులు కాపాలా పెట్టారు.
అయితే, రాత్రి సమయంలో ఆలయం వద్దకు ఎలుగుబంట్లు వస్తాయి. దీంతో రాత్రి కాగానే గ్రామస్తులు వెళ్లిపోయేవారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఆనంద్ ఆలయం వద్దకు వచ్చి తన పనులు చేసుకుంటున్నాడు. నాలుగైదు రోజులకోసారి బయటకు వచ్చి సరుకులు కొనుక్కుని మళ్లీ గుట్టల్లోకి వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి కదలికలపై సమాచారం అందుకున్న గన్నేరువరం ఎస్సై కోటేశ్ ఆలయం వద్ద నిఘా పెట్టాడు. ఈనెల 24న రాత్రి ఆలయం వద్దకు వచ్చిన ఆనంద్‌ను పట్టుకుని విచారించగా వివరాలు బయటపెట్టాడు. పోలీసులు సదరుగుట్టలను సందర్శించి అతడి జీవనాన్ని పరిశీలించారు. ఆనంద్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి, అతడిలో మార్పుతీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
Advertisement