French Serial Killer Charles Sobhraj Life Story Wife Full Details - Sakshi
Sakshi News home page

Charles Sobhraj: భార్యతోసహా నమ్మినోళ్లందరినీ నట్టేట ముంచి.. గుప్పిట ఇసుకలా జారిపోతూ..

Published Thu, Dec 22 2022 7:05 PM | Last Updated on Thu, Dec 22 2022 8:02 PM

French Serial Killer Charles Sobhraj Life Story Wife Full Details - Sakshi

ఛార్లెస్‌ శోభరాజ్‌.. ఫ్రెంచ్‌ సీరియల్‌కిల్లర్‌. సినిమాలు, న్యూస్‌ల ద్వారా చాలామందికి ఈ పేరు పరిచయం ఉండే ఉంటుంది. కామెడీ సినిమాల్లోనూ ఈ పేరు రిఫరెన్స్‌ కనిపిస్తుంటుంది. కానీ, ఊహాకు కూడా అందనంత కరడుగట్టిన నేరస్తుడు ఇతను. నేరాలు చేయడంలో శోభరాజ్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. నేరం చేశాక దొరక్కుండా ఉండేందుకు ఎంతకైనా తెగిస్తాడు. ఆ తీరు ఓ పామును తలపిస్తుంది. అందుకేనేమో అతన్ని ‘ది సర్పెంట్‌’ అని కూడా పిలుస్తుంటారు. ఇతని చేతిలో బలైన పర్యాటకులు బికినీలో శవాలుగా తేలడంతో.. ‘బికినీ కిల్లర్‌’గా ఛార్లెస్‌ శోభరాజ్‌కు పేరు ముద్ర పడిపోయింది. 

హ్యాండ్సమ్‌ లుక్‌, స్టైలిష్‌ వేషధారణ, ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలిగే ఆ రూపం వెనుక.. ముసుగు గనుక తొలగిస్తే క్రూరమైన స్వభావం బయటపడుతుంది. నమ్మిన్నోళ్లను నట్టేట ముంచుతూ.. తాను మాత్రం చట్టాలకు దొరక్కకుండా తిరగడం ఇతని ప్రత్యేకత.  ఆ తప్పించుకోవడం కోసం అతను వేసే స్కెచ్‌.. సినిమాటిక్‌గా ఉంటుంది. జైలుకు వెళ్లొచ్చినా.. క్రిమినల్‌గా తనకు దక్కిన అపకీర్తిని సైతం దర్జాగా ఆస్వాదించిన నైజం అతనిది. సినిమాల్లో చూపించే ప్రొఫెషనల్‌ కిల్లర్‌ల పాత్రకు స్ఫూర్తి.. ఛార్లెస్‌ శోభరాజ్‌ వ్యక్తిత్వం.  1963 నుంచి 1976 మధ్యకాలంలో నేరాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది . 70వ దశకంలో..  పర్వతశ్రేణుల గుండా కాలినడకన సంచరించే పాశ్చాత్య పర్యాటకులనే(Hippie trail)లక్ష్యంగా చేసుకుని నేరాలకు తెగబడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 మంది టూరిస్టులను చంపిన ఈ ఫ్రెంచ్‌ సీరియల్‌ కిల్లర్‌.. ఒక్క థాయ్‌లాండ్‌లోనే 14 మందిని హతమార్చాడు. థాయ్‌ బాధితుల్లో చాలామంది బికినీలో శవాలుగా కనిపించడంతో అతనికి బికినీ కిల్లర్‌ అనే ముద్రపడింది. 


తండ్రి ఉన్నా లేనట్లే!
వియత్నాంలోని సైగాన్‌(ప్రస్తుతం హో చి మిన్హ్‌ సిటీ) సువిశాలమైన నగరం. అక్కడ భారత్‌కు చెందిన వ్యాపారవేత్త శోభరాజ్‌ హాట్చంద్‌ భవ్నాని, ఓ దుకాణంలో పని చేసే ట్రన్‌ లోవాంగ్‌ ఫున్‌లకు డేటింగ్‌ చేశారు. ఈ జంటకు సహజీవనం ద్వారా పుట్టిన బిడ్డ ఛార్లెస్‌ శోభరాజ్‌. ఏప్రిల్‌ 6వ తేదీన 1944లో జన్మించిన ఆ బిడ్డ పూర్తి పేరు చార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హాట్‌చంద్ భవనాని. బిడ్డ పుట్టిన కొన్నిరోజులకే ఆ తండ్రి దూరమయ్యాడు. తోడు వదిలేసి వెళ్లిపోవడంతో.. ఛార్లెస్‌ తల్లి ఫ్రాన్స్‌కు వలస వెళ్లింది. అక్కడ ఓ ఫ్రెంచ్‌ ఆర్మీ లెఫ్టినెంట్‌ను వివాహం చేసుకుంది. అయితే.. ఆ జంటకు పుట్టిన సంతానం కారణంగా తనను నిర్లక్ష్యం చేస్తున్నారేమో అనే భావనలోకి కూరుకుపోయాడు ఛార్లెస్‌ శోభరాజ్‌. మానసికంగా దిగజారి కుంగిపోయాడు. సమాజంపై, బంధాలపై విరక్తి చెందాడు.  అలా అతని బుర్రలో టీనేజీ వయసులోనే క్రూర-నేర స్వభావం మొలకలెత్తడం మొదలైంది.  యవ్వనంలో ఉన్నప్పుడు చిన్న చిన్న నేరాలకు పాల్పడడం మొదలుపెట్టాడు.

ఛార్లెస్‌ శోభరాజ్‌.. ఓ చోరీ కేసులో 1963లో తొలిసారి జైలుకు వెళ్లాడు. కానీ, అప్పటికే అతని బుర్ర నిండా క్రిమినల్‌ ఆలోచనలే నిండిపోయి ఉన్నాయి. దీంతో అక్కడి అధికారులను మచ్చిక చేసుకుని.. సకల భోగాలు అనుభవించాడు. ఆపై ఓ రిచ్‌ వలంటీర్‌తో పరిచయం పెంచుకున్నాడు. పెరోల్‌ మీద బయటకు వచ్చిన ఛార్లెస్‌ శోభరాజ్‌.. పిక్‌పాకెట్‌ నేరాల నుంచి పెద్ద పెద్ద దందాలతో ప్యారిస్‌లో బడా క్రిమినల్‌గా ఎదిగాడు. ఛార్లెస్‌ శోభరాజ్‌ హత్యకు పన్నే కుట్రలు సైతం ప్లానింగ్‌గా ఉంటాయి. బాధితులకు తాగే వాటిలో, తినే వాటిలో విషపు గుళికలు ఇచ్చేవాడు. ఆయుష్షు గట్టిదైతే ప్రాణాలతో బయటపడేవాళ్లు. అలాంటి ఘటనతోనే మరోసారి అరెస్ట్‌ అయ్యాడు ఛార్లెస్‌ శోభరాజ్‌.   

1976లో.. కొందరు కాలేజీ విద్యార్థులపై డ్రగ్స్‌, విషపు గోళీలతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే వాళ్లంతా ప్రాణాలతో బయటపడడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జులై నెలలో శోభరాజ్‌ అరెస్ట్‌ అయ్యాడు. మరికొద్ది రోజుల్లో శిక్షా కాలం ముగుస్తుందనగా.. పుట్టినరోజు వంకతో జైలు హోం గార్డులకు మత్తు మందు కలిపిన స్వీట్లు పంచి తప్పించుకున్నాడు. 


ఛార్లెస్‌ శోభరాజ్‌(యవ్వనంలో..)

ప్రేమ.. పెళ్లి.. దగా
యవ్వనంలో ఛార్లెస్‌ శోభరాజ్‌ నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మొదటిసారి జైలుకు పోయి వచ్చాక.. ప్యారిస్‌లో విచ్చల విడిగా దోపిడీలు, కుంభకోణాలకు పాల్పడ్డాడు. ఆ సమయంలోనే.. చంతల్‌ కొంపాగ్నోన్‌ అనే పర్షియన్‌ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఈ ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకునే టైంకి.. శోభరాజ్‌ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎనిమిది నెలల శిక్ష తర్వాత బయటకు వచ్చి.. కొంపాగ్నోన్‌ను వివాహంచేసుకున్నాడు.  అయితే.. మళ్లీ అరెస్ట్‌ను తప్పించుకునేందుకు గర్భవతిగా ఉన్న భార్యతో కలిసి దేశం విడిచి పారిపోయాడు. దారిలో ఫేక్‌ డాక్యుమెంట్లతో ప్రయాణిస్తూ.. టూరిస్టులను దోచుకుని.. చివరికి ముంబైకి చేరుకున్నాడు. అక్కడే కూతురు పుట్టింది. ఉష అనే పేరు పెట్టుకున్నారు ఆ దంపతులు. భార్య కోరిక మేరకు నేరాలకు బ్రేక్‌ వేసినప్పటికీ.. కార్ల దొంగతనం, స్మగ్లింగ్లు చేసుకుంటూ పోయాడు రహస్యంగా. ఆపై ఈజీ మనీ కోసం గ్యాంబ్లింగ్‌ వైపు అడుగులు వేశాడు.  1973లో ఢిల్లీ హోటల్‌ అశోకలో నగల దొంగతనం కేసులో పట్టుబడ్డాడు.  భార్య సహకారంతో అనారోగ్యం డ్రామా ఆడి తప్పించుకున్నాడు. అయితే గంటల వ్యవధిలోనే తిరిగి వెంటనే పట్టేసుకున్నారు. ఆపై కన్నతండ్రి సహకారంతో జైలు నుంచి విడుదలై.. కాబూల్‌(అఫ్గనిస్తాన్‌) పారిపోయాడు. అక్కడ టూరిస్టులను దొచుకుంటూ.. మళ్లీ అరెస్ట్‌ అయ్యాడు. 

అక్కడ ఢిల్లీ తరహాలో స్కెచ్‌ వేసి తప్పించుకోవాలనుకున్నాడు. అనారోగ్యం నటించి.. ఆపై హాస్పిటల్‌ గార్డులకు మత్తుమందు ఇచ్చి ఎస్కేప్‌ అయ్యాడు. ఈ క్రమంలో.. భార్యా కూతురిని అక్కడే వదిలేసి ఇరాన్‌ పరారయ్యాడు. దీంతో చంతల్‌ కొంపాగ్నోన్‌ గుండె బద్ధలు అయ్యింది. బతిమాలి బిడ్డను ప్యారిస్‌కు భద్రంగా పంపించి.. తానూ శిక్షాకాలం పూర్తయ్యాక అక్కడికి చేరుకుంది. అప్పటి నుంచి ఆమె శోభరాజ్‌ ముఖం కూడా చూడలేదు.. చూడాలనుకోవట్లేదు!.

ఇరాన్‌ నుంచి నుంచి మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో తన బంధువు ఆండ్రె భాగస్వామ్యంతో దోపిడీలు, నేరాలకు పాల్పడ్డాడు. గ్రీస్‌లో ఈ ఇద్దరూ అరెస్ట్‌​ అయ్యారు. అక్కడా పోలీసుల కళ్లు గప్పి ఆండ్రెను వదిలేసి పారిపోయాడు. ఆపై పలు దేశాలకు దోపిడీలకు, హత్యలకు పాల్పడ్డ శోభరాజ్‌.. తన నేరాలకు సహకరించేలా అనుచర గణం తయారు చేసుకుని.. సమయం వచ్చినప్పుడు వాళ్లను పోలీసులకు ఇరికిస్తూ.. తాను మాత్రం దొరక్కుండా తప్పించుకుని తిరుగుతుండేవాడు. 

భారత్‌లో ఛార్లెస్‌ శోభరాజ్‌ 1976 నుంచి 21 ఏళ్లపాటు జైలు  శిక్ష అనుభవించాడు. అందుకు కారణం..  ఫ్రెంచ్‌ టూరిస్టులతో వెళ్తున్న ఓ బస్సులో విషప్రయోగానికి పాల్పడి.. అందులో ఓ ఇజ్రాయెల్‌ పౌరుడ్ని చంపినందుకు.  ఆపై విడుదలై.. పారిస్‌కు వెళ్లాడు. తిరిగి 2003లో నేపాల్‌కు చేరుకుని.. జంట హత్యల కేసు, నకిలీ పాస్‌పోర్ట్‌ వినియోగం నేరాలకుగానూ జీవిత ఖైదుతో శిక్ష అనుభవించాడు. చివరికి.. డిసెంబర్‌ 21, 2022న నేపాల్‌ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అతని విడుదలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.

78 ఏళ్ల వయసులో ఆరోగ్యం క్షీణించడం, సత్‌ప్రవర్తన, దాదాపు శిక్షాకాలం(95 శాతం) పూర్తి చేసుకోవడం కారణాలతో.. విముక్తి కల్పించింది నేపాల్‌ అత్యున్నత న్యాయస్థానం. కానీ, నేపాలీ పోలీసులు మాత్రం అతని విడుదలకు ససేమీరా అంటున్నారు. సుప్రీం కోర్టు ఏ కేసులో అతన్ని విడుదల చేయాలని చెప్పిందో స్పష్టత లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

2010లో ఇండో-నేపాలీ ఇంటర్‌ప్రెటర్‌, యువ లాయర్‌ నిహిత బిస్వాస్‌ను జైల్‌లోనే వివాహం చేసుకున్నాడు. ఆమె ఛార్లెస్‌ శోభరాజ్‌ తరపున వాదించిన లాయర్‌ కూతురు., అంతేకాదు.. వయసులో 44 ఏళ్లు చిన్నది కూడా. ఆకర్షనీయమైన అతని రూపానికి తాను ముగ్ధురాలిని అయ్యానని ప్రకటించుకుందామె. 2017లో గుండె ఆపరేషన్‌ కోసం రక్తదానం సైతం చేసిందామె. జైలు నుంచి భర్తను విడిపించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాల గురించి.. అంతర్జాతీయ మీడియా తరచూ కథనాలు ప్రచురిస్తూ వచ్చేది.  

అసలు హత్యలెందుకు?
డ్రగ్స్‌, విషం, మత్తు మందు.. తినే తాగే వాటిల్లో కలిపి నేరాలకు పాల్పడుతుంటాడు ఛార్లెస్‌ శోభరాజ్‌. ఆపై చంపేసి.. దోచుకుంటాడు. కొన్ని సందర్భాలు..  చంపిన వాళ్ల ఐడెంటిటీలనే ఉపయోగించుకుని ఊళ్లు పట్టుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతను 20 మందిని చంపినట్లు చెప్తుంటారు. కానీ, అందులో పదిహేను మాత్రమే అతని ఖాతాలో ధృవీకరణ అయ్యింది. మొత్తంగా అతను 30 హత్యలకు పాల్పడి ఉంటారని ఒక అంచనా. ఈ నేర చరిత అంతటితోనే ఆగిపోలేదు. ఫ్రాన్స్‌, గ్రీస్‌, మలేషియా, ఇరాన్‌, టర్కీ, అఫ్గనిస్తాన్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, భారత్‌, థాయ్‌లాండ్‌లో.. నేరాలకు పాల్పడ్డాడు. ఛార్లెస్‌ శోభరాజ్‌ నేరచరిత నుంచి బయటకు రాని విషయాలెన్నో.  అసలు నేరస్థుడిగా ఎందుకు మారాడు? ఆ నేరాల వెనుక ఉద్దేశం ఏంటన్న దానిపై అతను పెదవి విప్పకపోవడంతో.. ఒక క్లారిటీ అంటూ లేకుండా పోయింది. 

ఛార్లెస్‌ శోభరాజ్‌ మీద.. నాలుగు బయోగ్రఫీలు, మూడు డాక్యుమెంటరీలతో పాటు మే ఔర్‌ ఛార్లెస్‌ పేరిట ఓ హిందీ చిత్రం వచ్చింది. అలాగే.. 2021లో ది సెర్పెంట్‌ పేరుతో బీబీసీ/నెట్‌ఫ్లిక్స్‌ వాళ్లు ఎనిమిది భాగాలుగా తీసిన డ్రామా సిరీస్‌ కూడా పాపులారిటీ సంపాదించుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement