Karimnagar Police Commissioner
-
ఒకే ఎఫ్ఐఆర్తో రెండు కేసులు, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. సీపీ సీరియస్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఒకే నెంబరుతో రెండు ఎఫ్ఐఆర్ల విషయం పోలీసు డిపార్ట్మెంటులో కలకలం రేపుతోంది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో శుక్రవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి డీజీపీ కార్యాలయం స్పందించింది. ఈ ఘటనపై తక్షణమే పూర్తి వివరాలతో నివేదిక పంపాలని కరీంనగర్ పోలీసులను ఆదేశించింది. సీపీ సత్యనారాయణ కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నారని సమాచారం. ఒకే నెంబరుతో రెండు కేసులు నమోదవడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనూ తాము చూడలేదని పలువురు సీనియర్ అధికారులే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఈ విషయం డిపార్ట్మెంటులో సరికొత్త చర్చకు దారితీసింది. మరోవైపు ఘటనపై ఇంటలిజె న్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ డమ్మీ ఎఫ్ఐఆర్ ఎవరిపని? దీన్ని పోలీసులే సృష్టించి బాధితుడిని భయపెట్టారా? లేక బాధితుడే పోలీసులను అప్రతిష్ట పాలు చేస్తున్నాడా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. చదవండి: డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి.. బాధితుడు తనకు ఇచ్చినట్లుగా చెబుతున్న 255/2020 ఎఫ్ఐఆర్ అసలేం జరిగింది..?: విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆరెపల్లికి చెందిన నల్లగోపు చంద్రకళ–శ్రీనివాసరావు దంపతులు. మనస్పర్థలతో విడిగా ఉంటున్నారు. తన పేరిట ఉన్న ఇంటిని విక్రయించేందుకు చంద్రకళ సిద్ధపడింది. తన కూతురు పెళ్లికోసమని కొన్న ఇంటిని విక్రయించేందుకు శ్రీనివాసరావు అంగీకరించలేదు. ఈ విషయంలో వీరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ తరువాత ఒకరోజు కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి పిలు పువచ్చింది. మరునాడు కూడా అతన్ని పోలీస్‌స్టేషన్‌కి పిలిపించారు. చేతిలో ఎఫ్ఐఆర్ పెట్టారు. ‘నిన్ను అరెస్టు చేస్తున్నాం. వైద్యపరీక్షలకు పంపుతాం. దాదాపు ఆరునెలల వరకు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని చెప్పడంతో భయపడిపోయిన.. అతను ఇంటి విక్రయానికి అంగీకరించాడు. అప్పుడు దంపతులిద్దరూ రాజీ పడుతున్నామని రాసివ్వడంతో జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని, పిలిచినప్పుడు కోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. తనకు ఎంతకూ న్యాయస్థానం నుంచి పిలుపు రాకపోవడంతో అనుమానంతో శ్రీనివాసరావు తన వద్ద ఉన్న ఎఫ్ఐఆర్ 255/2020 కాపీ వివరాలతో లాయరును ఆశ్రయించారు. అక్కడ అదే నెంబరుతో మరో ఎఫ్ఐఆర్ ఉందని తెలుసుకుని విస్తుపోయాడు. తన ఇంటిని విక్రయించేందుకే.. ఈ వ్యవహారమంతా నడిపించారని గగ్గోలు పెడుతున్నారు. చదవండి: అమెరికా అమ్మాయి.. హనుమకొండ అబ్మాయి అలా ఒకటయ్యారు పోలీసు రికార్డుల్లో ప్రస్తుతం ఉన్న 255/2020 ఎఫ్ఐఆర్ ఏది నిజం.. ఆ రెండు ఇవే..! ఇందుకు సంబంధించిన రెండు ఎఫ్ఐఆర్ కాపీలను ‘సాక్షి’ సంపాదించింది. ఇందులో శ్రీనివాసరావుపై 341,323, 506 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నెంబరు 255/2020 పేరుతో ఎస్సై బి.చంద్రశేఖర్ ఉదయం 11 గంటల సమయంలో కేసు నమోదు చేశారు. అదే సమయంలో నెంబరుపై ఐపీసీ సెక్షన్లు 290, 324తో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మొ గ్దూంపూర్కు చెందిన కేసు నమోదైంది. ఈ కే సును ఎస్సై వి.శ్రీనివాసరావు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసుశాఖ మొదటి ఎఫ్ఐఆర్పై దృష్టి పెట్టింది. బాధితుడు చెబుతున్న ప్రకారం.. నిజంగానే పోలీసులు దాన్ని సృష్టించారా? లేక పోలీసులపై నిందలు వేసేందుకు బాధితుడే ఇదంతా చేస్తున్నాడా? విషయాలను నిర్ధారించుకునే పనిలో పడ్డారు. -
కరీంనగర్ సీపీగా సత్యనారాయణ
సాక్షి, కరీంనగర్: ఐదేళ్ల సుదీర్ఘకాలం కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన వీబీ కమలాసన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రామగుండం సీపీ వి.సత్యనారాయణను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కమలాసన్‌రెడ్డిని ప్రభుత్వం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. వి.సత్యనారాయణ రామగుండంలో సుమారు మూడేళ్ల పాటు కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. అంతకుముందు హైదరాబాద్ వెస్ట్ జోన్, సౌత్ జోన్లలో డీసీపీగా వ్యవహరించారు. కాగా.. రామగుండం పోలీస్ కమిషనర్‌గా అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.రమణకుమార్ నియమితులయ్యారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన రమణ కుమార్ హైదరాబాద్‌లో వివిధ శాఖల్లో ఎస్పీ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్‌పై చెరగని ముద్ర కరీంనగర్ సీపీగా సుదీర్ఘకాలం పనిచేసిన కమలాసన్‌రెడ్డి శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను వినియోగించారు. కరుడుగట్టిన నేరస్థులపై పీడీయాక్టు అమలు చేశారు. బ్లూకోల్ట్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం అందించిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వాలిపోయే విధంగా చర్యలు తీసుకున్నారు. సీపీ తీసుకున్న చర్యల కారణంగా దేశంలోనే ఉత్తమ పోలీస్స్టేషన్లుగా చొప్పదండి, జమ్మికుంట ఎంపికయ్యాయి. ప్రజల రక్షణ భద్రతలో దేశవ్యాప్తంగా నాలుగో స్థానం, పీడీయాక్టు అమలులో 2వ స్థానం సాధించారు. కమిషనరేట్ పరిధిలో 10 వేల సీసీ కెమెరాలు లక్ష్యంగా పెట్టుకోగా దాతల సహాయంతో 8,500 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. కరీంనగర్ సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో ‘మియావాకీ’ చిట్టడవుల ప్రాజెక్టు ఏర్పాటు చేసి 12,500 మొక్కలు మొదటి దశలో, 14,800 మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచారు. దీంతోపాటు నక్షత్ర, రాశి వనాలను ఏర్పాటు చేసి రాష్ట్రానికే కరీంనగర్ పోలీసులను ఆదర్శంగా నిలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్ వినియోగంలో యువతలో జరిమానాల ద్వారా భయాన్ని కల్పించారు. ఆపరేషన్ నైట్ సేప్టీలో భాగంగా దొంగతనాలకు అడుకట్ట వేశారు. ప్రతిరోజూ కమిషరేట్‌లో నాఖాబందీ నిర్వహించి అక్రమార్కులకు, నేరగాళ్లకు సింహస్వప్నమయ్యారు. కమిషనరేట్‌లో 2 లక్షలకు పైగా ప్రజలు హ్యాక్ ఐ యాప్‌ను వినియోగింపచేశారు.లేక్ పోలీస్‌స్టేషన్, టాస్క్‌ఫోర్స్ విభా గాన్ని ఏర్పాటు చేసి అసాంఘిక శక్తుల ఆటలు కట్టించడంలో తనవంతు పాత్ర పోషించారు. భూదందాలు, సెటిల్మెంట్లు చేసి అక్రమాలకు పాల్పడిన 102 మందిపై పీడీయాక్టు విధించారు. కరీంనగర్ టూటౌన్, త్రీటౌన్, జమ్మికుంట, రామడుగు, ఎల్ఎండీ, గంగాధరతో పాటు వివిధ పోలీసుస్టేషన్లను ఆధునికీకరించారు. దివ్యాంగులు పోలీసుస్టేషన్లకు వచ్చేందుకు వీల్చైర్లు, ర్యాంపులు నిర్మించారు. నిజాం కాలం నాటి గోల్‌బంగ్లాను ఆధునికీకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో జిమ్నాజియం ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల ఫీడ్ బ్యాక్డే ద్వారా కేసుల పురోగతిని సమీక్షించారు. ఆటోలు, టాక్సీలకు క్యూఆర్ కోడ్ అమలు చేసి ప్రజలకు రక్షణ కల్పించారు. రామగుండం నుంచి కరీంనగర్‌కు.. కొత్త జిల్లాల అనంతరం ఏర్పాటైన రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వెలివల సత్యనారాయణ కరీంనగర్ సీపీగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2006 బ్యాచ్‌కు చెందిన సత్యనారాయణ డీసీపీగా హైదరాబాద్ వెస్ట్ జోన్, సౌత్ జోన్లలో విధులు నిర్వర్తించి సమర్థవంతుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన 2018 సెప్టెంబర్ 26న రామగుండం పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. సుమారు మూడేళ్లపాటు రామగుండం సీపీగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రల పరిరక్షణకు తన వంతు కృషి చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల డివిజన్లలో అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. శాసనసభ, పార్లమెంటు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా తనదైన మార్కు చూపించారు. కమలాసన్ రెడ్డి వారసుడిగా కరీంనగర్‌కు రానున్నారు. ఐదేళ్లకు బదిలీ అయిన కమలాసన్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కరీంనగర్లో ఏర్పాటైన పోలీస్ కమిషనరేట్‌కు 2016 అక్టోబర్ 11న తొలి కమిషనర్‌గా వీబీ కమలాసన్ రెడ్డి నియమితులయ్యారు. సుదీర్ఘంగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలపాటు కమిషనర్‌గా వ్యవహరించిన ఆయన కరీంనగర్‌పై చెరగని ముద్ర వేశారు. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న కమలాసన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సదభిప్రాయం ఉండడంతో ఇన్నేళ్ల పాటు కొనసాగారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కమలాసన్ రెడ్డిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. డీఐజీ హోదాలో ఉన్న ఆయనను డీజీ కార్యాలయానికి అటాచ్ చేయగా, హైదరాబాద్‌లోనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
పోలీస్‌లకు స్థానచలనం!
సాక్షి, కరీంనగర్ : పోలీసు బదిలీలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో మునిసిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఐ స్థాయి అధికారులను మినహా ఒకే స్టేషన్లో మూడు నుంచి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరికీ స్థానభ్రంశం కల్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని వివిధ జిల్లాల్లో సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైల బదిలీల ప్రక్రియను బల్దియా ఎన్నికలతో సంబంధం లేకుండా పూర్తి చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి నిర్ణయించారు. పాత కరీంనగర్ యూనిట్‌గా జరిగే ఈ బదిలీలు, పోస్టింగ్‌ల బాధ్యత డీఐజీ హోదాలో కమలాసన్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు. దీంతో పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌తోపాటు సిద్దిపేట, వరంగల్ అర్బన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని తొమ్మిది పోలీస్స్టేషన్లకు చెందిన పోలీసుల బదిలీలు కరీంనగర్ కమిషనర్ నేతృత్వంలోనే జరుగనున్నాయి. ఆయా జిల్లాల ఎస్పీల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా రెండు మూడు రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కమలాసన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 16వ తేదీ వరకు బదిలీ దరఖాస్తుల స్వీకరణ ఈ ఏడాది మే 31 వరకు ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లుగా పనిచేసిన కానిస్టేబుళ్లు, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హెడ్ కానిస్టేబుళ్లతోపాటు మూడేళ్లుగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సైలను బదిలీ చేయాలని కమిషనర్ కమలాసన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అంతర్గత బదిలీలకు ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏవైనా ఐదు పోలీస్స్టేషన్లను ఆప్షన్లుగా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న పోలీస్ సబ్ డివిజన్, సొంత మండలం కాకుండా బదిలీలకు ఆప్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు ఆయా జిల్లాల ఎస్పీలకు దరఖాస్తులు చేసుకున్నారు. చాలాకాలంగా ఈ స్థాయి పోలీసుల బదిలీలు జరగకపోవడంతో సుమారు 500 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా జిల్లాల ఎస్పీలు దరఖాస్తులను పరిశీలించి కరీంనగర్ కమిషనరేట్‌కు బదిలీలకు అర్హులైన వారి వివరాలు, వారు కోరుకుంటున్న పోలీస్స్టేషన్ల డేటాను పంపించారు. అయితే ఒకటి రెండు జిల్లాల నుంచి ఇంకా ప్రతిపాదనలు రాకపోవడంతో కమిషనర్ ప్రక్రియను ప్రారంభించలేదని తెలిసింది. శుక్రవారంలోగా అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో సోమవారం నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. పలు అంశాల పరిశీలన చాలా కాలం నుంచి జిల్లాల సరిహద్దులు, అటవీ ప్రాంతాలు, సరైన ప్రాధాన్యత లేని మండలాల్లో పనిచేస్తున్న పోలీసులు ఈసారి బదిలీల్లో కరీంనగర్‌తోపాటు కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్స్ సమీపంలోకి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారు ఎక్కువగా కరీంనగర్‌ను ఆప్షన్‌గా ఇచ్చినట్లు సమాచారం. బదిలీల విషయంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా నుంచి వివిధ స్థాయిల్లో 50 మంది బదిలీ జరిగే అవకాశం ఉంటే, ఇతర జిల్లాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా 50 మందికే అవకాశం లభిస్తుంది. అలాగే ఇతర సర్వీసుల్లో ఉన్నవారి బదిలీల తరహాలోనే పదవీ విరమణకు గల గడువు, భాగస్వామి పనిచేస్తున్న ప్రాంతాలు, మెడికల్ గ్రౌండ్స్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పోలీస్‌స్టేషన్ రైటర్లు, క్రైం టీంలు, ఇతర పరిపాలన విభాగాల్లో పనిచేస్తున్న వారి బదిలీల విషయంలో స్థానికంగా ఉన్న అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐల బదిలీలపై పోలీస్‌వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎస్ఐ, సీఐల బదిలీల విషయంలో ఆచితూచి కమిషనరేట్ పరిధిలోని ఎస్ఐల అంతర్గత బదిలీల విషయంలో కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బుధవారం బదిలీ చేసిన 13 మంది ఎస్ఐలలో ముగ్గురు మినహా మిగతా వారంతా వివిధ కారణాల వల్ల అటాచ్డ్ అయిన వారే. వారికి ఖాళీలుగా ఉన్న చోట పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ రేంజ్ పరిధిలో జరిగే ఎస్ఐల బదిలీలను డీఐజీ ప్రమోద్‌కుమార్ నేతృత్వంలో జరుగుతాయి. రేంజ్ పరిధిలో బదిలీలకు సంబంధించి డీఐజీ ప్రమోద్‌కుమార్ తీసుకునే నిర్ణయంపై స్పష్టత లేదు. మునిసిపల్ ఎన్నికలకు గడువు పెరిగితే ఎస్ఐల బదిలీలు కరీంనగర్ రేంజ్ పరిధిలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక సీఐల బదిలీలకు సంబంధించి ఐజీ నాగిరెడ్డి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. వరంగల్, కరీంనగర్ రేంజ్ పరిధిలలో ఈ బదిలీల ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అయితే మునిసిపల్ ఎన్నికలు ముగిసే వరకు సీఐ, డీఎస్పీల స్థాయిలో బదిలీలు ఉండకపోవచ్చని ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. -
కొత్వాల్ కొరడా..!
‘రాత్రి 12 గంటలు. కోతిరాంపూర్‌లోని ఓ గల్లీలో కొందరు యువకులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. చౌరస్తాలో అప్పటికే సిద్ధం చేసిన టేబుల్, దానిపై ఓ కేక్, క్యాండిల్స్... పుట్టినరోజు జరుపుకుంటున్న తమ మిత్రుడికి శుభాకాం క్షలు చెబుతూ కేక్ కట్ చేయించారు. కేరింతలు కొడుతూ బీర్ల మూతలు తెరిచారు. యువకుల సందడిని చూసిన ఓ వ్యక్తి 100 నెంబర్‌కు ఫోన్ చేయడంతో వెంటనే పెట్రోలింగ్ వాహనం అక్కడికి చేరింది. పోలీసు వాహనం హారన్ వినగానే ఎక్కడి వారు అక్కడ పరార్’ – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను తగ్గించడం, మహిళలు, బాలికల రక్షణ, యువకుల విచ్చలవిడి తనానికి పుల్‌స్టాప్ పెట్టడం, అక్రమ దందాలను అరికట్టడం... తదితర అంశాలపై పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి గత కొంతకాలంగా తీసుకుంటున్న చర్యలకు మరింత పదును పెట్టారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ స్థాయిల్లోని అధికారులతోపాటు బ్లూకోట్స్, పెట్రోలింగ్ స్టాఫ్, క్రైం పార్టీలు, ఈ కాప్స్, అడ్మినిస్ట్రేషన్, రిసిప్షన్ తదితర 10 విభాగాల సిబ్బందికి ఇచ్చే శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం బ్లూకోట్స్, పెట్రోలింగ్ టీంలతో పాటు క్రైంపార్టీ పోలీసులతో జరిగిన సమావేశానికి హాజరై పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో మాట్లాడి వారి నుంచి సలహాలు కూడా తీసుకున్నారు. బ్లూకోట్స్, పెట్రోలింగ్ టీమ్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా కితాబిచ్చారు. ప్రార్థనా స్థలాల వద్ద తెల్లవారు జామున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. తరచూ ఈవ్‌టీజింగ్ జరిగే బస్టాండ్స్, పార్కులు, కాలేజీ అడ్డాలు వంటి ‘హాట్‌స్పాట్స్’ను గుర్తించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని వారిని ఆదేశించారు. వ్యవస్థీకృత భూదందాలు నిర్వహిస్తున్న వారిపై ఇప్పటికే నిఘా ఉన్నప్పటికీ... పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత కరీంనగర్ లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని, విచ్చలవిడి తనాన్ని రూపు మాపడం, మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడం ధ్యేయంగా పనిచేయాలని అధికారులు, క్షేత్రస్థాయి పోలీసులకు సూచనలు ఇచ్చారు. మనోళ్ల పనితీరు ఎలా ఉంది..? సోమవారం స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) పోలీసులతో కమిషనర్ కమలాసన్‌రెడ్డి సమావేశం అయ్యారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్లు, సీఐ, ఎస్సైల తీరుపై ఆరా తీశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్హెచ్ఓలు, భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్న పోలీసు అధికారుల వివరాలతోపాటు సామాన్యులు పోలీసుల విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారనే అంశాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఎస్బీ మీటింగ్‌లో సూచనలు, సలహాలు చేసిన అనంతరం ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమై వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. వడ్డీ దందాలు, ఆర్థిక నేరాలకు సంబంధించి కూడా ఆయన ఆరా తీసినట్లు సమాచారం. ఒక్కొక్కరు ఒక్క నేరాన్నైనా ఛేదించాలి: క్రైంపార్టీల్లో పనిచేస్తున్న పోలీసులు మెదడుకు పనిచెప్పాలని, వ్యూహాత్మకంగా నేరాలను ఛేదించాలని మంగళవారం జరిగిన క్రైంపార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. ఎలాంటి కేసైనా పట్టుదలతో ప్రయత్నిస్తే ఛేదన కష్టం కాదని, ప్రతీ నేరానికి ఎక్కడో ఒకచోట క్లూ లభిస్తుందని అన్నారు. ఇతర జిల్లాల్లో నేరగాళ్లు పట్టుబడే విధానాలను పరిశీలించాలని సూచించారు. సైబర్ ల్యాబ్‌తోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. క్రైంపార్టీలలో పనిచేసే పోలీసులు ఒక్క నేరాన్ని అయినా స్వయంగా ఛేదించాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. 31లోగా అన్ని స్కూళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి పాఠశాలలో ఈ నెల 31లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. విద్యార్థినులు, మహిళలు చదువుకునే పాఠశాలలు, కళాశాలలు, లేడీస్ హాస్టళ్లు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి వంద మంది గుమిగూడే ఏ ప్రాంతమైనా సీసీ కెమెరా తప్పనిసరని, సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తే ఎలాంటి సంఘటననైనా రికార్డు చేయవచ్చని అన్నారు. పాఠశాలల్లో చదివే ఎదిగిన పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాలలోని ప్రతి ఆవరణ నిక్షిప్తం అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. ఆ సందర్భంగా ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయని ఓ పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోకిరీలకు వణుకు పుట్టాలి..
సాక్షి, కరీంనగర్ : అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమల్‌హాసన్ రెడ్డి టాస్క్‌ఫోర్స్ విభాగం పోలీసులను ఆదేశించారు. కరీంనగర్ కమిషనరేట్‌లో శుక్రవారం విబి కమల్‌హాసన్ రెడ్డి టాస్క్‌ఫోర్స్ , షీ బృందాల పోలీసు విభాగాలతో సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..రేషన్ బియ్యం అక్రమ రవాణా, కల్తీ విత్తనాలు, ఆహార పదార్థాలపై దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ విభాగం పోలీసులు అంకితభావంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. ఉత్తమ పనితీరును కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ తరహాలో కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. పోకిరీలకు వణుకు పుట్టాలి.. ప్రేమ పేరిట విద్యార్థులను, మహిళలను వేధించే పోకిరీలకు వణుకు పుట్టించేలా పనిచేయాలని కమిషనర్ కమల్‌హాసన్ రెడ్డి షీ బృందాల పోలీసులను ఆదేశించారు. పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు వారిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదూ చేస్తామని తెలిపారు. ముఖ్యంగా షీ బృందాలు తమ పనితీరుతో మహిళలకు భద్రత పట్ల భరోసా కల్పించాలని పేర్కొన్నారు. ప్రేమ పేరుతో వేధిస్తున్న పోకిరీలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చే విద్యార్థినులు, మహిళల పేర్లను గోప్యంగా ఉంచుతామని హామి ఇచ్చారు.ఈ సమావేశానికి అడిషనల్ డీసీపీ(లా అండ్ ఆర్డర్) ఎస్.శ్రీనివాస్, ఎసిసి శోభన్ కుమార్, మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ అవుతానని కలలో కూడా అనుకోలే..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ రోడ్లపై టూ వీలర్ నడిపే వారిలో 90 శాతం మంది హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేందుకు జనం జంకుతున్నారు. చిన్న చిన్న సంఘటనలు మినహా మత పరమైన గొడవలు లేవు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వి.బి.కమలాసన్‌రెడ్డి రెండున్నరేళ్లలో సాధించిన ఘనత ఇది. మెదక్ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి... అంచెలంచెలుగా ఎదిగి.. నిబద్ధతతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఐపీఎస్ అధికారి ఆయన. శాసనసభ, పంచాయతీ, పార్లమెంటు, ప్రాదేశిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ముగించిన కమలాసన్‌రెడ్డితో ఈ వారం ‘సాక్షి’ పర్సనల్ టైం... ఉమ్మడి కుటుంబంగానే ఇప్పటికీ... మాది మెదక్ జిల్లా శంకరంపేట మండలం దరిపల్లి గ్రామం. మా నాన్న గోవిందరెడ్డి రైతుగానే గాక పండితుడిగా చుట్టుపక్కల గ్రామాల్లో పేరున్న వ్యక్తి. మంచి చెడుల గురించి తెలుసుకునేందుకు, ముహూర్తాల కోసం నాన్న దగ్గరికి వచ్చేవారు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడే మా నాన్న చనిపోయారు. మేం ఐదుగురం తోబుట్టువులం. పెద్దన్న పురుషోత్తంరెడ్డి పోస్టల్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్‌గా రిటైర్డ్ అయ్యారు. రెండో అన్న జగజ్జీవన్‌రెడ్డి వ్యవసాయం. చెల్లెళ్లు ఒకరు హైదరాబాద్‌లో, ఇంకొకరు యూఎస్‌లో సెటిల్ అయ్యారు. ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. జీవనం కోసం ఎవరు ఎక్కడున్నా... అందరం దరిపల్లిలో కలుస్తుంటాం. తండ్రి సంపాదించిన 25 ఎకరాల భూమి కూడా ఉమ్మడి ఆస్తిగానే ఉంది. కమలాసన్ అంటే కమలం పైన ఆసీనులైన బ్రహ్మ అని.. మానాన్న పండితుడు అని చెప్పాను కదా. సంస్కృతం మీద మంచి పట్టుంది. ఆయన తన ముగ్గురు కొడుకులకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పేర్లు వచ్చేలా నామకరణం చేశారు. పెద్దన్న పేరు పురుషోత్తంరెడ్డి . పురుషోత్తముడు అంటే విష్ణువు , రెండో అన్నయ్య జగజ్జీవన్‌రెడ్డి అంటే జగత్తును నడిపించే శివుడు. కమలాసన్ అంటే కమలంపైన ఆసీనుడయ్యే బ్రహ్మ. అలా నాకు కమలాసన్‌రెడ్డి అనే పేరు. సినీయాక్టర్ కమల్‌హాసన్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు సినిమా నటుడిగా తెరపైకి వచ్చాడు. అయితే నేను చదువుకునేటప్పుడు గానీ, డీఎస్పీ ట్రైనింగ్‌లో గానీ నా స్నేహితులు సినిమా యాక్టర్ పేరేనని అనుమానపడేవారు. ఇది మా నాన్న పెట్టిన పేరు. చదవు దరిపల్లి నుంచి హైదరాబాద్ వయా మహబూబ్‌నగర్ నా చదువు ఐదో తరగతి వరకు దరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మేనమామ ఊరు ధర్మవరం అనే గ్రామంలో సాగింది. మహబూబ్‌నగర్‌లోని ఎంజీరోడ్డు హైస్కూల్లో పదో తరగతి 1978–79వ బ్యాచ్. తరువాత హైదరాబాద్‌లోని బడీచౌడీలోని చైతన్య కళాశాల(ఇప్పుడు లేదు)లో ఇంటర్. సికింద్రాబాద్ సర్ధార్ పటేల్ కళాశాలలో డిగ్రీ. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చేశా. 1990లో ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదివా. యూనివర్సిటీలో చదువు నా జీవిత గమనాన్ని మార్చింది. గ్రూప్స్‌కు ప్రిపేర్ కావడం, ఉద్యోగాల వేట యూనివర్సిటీ నుంచే మొదలైంది. నేను డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోనే చదివాను. తెలుగు అంటే చాలా ఇష్టం. పోలీస్ అవుతానని కలలో కూడా అనుకోలే..! ఉద్యోగ అన్వేషణలో 1990లో ఏపీపీఎస్సీ గ్రూప్–2ఎ రాస్తే, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డెవలప్మెంట్ అధికారిగా ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తూనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యా. మళ్లీ గ్రూప్–2ఏతోపాటు గ్రూప్–1 రాశా. గ్రూప్–2ఏలో తహసీల్దార్ ఉద్యోగం వచ్చింది. జాయిన్ కాలేదు. 1993లో గ్రూప్–1లో సెలక్ట్ అయ్యా. ఆర్డీవోకు తొలి ప్రాధాన్యత ఇచ్చా. రెండో ఆప్షన్ డీఎస్పీ. నాకొచ్చిన మార్కుల ఆధారంగా డీఎస్పీగా సెలక్ట్ అయ్యా. అయితే నేను చదువుకున్నప్పటి నుంచి ఎప్పుడూ పోలీస్ శాఖలోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. గ్రూప్–1లో వచ్చిన మార్కులతోనే డీఎస్పీని అయ్యా. తరువాత 2004 బ్యాచ్ ఐపీఎస్‌గా వివిధ హోదాల్లో పనిచేస్తున్నా. పోలీసులకే కాదు.. ప్రతీ ఒక్కరికి ఫిట్నెస్ తప్పనిసరి పోలీసు ఉద్యోగంలో ఫిట్నెస్ తప్పనిసరి. ఇప్పటికీ నేను వ్యాయామం, వాకింగ్ వంటివి చేస్తూ శరీరాన్ని అదుపులో పెట్టుకుంటాను. మన ఆహార అలవాట్లు, శారీరక శ్రమనే ఫిట్‌నెస్‌కు ప్రధానం. లిమిటెడ్ ఫుడ్ తిని, ప్రతిరోజు 10వేల అడుగులు నడక సాగిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతా. నేను కమిషనర్‌గా వచ్చిన తరువాత స్టాఫ్‌కు ‘పునరాకృతి’ అనే కార్యక్రమం ద్వారా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇప్పించాను. నాకు ఈత అంటే ఇష్టం. చిన్నప్పుడు చెరువులు, బావుల్లో ఈత కొట్టేవాళ్లం. హైదరాబాద్‌లో స్విమ్మింగ్‌పూల్స్‌లో ఈదేవాణ్ని. చిన్ననాటి ఫ్రెండ్స్ టచ్‌లో ఉన్నారు మా వూరిలో చదువుకున్నప్పటి ఫ్రెండ్స్‌తోపాటు ఎస్ఎస్సీ, డిగ్రీ, ఎల్ఎల్బీ నాటి స్నేహితులంతా ఇప్పటికీ టచ్‌లో ఉంటారు. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లడాన్ని ఇష్టపడతాను. రైతు కుటుంబం నుంచి రావడం వల్ల వ్యవసాయం అన్నా, రైతులు అన్నా నాకు చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో వ్యవసాయ పనులు చేసేవాడిని. అన్నయ్య ఇప్పటికీ రైతుగా ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నారు. నర్సంపేట డీఎస్పీగా చాలెంజింగ్ జాబ్ నర్సంపేట డీఎస్పీగా పనిచేసిన 1997–2000 మధ్య కాలంలో నక్సలైట్ ప్రాబల్యం అధికంగా ఉండేది. పీపుల్స్‌వార్‌కు గట్టి పట్టున్న ప్రాంతం. కొత్తగూడ మండలం కోమట్లగూడ గ్రామంలో పోలీసులు అంటేనే జనం భయపడే పరిస్థితి. శత్రువులుగానే చూసేవారు. ఈ పరిస్థితుల్లో కోమట్లగూడలో భారీ ఎత్తున మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించాను. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆ గ్రామ ప్రజలతో మమేకమై పోలీసులు శ్రేయోభిలాషులు అనే అభిప్రాయాన్ని కలిగించాను. 1998లో నర్సంపేటలో మూడు రోజులపాటు డివిజన్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయించాను. కోకో, కబడ్డీ, వాలీబాల్ గేమ్స్‌ను పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించడం మరిచిపోని సంఘటన. 300 టీమ్స్ పాల్గొన్న ఈ స్పోర్ట్స్ మీట్‌ను చూసేందుకు 15వేల మంది తరలివచ్చారు. చివరి రోజు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయించాం. ఈ కార్యక్రమం ద్వారా పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న దృక్పథం మారింది. యూత్‌ను దగ్గరికి తీశాం. శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతగా అంటే అప్పట్లో పేరున్న ముగ్గురు నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోతే వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో హింస రేగింది. నర్సంపేటలో చిన్న సంఘటన కూడా చోటుచేసుకోలేదు. అలాగే నర్సంపేట డివిజన్లో గంజాయి సాగును అరికట్టడం, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా కార్డన్ సెర్చ్‌కు అంకురార్పణ చేసి, ప్రజల్లో ధైర్యం కల్గించడం... కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా సంతృప్తి కరీంనగర్ ప్రజలు అత్యంత చైతన్యవంతులు. మంచి చెడులు వివరించి, ఏదైనా మార్పు తీసుకువస్తే తూచా తప్పకుండా పాటిస్తారు. కరీంనగర్లో టూ వీలర్ హెల్మెట్ డ్రైవింగ్ గురించి వివరిస్తే , 90 శాతానికి పైగా సక్సెస్ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చాలావరకు తగ్గాయి. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నారు. నేను కరీంనగర్లో చేపట్టిన ప్రతీ చర్యకు ప్రజల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి పూర్తి మద్దతు లభించింది. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించబోం అనే సందేశాన్ని పంపించడంతో ప్రజలు ఎడ్యుకేట్ అయ్యారు. మత పరమైన గొడవలు, నేరాలు చాలా వరకు తగ్గాయి. చిన్న చిన్న సంఘటనలు జరిగినా, ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవడంతో అది సాధ్యమైంది. అడ్వకేట్‌గా, ఇంటి ఇల్లాలిగా మా రాధిక సక్సెస్ 1993లో డీఎస్పీగా ఉద్యోగంలో చేరిన తరువాత రాధికతో వివాహం జరిగింది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. వాళ్లది హైదరాబాద్ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చేసి హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసేవారు. స్టాండింగ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. హైదరాబాద్ ఈపీఎఫ్ లీగల్ అడ్వయిజర్‌గా వ్యవహరించారు. మాకు ఇద్దరు పిల్లలు. బాబు రాజశేఖర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, చెన్నైలో జాబ్ చేస్తున్నారు. పాప దీపిక హైదరాబాద్ డెక్కన్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్. రాధిక హైకోర్టు అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూనే పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దింది. నేను పోలీస్ ఆఫీసర్‌గా బిజీగా ఉన్నప్పటికీ, పిల్లలకు అన్నీ తానై చూసుకొంది. పిల్లలు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఫ్యామిలీ పరంగా హ్యాపీ. -
పల్లెల్లో.. హెల్మెట్లు
శంకరపట్నం: హెల్మెట్ కొనాలంటే పట్టణాలకు పరుగులు తీయాల్సిన పని లేదు. జాతీయ రహదారి వెళ్లే పల్లెల్లోనూ లభ్యమవుతున్నాయి.శంకరపట్నం మండలంలో హెల్మెట్ విక్రయాలు ఊపందుకున్నాయి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ చట్టం అమలుకావడంతో ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో మాదిరిగా వాహనాలు తనిఖీచేసి కేసులు పెట్టేవారు. ఇప్పుడు ఈ పెట్టి కేసులు పెడుతుండడంతో ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించకుంటే ఫోటోతీసి అప్లోడ్ చేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి సీటుబెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే సీసీ కెమెరల్లో నమోదవుతున్న పుటేజీల ఆధారంగా కేసులు నమోదుచేస్తున్నారు. ఈ చలాన్ విధానం అమల్లోకి రావడంతో పోలీసులు జాతీయరహాదారిపై రోజుకో ప్రాంతంలో నిఘా పెంచుతున్నారు. మండలంలోని కేశవపట్నంలోనే మూడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డుపక్కన విక్రయిస్తున్నారు. ఒక్కో హెల్మెట్ రూ.300నుంచి రూ.1000 వరకు ధరల్లో లభ్యమవుతున్నాయి. హెల్మెట్ ధరించండి కరీంనగర్– వరంగల్ జాతీయ రహాదారి ని త్యం రద్దీగా ఉంటుంది. వాహనాల రాకపోకల తో అప్రమత్తంగా డ్రైవింగ్ చేయకుంటే ప్రమాదాల బారిన పడుతున్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే సురక్షతంగా గమ్యానికి చేరుకుంటారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ఈ పెట్టి కేసులు నమోదు చేస్తున్నాం. – సత్యనారాయణ, ఎస్సై -
పెళ్లికి.. పెద్దన్నలయ్యారు..
సాక్షి, గంగాధర(చొప్పదండి): వారిది పేదింటి కుటుంబం. కూతురుకు మంచి సంబంధం కుదిరింది. ముహూర్తం ఖరారు చేశారు. ఇంతలోనే ఇంటిపెద్దకు జబ్బు చేసింది. కూతురుపెళ్లికి దాచిన డబ్బులు వైద్యానికి ఖర్చయ్యా యి. పెళ్లి ఆగిపోతుందేమోనని ఆందోళనలో ఉన్న ఆ కుటుంబానికి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అండ గా నిలిచారు. దగ్గరుండి సదరు యువతి వివాహం జరి పించారు. వచ్చినవారికి భోజనాలు సైతం పెట్టించారు. గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన కొలెపాక అంజయ్య– బుజ్జమ్మ దంపతులకు కొడుకు అనిల్, కూతురు లత(రేణుక) ఉన్నారు. అనిల్ ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. లత(రేణుక)కు కొత్తపల్లి మండలం బాహుపేటకు చెందిన కొట్టెపల్లి లక్ష్మణ్‌కుమార్‌తో నెల 25న పెళ్లి జరిపించడానికి పదిహేను రోజుల క్రితం ముహూర్తం కుదిర్చారు. ఇంతలో లత తండ్రి అంజయ్య అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రికి వెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయని తెలిపారు. పెళ్లికోసం పోగుచేసిన డబ్బులు వైద్యానికే ఖర్చయ్యాయి. ముహూర్తం దగ్గరపడుతుండడంతో ఆందోళన చెందారు. పెద్దన్నలైన పోలీసులు స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై పుల్లయ్య అంజయ్య కుటుంబాన్ని కలిసి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. విషయాన్ని సీఐ రమేష్ ద్వారా ఏసీపీ ఉషావిశ్వనాథ్, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డికి వివరించారు. స్పందించిన వారు అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలని నిర్ణయించారు. స్థానిక ఓ ఫంక్షన్హాల్లో బుధవారం లత(రేణుక)– లక్ష్మణ్‌కుమార్‌ల వివాహం ఘనంగా జరిపించారు. సీపీ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే శోభ, ఎంపీపీ దూలం బాల గౌడ్, ప్రజాప్రతినిధులుహాజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడు మేడిపల్లి సత్యం రూ. 5,116 అందించారు. -
గుట్టల్లో జీవనం.. గుళ్లకు కన్నం
ఆరు నెలలుగా ఇదే జీవితం పోలీసులకు చిక్కిన చిల్లరదొంగ కరీంనగర్ క్రై ం: అతడో చిల్లర దొంగ. ఓసారి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత కూడా పాత బాటనే అనుసరిస్తున్నాడు. అయితే, పోలీసుల భయంతో తన మకాంను గుట్టల్లోకి మార్చేశాడు. ఆర్నెల్లుగా గుట్టల్లో నివాసముంటూ చిన్నచిన్న చోరీలకు పాల్పడుతున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు గుట్టల వద్ద నిఘా వేయడంతో దొరికిపోయాడు. శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన పెద్దాపురం ఆనంద్(25) పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చిల్లర దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. గతంలో పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లిన అతడు ఈ ఏడాది మే 11న బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడతాననే భయంతో తన మకాంను గుట్టల్లోకి మార్చాడు. మండలంలోని ఇల్లందు, శాంతినగర్, గన్నేరువరం, మైలారం గుట్టలు మారుతూ సమీప ప్రాంతాల్లో ఉన్న ఆలయాలతోపాటు కరీంనగర్, చిగురుమామిడి మండలాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం మైలారం గుట్టల వద్ద ఓ బైక్ కనిపించింది. వారం గడిచినా ఎవరూ రాకపోవడంతో పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్ ప్రతిరోజు రాత్రి మైలారం గుట్ట సమీపంలో ఉన్న గుడి వద్దకు వచ్చి సెల్, ట్యాబ్ చార్జింగ్ పెట్టుకుని మళ్లీ గుట్టల్లోకి వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో ఆలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి సంచరిస్తున్నాడనే అనుమానంతో గ్రామస్తులు కాపాలా పెట్టారు. అయితే, రాత్రి సమయంలో ఆలయం వద్దకు ఎలుగుబంట్లు వస్తాయి. దీంతో రాత్రి కాగానే గ్రామస్తులు వెళ్లిపోయేవారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఆనంద్ ఆలయం వద్దకు వచ్చి తన పనులు చేసుకుంటున్నాడు. నాలుగైదు రోజులకోసారి బయటకు వచ్చి సరుకులు కొనుక్కుని మళ్లీ గుట్టల్లోకి వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి కదలికలపై సమాచారం అందుకున్న గన్నేరువరం ఎస్సై కోటేశ్ ఆలయం వద్ద నిఘా పెట్టాడు. ఈనెల 24న రాత్రి ఆలయం వద్దకు వచ్చిన ఆనంద్‌ను పట్టుకుని విచారించగా వివరాలు బయటపెట్టాడు. పోలీసులు సదరుగుట్టలను సందర్శించి అతడి జీవనాన్ని పరిశీలించారు. ఆనంద్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి, అతడిలో మార్పుతీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు.