నూతన జంటను ఆశీర్వదిస్తున్న సీపీ, పోలీసులు
సాక్షి, గంగాధర(చొప్పదండి): వారిది పేదింటి కుటుంబం. కూతురుకు మంచి సంబంధం కుదిరింది. ముహూర్తం ఖరారు చేశారు. ఇంతలోనే ఇంటిపెద్దకు జబ్బు చేసింది. కూతురుపెళ్లికి దాచిన డబ్బులు వైద్యానికి ఖర్చయ్యా యి. పెళ్లి ఆగిపోతుందేమోనని ఆందోళనలో ఉన్న ఆ కుటుంబానికి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అండ గా నిలిచారు. దగ్గరుండి సదరు యువతి వివాహం జరి పించారు. వచ్చినవారికి భోజనాలు సైతం పెట్టించారు. గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన కొలెపాక అంజయ్య– బుజ్జమ్మ దంపతులకు కొడుకు అనిల్, కూతురు లత(రేణుక) ఉన్నారు.
అనిల్ ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. లత(రేణుక)కు కొత్తపల్లి మండలం బాహుపేటకు చెందిన కొట్టెపల్లి లక్ష్మణ్‌కుమార్‌తో నెల 25న పెళ్లి జరిపించడానికి పదిహేను రోజుల క్రితం ముహూర్తం కుదిర్చారు. ఇంతలో లత తండ్రి అంజయ్య అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రికి వెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయని తెలిపారు. పెళ్లికోసం పోగుచేసిన డబ్బులు వైద్యానికే ఖర్చయ్యాయి. ముహూర్తం దగ్గరపడుతుండడంతో ఆందోళన చెందారు.
పెద్దన్నలైన పోలీసులు
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై పుల్లయ్య అంజయ్య కుటుంబాన్ని కలిసి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. విషయాన్ని సీఐ రమేష్ ద్వారా ఏసీపీ ఉషావిశ్వనాథ్, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డికి వివరించారు. స్పందించిన వారు అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలని నిర్ణయించారు. స్థానిక ఓ ఫంక్షన్‌హాల్లో బుధవారం లత(రేణుక)– లక్ష్మణ్‌కుమార్‌ల వివాహం ఘనంగా జరిపించారు. సీపీ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే శోభ, ఎంపీపీ దూలం బాల గౌడ్, ప్రజాప్రతినిధులుహాజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడు మేడిపల్లి సత్యం రూ. 5,116 అందించారు.
Comments
Please login to add a commentAdd a comment