
సాక్షి, కరీంనగర్: ఐదేళ్ల సుదీర్ఘకాలం కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన వీబీ కమలాసన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రామగుండం సీపీ వి.సత్యనారాయణను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కమలాసన్‌రెడ్డిని ప్రభుత్వం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. వి.సత్యనారాయణ రామగుండంలో సుమారు మూడేళ్ల పాటు కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. అంతకుముందు హైదరాబాద్ వెస్ట్ జోన్, సౌత్ జోన్‌లలో డీసీపీగా వ్యవహరించారు. కాగా.. రామగుండం పోలీస్ కమిషనర్‌గా అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.రమణకుమార్ నియమితులయ్యారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన రమణ కుమార్ హైదరాబాద్‌లో వివిధ శాఖల్లో ఎస్పీ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు.
కరీంనగర్‌పై చెరగని ముద్ర
కరీంనగర్ సీపీగా సుదీర్ఘకాలం పనిచేసిన కమలాసన్‌రెడ్డి శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను వినియోగించారు. కరుడుగట్టిన నేరస్థులపై పీడీయాక్టు అమలు చేశారు. బ్లూకోల్ట్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం అందించిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వాలిపోయే విధంగా చర్యలు తీసుకున్నారు. సీపీ తీసుకున్న చర్యల కారణంగా దేశంలోనే ఉత్తమ పోలీస్‌స్టేషన్‌లుగా చొప్పదండి, జమ్మికుంట ఎంపికయ్యాయి. ప్రజల రక్షణ భద్రతలో దేశవ్యాప్తంగా నాలుగో స్థానం, పీడీయాక్టు అమలులో 2వ స్థానం సాధించారు. కమిషనరేట్ పరిధిలో 10 వేల సీసీ కెమెరాలు లక్ష్యంగా పెట్టుకోగా దాతల సహాయంతో 8,500 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి.
కరీంనగర్ సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో ‘మియావాకీ’ చిట్టడవుల ప్రాజెక్టు ఏర్పాటు చేసి 12,500 మొక్కలు మొదటి దశలో, 14,800 మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచారు. దీంతోపాటు నక్షత్ర, రాశి వనాలను ఏర్పాటు చేసి రాష్ట్రానికే కరీంనగర్ పోలీసులను ఆదర్శంగా నిలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్ వినియోగంలో యువతలో జరిమానాల ద్వారా భయాన్ని కల్పించారు. ఆపరేషన్ నైట్ సేప్టీలో భాగంగా దొంగతనాలకు అడుకట్ట వేశారు. ప్రతిరోజూ కమిషరేట్‌లో నాఖాబందీ నిర్వహించి అక్రమార్కులకు, నేరగాళ్లకు సింహస్వప్నమయ్యారు. కమిషనరేట్‌లో 2 లక్షలకు పైగా ప్రజలు హ్యాక్ ఐ యాప్‌ను వినియోగింపచేశారు.లేక్ పోలీస్‌స్టేషన్, టాస్క్‌ఫోర్స్ విభా గాన్ని ఏర్పాటు చేసి అసాంఘిక శక్తుల ఆటలు కట్టించడంలో తనవంతు పాత్ర పోషించారు.
భూదందాలు, సెటిల్మెంట్‌లు చేసి అక్రమాలకు పాల్పడిన 102 మందిపై పీడీయాక్టు విధించారు. కరీంనగర్ టూటౌన్, త్రీటౌన్, జమ్మికుంట, రామడుగు, ఎల్‌ఎండీ, గంగాధరతో పాటు వివిధ పోలీసుస్టేషన్‌లను ఆధునికీకరించారు. దివ్యాంగులు పోలీసుస్టేషన్‌లకు వచ్చేందుకు వీల్‌చైర్లు, ర్యాంపులు నిర్మించారు. నిజాం కాలం నాటి గోల్‌బంగ్లాను ఆధునికీకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో జిమ్నాజియం ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల ఫీడ్ బ్యాక్‌డే ద్వారా కేసుల పురోగతిని సమీక్షించారు. ఆటోలు, టాక్సీలకు క్యూఆర్ కోడ్ అమలు చేసి ప్రజలకు రక్షణ కల్పించారు.
రామగుండం నుంచి కరీంనగర్‌కు..
కొత్త జిల్లాల అనంతరం ఏర్పాటైన రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వెలివల సత్యనారాయణ కరీంనగర్ సీపీగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2006 బ్యాచ్‌కు చెందిన సత్యనారాయణ డీసీపీగా హైదరాబాద్ వెస్ట్ జోన్, సౌత్ జోన్‌లలో విధులు నిర్వర్తించి సమర్థవంతుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన 2018 సెప్టెంబర్ 26న రామగుండం పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. సుమారు మూడేళ్లపాటు రామగుండం సీపీగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రల పరిరక్షణకు తన వంతు కృషి చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల డివిజన్‌లలో అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. శాసనసభ, పార్లమెంటు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా తనదైన మార్కు చూపించారు. కమలాసన్ రెడ్డి వారసుడిగా కరీంనగర్‌కు రానున్నారు.
ఐదేళ్లకు బదిలీ అయిన కమలాసన్
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కరీంనగర్‌లో ఏర్పాటైన పోలీస్ కమిషనరేట్‌కు 2016 అక్టోబర్ 11న తొలి కమిషనర్‌గా వీబీ కమలాసన్ రెడ్డి నియమితులయ్యారు. సుదీర్ఘంగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలపాటు కమిషనర్‌గా వ్యవహరించిన ఆయన కరీంనగర్‌పై చెరగని ముద్ర వేశారు. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న కమలాసన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సదభిప్రాయం ఉండడంతో ఇన్నేళ్ల పాటు కొనసాగారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కమలాసన్ రెడ్డిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. డీఐజీ హోదాలో ఉన్న ఆయనను డీజీ కార్యాలయానికి అటాచ్ చేయగా, హైదరాబాద్‌లోనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.