సాక్షి, కరీంనగర్ : పోలీసు బదిలీలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో మునిసిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఐ స్థాయి అధికారులను మినహా ఒకే స్టేషన్‌లో మూడు నుంచి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరికీ స్థానభ్రంశం కల్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని వివిధ జిల్లాల్లో సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైల బదిలీల ప్రక్రియను బల్దియా ఎన్నికలతో సంబంధం లేకుండా పూర్తి చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి నిర్ణయించారు. పాత కరీంనగర్ యూనిట్‌గా జరిగే ఈ బదిలీలు, పోస్టింగ్‌ల బాధ్యత డీఐజీ హోదాలో కమలాసన్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు. దీంతో పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌తోపాటు సిద్దిపేట, వరంగల్ అర్బన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని తొమ్మిది పోలీస్‌స్టేషన్లకు చెందిన పోలీసుల బదిలీలు కరీంనగర్ కమిషనర్ నేతృత్వంలోనే జరుగనున్నాయి. ఆయా జిల్లాల ఎస్పీల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా రెండు మూడు రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కమలాసన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
16వ తేదీ వరకు బదిలీ దరఖాస్తుల స్వీకరణ
ఈ ఏడాది మే 31 వరకు ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లుగా పనిచేసిన కానిస్టేబుళ్లు, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హెడ్ కానిస్టేబుళ్లతోపాటు మూడేళ్లుగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సైలను బదిలీ చేయాలని కమిషనర్ కమలాసన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అంతర్గత బదిలీలకు ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏవైనా ఐదు పోలీస్‌స్టేషన్లను ఆప్షన్లుగా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న పోలీస్ సబ్ డివిజన్, సొంత మండలం కాకుండా బదిలీలకు ఆప్షన్లు ఇవ్వాలని ఆదేశించారు.
ఈ మేరకు పోలీసులు ఆయా జిల్లాల ఎస్పీలకు దరఖాస్తులు చేసుకున్నారు. చాలాకాలంగా ఈ స్థాయి పోలీసుల బదిలీలు జరగకపోవడంతో సుమారు 500 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా జిల్లాల ఎస్పీలు దరఖాస్తులను పరిశీలించి కరీంనగర్ కమిషనరేట్‌కు బదిలీలకు అర్హులైన వారి వివరాలు, వారు కోరుకుంటున్న పోలీస్‌స్టేషన్ల డేటాను పంపించారు. అయితే ఒకటి రెండు జిల్లాల నుంచి ఇంకా ప్రతిపాదనలు రాకపోవడంతో కమిషనర్ ప్రక్రియను ప్రారంభించలేదని తెలిసింది. శుక్రవారంలోగా అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో సోమవారం నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
పలు అంశాల పరిశీలన
చాలా కాలం నుంచి జిల్లాల సరిహద్దులు, అటవీ ప్రాంతాలు, సరైన ప్రాధాన్యత లేని మండలాల్లో పనిచేస్తున్న పోలీసులు ఈసారి బదిలీల్లో కరీంనగర్‌తోపాటు కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్స్ సమీపంలోకి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారు ఎక్కువగా కరీంనగర్‌ను ఆప్షన్‌గా ఇచ్చినట్లు సమాచారం. బదిలీల విషయంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా నుంచి వివిధ స్థాయిల్లో 50 మంది బదిలీ జరిగే అవకాశం ఉంటే, ఇతర జిల్లాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా 50 మందికే అవకాశం లభిస్తుంది.
అలాగే ఇతర సర్వీసుల్లో ఉన్నవారి బదిలీల తరహాలోనే పదవీ విరమణకు గల గడువు, భాగస్వామి పనిచేస్తున్న ప్రాంతాలు, మెడికల్ గ్రౌండ్స్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పోలీస్‌స్టేషన్ రైటర్లు, క్రైం టీంలు, ఇతర పరిపాలన విభాగాల్లో పనిచేస్తున్న వారి బదిలీల విషయంలో స్థానికంగా ఉన్న అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐల బదిలీలపై పోలీస్‌వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఎస్‌ఐ, సీఐల బదిలీల విషయంలో ఆచితూచి
కమిషనరేట్ పరిధిలోని ఎస్‌ఐల అంతర్గత బదిలీల విషయంలో కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బుధవారం బదిలీ చేసిన 13 మంది ఎస్‌ఐలలో ముగ్గురు మినహా మిగతా వారంతా వివిధ కారణాల వల్ల అటాచ్డ్ అయిన వారే. వారికి ఖాళీలుగా ఉన్న చోట పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ రేంజ్ పరిధిలో జరిగే ఎస్‌ఐల బదిలీలను డీఐజీ ప్రమోద్‌కుమార్ నేతృత్వంలో జరుగుతాయి. రేంజ్ పరిధిలో బదిలీలకు సంబంధించి డీఐజీ ప్రమోద్‌కుమార్ తీసుకునే నిర్ణయంపై స్పష్టత లేదు. మునిసిపల్ ఎన్నికలకు గడువు పెరిగితే ఎస్‌ఐల బదిలీలు కరీంనగర్ రేంజ్ పరిధిలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక సీఐల బదిలీలకు సంబంధించి ఐజీ నాగిరెడ్డి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. వరంగల్, కరీంనగర్ రేంజ్ పరిధిలలో ఈ బదిలీల ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అయితే మునిసిపల్ ఎన్నికలు ముగిసే వరకు సీఐ, డీఎస్‌పీల స్థాయిలో బదిలీలు ఉండకపోవచ్చని ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment