పోలీస్‌ అవుతానని కలలో కూడా అనుకోలే..! | Karimnagar Police Commissioner Kamal Hassan Reddy Special Interview | Sakshi
Sakshi News home page

నేను రైతుబిడ్డనే.. 

Published Sun, May 26 2019 10:43 AM | Last Updated on Sun, May 26 2019 1:56 PM

Karimnagar Police Commissioner Kamal Hassan Reddy Special Interview - Sakshi

కమలాసన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ రోడ్లపై టూ వీలర్‌ నడిపే వారిలో 90 శాతం మంది హెల్మెట్‌ తప్పనిసరిగా ధరిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేందుకు జనం జంకుతున్నారు. చిన్న చిన్న సంఘటనలు మినహా మత పరమైన గొడవలు లేవు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వి.బి.కమలాసన్‌రెడ్డి రెండున్నరేళ్లలో సాధించిన ఘనత ఇది. మెదక్‌ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి... అంచెలంచెలుగా ఎదిగి..  నిబద్ధతతో ప్రజల  అభిమానాన్ని చూరగొన్న ఐపీఎస్‌ అధికారి ఆయన. శాసనసభ, పంచాయతీ, పార్లమెంటు, ప్రాదేశిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ముగించిన కమలాసన్‌రెడ్డితో ఈ వారం ‘సాక్షి’ పర్సనల్‌ టైం...

ఉమ్మడి కుటుంబంగానే  ఇప్పటికీ...
మాది మెదక్‌ జిల్లా శంకరంపేట మండలం దరిపల్లి గ్రామం. మా నాన్న గోవిందరెడ్డి రైతుగానే గాక పండితుడిగా చుట్టుపక్కల గ్రామాల్లో పేరున్న వ్యక్తి. మంచి చెడుల గురించి తెలుసుకునేందుకు, ముహూర్తాల కోసం నాన్న దగ్గరికి వచ్చేవారు. నేను ఇంటర్‌ చదువుతున్నప్పుడే మా నాన్న చనిపోయారు. మేం ఐదుగురం తోబుట్టువులం. పెద్దన్న పురుషోత్తంరెడ్డి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో సూపరింటెండెంట్‌గా రిటైర్డ్‌ అయ్యారు. రెండో అన్న జగజ్జీవన్‌రెడ్డి వ్యవసాయం. చెల్లెళ్లు ఒకరు హైదరాబాద్‌లో, ఇంకొకరు యూఎస్‌లో సెటిల్‌ అయ్యారు. ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. జీవనం కోసం ఎవరు ఎక్కడున్నా... అందరం దరిపల్లిలో కలుస్తుంటాం. తండ్రి సంపాదించిన 25 ఎకరాల భూమి కూడా ఉమ్మడి ఆస్తిగానే ఉంది.

కమలాసన్‌ అంటే కమలం పైన ఆసీనులైన బ్రహ్మ అని..
మానాన్న పండితుడు అని చెప్పాను కదా. సంస్కృతం మీద మంచి పట్టుంది. ఆయన తన ముగ్గురు కొడుకులకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పేర్లు వచ్చేలా నామకరణం చేశారు. పెద్దన్న పేరు పురుషోత్తంరెడ్డి . పురుషోత్తముడు అంటే విష్ణువు , రెండో అన్నయ్య జగజ్జీవన్‌రెడ్డి అంటే జగత్తును నడిపించే శివుడు. కమలాసన్‌ అంటే కమలంపైన ఆసీనుడయ్యే బ్రహ్మ. అలా నాకు కమలాసన్‌రెడ్డి అనే పేరు. సినీయాక్టర్‌ కమల్‌హాసన్‌ నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు సినిమా నటుడిగా తెరపైకి వచ్చాడు. అయితే నేను చదువుకునేటప్పుడు గానీ, డీఎస్‌పీ ట్రైనింగ్‌లో గానీ నా స్నేహితులు సినిమా యాక్టర్‌ పేరేనని అనుమానపడేవారు. ఇది మా నాన్న పెట్టిన పేరు.

చదవు దరిపల్లి నుంచి హైదరాబాద్‌ వయా మహబూబ్‌నగర్‌
నా చదువు ఐదో తరగతి వరకు దరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మేనమామ ఊరు ధర్మవరం అనే గ్రామంలో సాగింది. మహబూబ్‌నగర్‌లోని ఎంజీరోడ్డు హైస్కూల్‌లో పదో తరగతి  1978–79వ బ్యాచ్‌. తరువాత హైదరాబాద్‌లోని బడీచౌడీలోని చైతన్య కళాశాల(ఇప్పుడు లేదు)లో ఇంటర్‌. సికింద్రాబాద్‌ సర్ధార్‌ పటేల్‌ కళాశాలలో డిగ్రీ. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశా. 1990లో ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదివా. యూనివర్సిటీలో చదువు నా జీవిత గమనాన్ని మార్చింది. గ్రూప్స్‌కు ప్రిపేర్‌ కావడం, ఉద్యోగాల వేట యూనివర్సిటీ నుంచే మొదలైంది. నేను డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోనే చదివాను. తెలుగు అంటే చాలా ఇష్టం.

పోలీస్‌ అవుతానని కలలో కూడా అనుకోలే..!
ఉద్యోగ అన్వేషణలో 1990లో ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2ఎ రాస్తే, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ అధికారిగా ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తూనే కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అయ్యా. మళ్లీ గ్రూప్‌–2ఏతోపాటు గ్రూప్‌–1 రాశా. గ్రూప్‌–2ఏలో తహసీల్దార్‌ ఉద్యోగం వచ్చింది. జాయిన్‌ కాలేదు. 1993లో గ్రూప్‌–1లో సెలక్ట్‌ అయ్యా. ఆర్డీవోకు తొలి ప్రాధాన్యత ఇచ్చా. రెండో ఆప్షన్‌ డీఎస్‌పీ. నాకొచ్చిన మార్కుల ఆధారంగా డీఎస్‌పీగా సెలక్ట్‌ అయ్యా. అయితే నేను చదువుకున్నప్పటి నుంచి ఎప్పుడూ పోలీస్‌ శాఖలోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. గ్రూప్‌–1లో వచ్చిన మార్కులతోనే డీఎస్‌పీని అయ్యా. తరువాత 2004 బ్యాచ్‌ ఐపీఎస్‌గా వివిధ హోదాల్లో పనిచేస్తున్నా.
 
పోలీసులకే కాదు.. ప్రతీ ఒక్కరికి ఫిట్‌నెస్‌ తప్పనిసరి
పోలీసు ఉద్యోగంలో ఫిట్‌నెస్‌ తప్పనిసరి. ఇప్పటికీ నేను వ్యాయామం, వాకింగ్‌ వంటివి చేస్తూ శరీరాన్ని అదుపులో పెట్టుకుంటాను. మన ఆహార అలవాట్లు, శారీరక శ్రమనే ఫిట్‌నెస్‌కు ప్రధానం. లిమిటెడ్‌ ఫుడ్‌ తిని, ప్రతిరోజు 10వేల అడుగులు నడక సాగిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని నమ్ముతా. నేను కమిషనర్‌గా వచ్చిన తరువాత స్టాఫ్‌కు ‘పునరాకృతి’ అనే కార్యక్రమం ద్వారా ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ ఇప్పించాను. నాకు ఈత అంటే ఇష్టం. చిన్నప్పుడు చెరువులు, బావుల్లో ఈత కొట్టేవాళ్లం. హైదరాబాద్‌లో స్విమ్మింగ్‌పూల్స్‌లో ఈదేవాణ్ని.

చిన్ననాటి ఫ్రెండ్స్‌ టచ్‌లో ఉన్నారు
మా వూరిలో చదువుకున్నప్పటి ఫ్రెండ్స్‌తోపాటు ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ నాటి స్నేహితులంతా ఇప్పటికీ టచ్‌లో ఉంటారు. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లడాన్ని ఇష్టపడతాను. రైతు కుటుంబం నుంచి రావడం వల్ల వ్యవసాయం అన్నా, రైతులు అన్నా నాకు చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో వ్యవసాయ పనులు చేసేవాడిని. అన్నయ్య ఇప్పటికీ రైతుగా ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నారు. 

నర్సంపేట డీఎస్‌పీగా చాలెంజింగ్‌ జాబ్‌
నర్సంపేట డీఎస్‌పీగా పనిచేసిన 1997–2000 మధ్య కాలంలో నక్సలైట్‌ ప్రాబల్యం అధికంగా ఉండేది. పీపుల్స్‌వార్‌కు గట్టి పట్టున్న ప్రాంతం. కొత్తగూడ మండలం కోమట్లగూడ గ్రామంలో పోలీసులు అంటేనే జనం భయపడే పరిస్థితి. శత్రువులుగానే చూసేవారు. ఈ పరిస్థితుల్లో కోమట్లగూడలో భారీ ఎత్తున మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయించాను. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆ గ్రామ ప్రజలతో మమేకమై పోలీసులు శ్రేయోభిలాషులు అనే అభిప్రాయాన్ని కలిగించాను.

1998లో నర్సంపేటలో మూడు రోజులపాటు డివిజన్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఏర్పాటు చేయించాను. కోకో, కబడ్డీ, వాలీబాల్‌ గేమ్స్‌ను పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించడం మరిచిపోని సంఘటన. 300 టీమ్స్‌ పాల్గొన్న ఈ స్పోర్ట్స్‌ మీట్‌ను చూసేందుకు 15వేల మంది తరలివచ్చారు. చివరి రోజు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయించాం. ఈ కార్యక్రమం ద్వారా పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న దృక్పథం మారింది. యూత్‌ను దగ్గరికి తీశాం. శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతగా అంటే అప్పట్లో పేరున్న ముగ్గురు నక్సలైట్లు ఎన్‌కౌంటర్‌లో చనిపోతే వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో హింస రేగింది. నర్సంపేటలో చిన్న సంఘటన కూడా చోటుచేసుకోలేదు. అలాగే నర్సంపేట డివిజన్‌లో గంజాయి సాగును అరికట్టడం, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా కార్డన్‌ సెర్చ్‌కు అంకురార్పణ చేసి, ప్రజల్లో ధైర్యం కల్గించడం... 

కరీంనగర్‌ పోలీస్‌  కమిషనర్‌గా సంతృప్తి 
కరీంనగర్‌ ప్రజలు అత్యంత చైతన్యవంతులు. మంచి చెడులు వివరించి, ఏదైనా మార్పు తీసుకువస్తే తూచా తప్పకుండా పాటిస్తారు. కరీంనగర్‌లో టూ వీలర్‌ హెల్మెట్‌ డ్రైవింగ్‌ గురించి వివరిస్తే , 90 శాతానికి పైగా సక్సెస్‌ అయింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు చాలావరకు తగ్గాయి. ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తున్నారు. నేను కరీంనగర్‌లో చేపట్టిన ప్రతీ చర్యకు ప్రజల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి పూర్తి మద్దతు లభించింది. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించబోం అనే సందేశాన్ని పంపించడంతో ప్రజలు ఎడ్యుకేట్‌ అయ్యారు. మత పరమైన గొడవలు, నేరాలు చాలా వరకు తగ్గాయి. చిన్న చిన్న సంఘటనలు జరిగినా, ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవడంతో అది సాధ్యమైంది. 

అడ్వకేట్‌గా, ఇంటి ఇల్లాలిగా మా రాధిక సక్సెస్‌
1993లో డీఎస్‌పీగా ఉద్యోగంలో చేరిన తరువాత రాధికతో వివాహం జరిగింది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. వాళ్లది హైదరాబాద్‌ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం చేసి హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేసేవారు. స్టాండింగ్‌ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌ ఈపీఎఫ్‌ లీగల్‌ అడ్వయిజర్‌గా వ్యవహరించారు. మాకు ఇద్దరు పిల్లలు. బాబు రాజశేఖర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, చెన్నైలో జాబ్‌ చేస్తున్నారు. పాప దీపిక హైదరాబాద్‌ డెక్కన్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ఫస్ట్‌ ఇయర్‌. రాధిక హైకోర్టు అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తూనే పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దింది. నేను పోలీస్‌ ఆఫీసర్‌గా బిజీగా ఉన్నప్పటికీ, పిల్లలకు అన్నీ తానై చూసుకొంది. పిల్లలు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఫ్యామిలీ పరంగా హ్యాపీ.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

వ్యాయామం చేస్తున్న కమలాసన్‌రెడ్డి, భార్య, కూతురితో కమలాసన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement