Special Story On PM Modi And BJP Politics In 2022 Year - Sakshi
Sakshi News home page

బీజేపీలో మోదీ మార్క్‌.. నడ్డాకు పదవీ గండం!

Published Sun, Jan 1 2023 4:40 PM | Last Updated on Sun, Jan 1 2023 6:24 PM

Special Story On PM Modi And BJP Politics In 2022 Round Up - Sakshi

దేశ రాజకీయాల్లో కమలం పార్టీ హవా అప్రతిహాతంగా కొనసాగుతోంది. 2014లో మొదలైన బీజేపీ సునామీ దేశాన్ని చుట్టేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం, హోం మంత్రి అమిత్ షా చాణక్యంతో కాషాయ సేన విపక్షాలను తునాతునకలు చేస్తూ ముందుకు సాగుతోంది. బీజేపీ బండిని జోడెద్దుల లాగా ఈ ఇద్దరు నేతలే తమ భుజస్కందాలపై పెట్టుకుని లాగుతున్నారు. దేశంలోని ఏ పార్టీకి అందనంత ఎత్తులో బీజేపీని నిలబెట్టగలిగారు. ఈ ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో అధికారం పోగొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. నడ్డా గ్రూప్ రాజకీయాలే హిమాచల్లో కొంప ముంచాయనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే నడ్డాను సాగనంపడం ఖాయమనే వార్తలు గుప్పుమంటున్నాయి.

గుజరాత్‌లో సక్సెస్..
గుజరాత్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 151 సీట్లు గెలిచి నరేంద్ర మోదీ, షా ద్వయం ప్రభంజనాన్ని సృష్టించింది. వరుసగా ఏడోసారి గుజరాత్లో బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు బెంగాల్‌లో కమ్యూనిస్టుల పేరుతో ఉన్న చరిత్రను సమం చేశారు. ఈ సంవత్సరమే జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ సునాయాసంగా తన అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదిమ గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేసి ప్రతిపక్షాలను చెల్లా చెదురు చేయడంలో విజయం సాధించారు. తొలుత ప్రతిపక్ష క్యాంపులో చేరిన జేడీఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పార్టీలు సైతం తిరిగి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి మోదీ కల్పించారు. విపక్షాల మధ్య ఐక్యతను దెబ్బతీయడంలో మోదీ సఫలీకృతులయ్యారు. 60 శాతానికి పైగా ఓటింగ్ సాధించి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

కలిసొచ్చిన సమీకరణాలు..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థి జగదీప్ ధంకడ్ సునాయాసంగా గెలుపొందారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన జగదీప్ ధంకడ్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి నరేంద్ర మోదీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే, దాని వెనుక మోదీ రాజకీయ ఎత్తుగడ కనిపించింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిన్నర పాటు ఢిల్లీని ముట్టడించిన రైతుల్లో అత్యధికులు జాట్ వర్గానికి చెందిన వారే. ఈ నేపథ్యంలో జాట్ రైతులను సంతృప్తి పరిచేందుకు ఆ వర్గానికి చెందిన జగదీప్ ధంకడ్‌ను ఎంపిక చేసి జాట్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అంతకుముందే పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగదీప్ ధంకడ్ తనదైన స్టైల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇబ్బంది పెడుతూ నరేంద్ర మోదీ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలన్నీ జగదీప్ ధంకడ్‌కు కలిసి వచ్చాయి. 

సంఖ్య పెరగలేదు.. బలం తగ్గలేదు
2022 సంవత్సరం ప్రారంభంలో బీజేపీకి 17 రాష్ట్రాల్లో అధికారం ఉంది. ఏడాది ముగిసే సరికి ఒక రాష్ట్రం తగ్గినా.. మరో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర బీజేపీ అధీనంలోకి వచ్చింది. బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ కూటమి నుంచి కాంగ్రెస్ కూటమిలోకి జంప్ చేశారు.  మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే సహకారంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూలగొట్టి.. బీజేపీ తిరిగి ఆ రాష్ట్రాన్ని తన చేతిలోకి తీసుకోగలిగింది. ఒక రాష్ట్రం చేజారినా మరో రాష్ట్రాన్ని దక్కించుకొని తన 17వ రాష్ట్రాన్ని కాపాడుకుంది. అయితే, ఏడాది చివరలో హిమాచల్ ప్రదేశ్ చేజారడంతో ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది. బీజేపీలో నరేంద్ర మోదీ మాటే వేదవాక్కుగా కొనసాగుతోంది. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోదీ అవతరించడంతో మిగిలిన నాయకులందరూ ఆయన మాటే శిరోధార్యంగా భావించి ముందుకు నడుస్తున్నారు. మోదీకున్న ప్రజాదరణను ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకునేందుకు అమిత్ షా అత్యంత పదునైన వ్యూహాలు రూపొందిస్తున్నారు. సుశిక్షితులైన బీజేపీ కార్యకర్తల యంత్రాంగం, ఆర్ఎస్ఎస్ అండతో పార్టీ పకడ్బందీగా ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది.

కమలం వర్సెస్ ఎవరు?
ఎనిమిదేళ్ళ నుంచి అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీకి అపారమైన వనరులు అందుబాటులోకి వచ్చాయి. ఖర్చుకు వెనకాడకుండా పార్టీ ప్రచారాన్ని దూకుడుగా కొనసాగిస్తోంది. దీనికి తోడు కార్పొరేట్ వ్యూహకర్తలు రంగంలోకి దిగి, క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని ఎప్పటికప్పుడు పసిగట్టి పార్టీకి చేరవేస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తూ మిగిలిన పార్టీలకంటే ఒక అడుగు ముందే ఉంటున్నారు. తన పార్టీని బలోపేతం చేసుకోవడంతోపాటు ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడంలోనూ బీజేపీ అదే దూకుడును ప్రదర్శిస్తోంది. రకరకాల ఎత్తుగడలతో విపక్షాలను చెల్లాచెదురుచేసి తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంటోంది. మిగిలిన పార్టీలతో పోలిస్తే బీజేపీ 90 శాతం సక్సెస్ రేట్ తో దూసుకుపోతోంది. బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య తీవ్రమైన పోరాటం కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ బీజేపీని ఎదుర్కోగలిగిన ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ కొనసాగుతోంది.

2023లో ఎన్నో సవాళ్లు..
వచ్చే ఏడాది లోక్‌సభకు ఎన్నికల సన్నాహక సంవత్సరం. కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , చత్తీస్ఘడ్ లాంటి ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదింటిలో నాలుగు రాష్ట్రాలలోనూ బీజేపీ- కాంగ్రెస్ ముఖాముఖి తలపడుతున్నాయి. తెలంగాణలో మాత్రం త్రిముఖ పోటీ జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ఎజెండా వేర్వేరుగా ఉన్నప్పటికీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ కూటమికి మరింత నైతిక బలం, జోష్ లభిస్తుంది.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

చదవండి:  పొలిటికల్ రివ్యూ: 2022లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మార్కులెన్ని?

పొలిటికల్ రివ్యూ - 2022లో చీపురుకున్న క్రేజ్ ఎంత?

పొలిటికల్ రివ్యూ: 2022లో చేయి కాలిందా? పట్టు జారిందా?

జనసేన పవన్‌ వీకెండ్‌ విజిట్స్‌.. కథ అడ్డం తిరిగిందే?

పొలిటికల్ రివ్యూ : ఏపీ బీజేపీని కోవర్టులే దెబ్బతీస్తున్నారా?

పొలిటికల్ రివ్యూ: 2022లో ఫ్యాన్ స్పీడ్ ఎంత?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement