AP CM YS Jagan Birthday Special 2022 Special Story - Sakshi
Sakshi News home page

CM YS Jagan Birthday Special: ప్రత్యేక కథనం.. నేటి రాజకీయాల్లో జననేత ముమ్మాటికీ ఓ సంచలనం

Published Tue, Dec 20 2022 9:27 PM | Last Updated on Thu, Dec 22 2022 12:52 PM

AP CM YS Jagan Birthday Special 2022 Special Story - Sakshi

ఓ సాహసి.. ఓ స్వాప్నికుడు.. ఓ దార్శనికుడు
రాజకీయాల్లో కొత్త ఒరవడి
వైఎస్‌ జగన్‌.. తెలుగు వారి ఆత్మబంధువు
ప్రతి పల్లెగడపా కళకళలాడాలి.
చదువులమ్మ ప్రాంగణాలు వెలగాలి.
అందరికీ ఆరోగ్యశ్రీ.. అందాలి

ప్రజాసంక్షేమం.. రాష్ట్రాభివృద్ధే
శ్వాసగా.. ధ్యాసగా.. ముందడుగులేస్తున్న పీపుల్స్ లీడర్‌పై ప్రత్యేక కథనం.. 

జగన్‌...జగన్‌...జగన్‌ ఈ రోజు ఇటు ప్రతిపక్షల్లోనూ, అటు ప్రజల్లోనూ ప్రతి రోజూ  ప్రతిధ్వనిస్తున్న పేరు. 
ఆ పేరంటేనే ఓ సంచలనం. ఆ పిలుపంటేనే ఓ ప్రభంజనం. 
సకల వర్గాల ప్రజలతో మమేకమవుతున్న వై.ఎస్‌. జగన్‌.. ది యూత్‌ ఐకాన్‌.
రాజకీయాల్లో ట్రూ లీడర్‌.

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. 
డాక్టర్‌గారి ముద్దుల కొడుకు. రాజారెడ్డిగారి ముద్దుల మనవడు. 
ఆ తర్వాత ఎమ్మెల్యే కొడుకు. తర్వాత మంత్రి కొడుకు. చాలాకాలం ప్రతిపక్షనాయకుడి కొడుకు. 
వ్యాపారరంగంలో సాధించిన విజయాలను ముఖ్యమంత్రి వారసుడనే మబ్బు కమ్మేసింది. 
నడుస్తున్న రాజకీయచరిత్రలో తిరుగులేని శక్తిగా ఎదిగిన వై.ఎస్‌.జగన్‌ తనకు తానే సాటి. ఆయనకు ఎవరూ సరిలేరు. సరికారు. 



1972 డిసెంబర్‌ 21. వైయస్‌ జగన్‌ పుట్టిన సంవత్సరం. సరిగ్గా యాభైఏళ్ల క్రితం కడపజిల్లా జమ్మలమడుగు మిషన్‌ ఆస్పత్రిలో ఆయన జన్మించారు. పులివెందుల నియోజకవర్గంలో వైయస్‌ కుటుంబం నివాసం. ప్రాథమికపాఠశాల విద్య వరకు అక్కడే చదువుకున్న జగన్‌మోహన్‌రెడ్డి తాత రాజారెడ్డికి ముద్దుల మనవడయ్యారు. తాత సాహసం, ధైర్యం, నమ్ముకున్న వారికోసం గట్టిగా నిలబడ్డడం చిన్ననాడే అలవాటయ్యాయి. జనంలో కలిసిపోవడం.. వారి కష్టనష్టాల గురించి, మంచిచెడుల గురించి మాట్లాడటం మామూలైపోయింది.. జనం మనిషిగా ఎదగడానికి ఆ పులివెందులలోనే బీజం పడింది. చిన్ననాడే నలుగురిని ఆకర్షించే శక్తి వచ్చింది. అది వ్యక్తిత్వబలం.

తండ్రి రాజశేఖరరెడ్డి ఒక సంవత్సరం డాక్టర్‌గా పనిచేశారు. ఒకరూపాయి డాక్టర్‌గా ప్రజల మన్ననలు అందుకున్నారు. వైద్యసేవలు అందించడంలో అంకితభావంతో పనిచేశారు. ఉన్నట్టుండి రాజకీయాలవైపు అడుగులు వేయాల్సివచ్చింది. మొదటిసారి నిలబడ్డ ఎన్నికల్లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఓటమన్నది తెలియకుండా పోయింది. కొంతకాలం మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యేగానే కాకుండా ఎంపీగా కూడా చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా విలక్షణమైన పాత్ర పోషించారు. తండ్రి రాజకీయజీవితం కూడా వైఎస్‌జగన్‌పై ప్రభావం చూపడం మొదలైంది. రాజకీయనాయకుడు కావాలన్న పెద్ద లక్ష్యం ఏర్పడకున్నా, ప్రజాసంబంధాలు నెరపడంలో తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఆ తర్వాత డిగ్రీ ప్రగతి మహావిద్యాలయలో డిగ్రీ చేసిన జగన్‌ ఎన్‌సీసీలోనూ ఉన్నారు. 

వై.ఎస్‌ జగన్‌. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఐదేళ్ల తర్వాత, కాంగ్రెస్‌పార్టీని రెండోసారి అధికారంలోకి తెచ్చి, అనితరసాధ్యుడైన రాజకీయనాయకుడిగా ఎదిగిపోయారు వైయస్సార్‌. కానీ దురదృష్టవశాత్తు ఆకస్మికమరణంతో ఆయన దూరమైపోయారు. వైయస్‌జగన్‌ ఒంటరిగా మిగిలిపోయారు. ఇంటి పెద్ద ఆయనే అయ్యారు. తండ్రి రాజకీయాల్లో వున్నప్పుడే కుమారుడిని ప్రజలకు పరిచయం చేశారు. 

స్వంతపార్టీలో ఇబ్బందులు, తండ్రి మరణం తర్వాత ఆగిన గుండెలు, పోయిన ప్రాణాల కుటుంబాలకోసం తలపెట్టిన ఓదార్పు యాత్రకు సైతం ఆటంకాలు ఎదురవడం జగన్‌ను కలవరపెట్టాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇచ్చిన మాట తప్పని నైజం...వెనుకడుగువేయడానికి ససేమిరా అంది. ఇక రాజకీయాల్లో జగన్‌ ప్రస్థానం మొదలైంది. అలా ఓ అనితరసాధ్యుడి జీవితం ఊహించని మలుపుతో ముందుకు సాగుతూ పోయింది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఒకేఒక్కడుగా జగన్‌ చరిత్రకు శ్రీకారం చుట్టుకుంది. 

బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలున్నవాడు అన్నది మిత్రుల అభిప్రాయం. 
వైఎస్సార్‌ కొడుకుగా ఎదుగుదల. అప్పట్నుంచే పరిచయమైన ప్రజాజీవితం.
ప్రజాభిమానం పొందడమే గొప్ప వరమన్న సత్యం నాడే తెలుసుకున్నారు.
 నాన్నాలానే ప్రజాభిమానం పొందాలి. నాన్నలానే ప్రజాసేవలో మునిగిపోవాలి.
 నాన్నలానే ప్రజానాయకుడిగా ఎదగాలన్న లక్ష్యం ఆయన పరిసరాల ప్రభావమే. 
నిరంతరం ప్రజల మనిషిగా వున్న వైఎస్సార్‌ స్ఫూర్తి బలమే.

ఒకటా రెండా. తండ్రి నుంచి చాలా లక్షణాలు జగన్‌ స్వంతమయ్యాయి. ఆయన వారసుడిగా.. వైఎస్సార్‌ వ్యక్తిత్వబలం కూడా జగన్‌పై ప్రభావం చూపింది. మరీ ముఖ్యంగా మాటతప్పని.. మడమ తిప్పని నైజం అలవడింది. రాజకీయమంటే ప్రజాజీవితంతో మమేకం కావడమే అన్న వైయస్సార్‌ లక్షణం జగన్‌కు పూర్తిగా అబ్బింది. సమకాలీన రాజకీయాలకు పూర్తి భిన్నమైన, విలువలు, విశ్వసనీయత ప్రాతిపదికగా తండ్రీకొడుకులు కొత్తరాజకీయానికి నిర్వచనం చెప్పడం మొదలుపెట్టారు. దాంతో ప్రజాసంక్షేమమే వారికి పరమావధిగా మారింది.

కేవలం మనకోసం బతకడమే కాదు, అవతలివాళ్లకోసం కూడా బతకాలి. వాళ్ల జీవితాల్లో కూడా మంచి మార్పు తేగలగాలి.  అప్పుడే జీవితానికి అర్థం వుంటుంది అన్నది జగన్‌ లైఫ్‌ ఫిలాసఫీ. ఇలాంటి మాటలు వైయస్‌ నోట తరచూ వినివుండటం వల్లో, నాన్ననడవడికను చూసీచూసీనో, జగన్‌కు చిన్నప్పటి నుంచి ప్రజలతో ఉండిపోవాలన్న ఉండేది. ఈ లక్షణం వాళ్ల నాన్న వల్లే అబ్బింది అంటుంది జగన్‌ తల్లి విజయమ్మ. తను రాజకీయాలు తనకు వద్దని చెప్పినా, ఆ మాటలు జగన్‌ను మార్చలేకపోయాయన్నది విజయమ్మ మాట. 

ఓ వైపు తండ్రి మాటలు, మరోవైపు తల్లి నేర్పిన విలువల పాఠాలు జగన్‌ వ్యక్తిగా ప్రత్యేకంగా మార్చాయి. మొత్తం మీద జగన్‌ రాజకీయాల్లోకి రావాలన్ననిర్ణయం మీద తండ్రి ప్రభావం ఎక్కువేనంటారు విజయమ్మ. రాజశేఖరరెడ్డి మాటలు,  ఆయన వ్యవహారశైలి కారణంగా జగన్‌కు ప్రజాసేవమీద ఆసక్తి పెరిగిందన్నది తల్లి విజయమ్మ అభిప్రాయం. మొత్తానికి తనను తాను జనం మనిషిగా మార్చుకున్నాడు వై.యస్‌జగన్‌. అసలు సిసలు ప్రజానాయకుడిగా ఎదిగేందుకు ముందడుగులు వేశాడు. 

పదేళ్ల రాజకీయపోరాటం. అలుపన్నది తెలీదు. భయమన్నది లేదు. 
ప్రజలకోసం నడిచారు. నిలిచారు. ప్రజలమధ్య నుంచే ఎదిగారు. 
విశాలాంధ్రప్రదేశ్‌ అనుపానులన్నీ అర్థం చేసుకున్నారు. అన్నివర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 
ప్రజలకు అండగా నిలవాలనుకున్న వైఎస్‌ జగన్‌.... చిన్నవయసులోనే ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నడుస్తూ పోయారు. 
విజేతగా నిలిచి.. అనితరసాధ్యమైన ప్రజాసంక్షేమపాలనను అందిస్తున్నారు వైఎస్‌ జగన్‌.

జగన్‌ రాజకీయప్రవేశం సులువుగా జరిగిపోయివుండవచ్చేమోగానీ, ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం అంత సులువుగా ఏమీ సాగలేదు. తండ్రి మరణం తర్వాత జగన్‌ ఎదుర్కొన్న అగ్ని పరీక్షలు అన్నీ ఇన్నీ కావు. ఒక దశలో జగన్‌నే ముఖ్యమంత్రి చేయాలని, కాంగ్రెస్‌కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కానీ అధిష్టానం ఎందుకో ఒప్పుకోలేకపోయింది. అక్కడే  కాంగ్రెస్‌ పార్టీ పతనానికి నాంది పడింది మరి!.

తండ్రి మరణం తర్వాత పావురాలగుట్టకు వెళ్లిన జగన్‌కు అక్కడి అశేషజనాన్ని చూడగానే భావోద్వేగం పొంగింది. వారంతా నాన్న తనకిచ్చిన పెద్ద కుటుంబం అనిపించింది. ఆ ప్రజల సమక్షంలోనే వైయస్‌ మరణానికి తట్టుకోలేక చనిపోయిన వారి ప్రతి కుటుంబాన్ని ఓదారుస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటపై ముందుకు సాగారు. కాంగ్రెస్‌ ఢిల్లీ అధిష్టానం కాదుకూడదు అంది. జగన్‌ వెనక్కు తగ్గలేదు. ఓదార్పు కొనసాగింది. జగన్‌పై అన్ని రకాల రాజకీయ కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయి. ఆరోజుల్లో ఓదార్పు యాత్ర దేశ చరిత్రలోనే నభూతో న భవిష్యతి. జగన్‌ పట్ల జనానికి ఉన్న అభిమానానికి ఆ ఓదార్పు యాత్ర అద్దం పట్టింది.

జగన్‌ యాత్రలకు జనం అంతగా రావటం వెనుక వైఎస్‌ పథకాలు ఒక కారణం కావచ్చు. తమకు అంతటి మేలుచేసిన వైఎస్‌ తనయుడి పట్ల కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు నచ్చకపోవడంతో వైయస్‌ కుటుంబం పట్ట జనంలో సానుభూతి పెరుగుతూ పోయింది. ఇది కాదనలేని సత్యం. జగన్‌ పట్టుదల కూడా ఆయన్ను జనంలో తిరుగులేని నేతగా మార్చడంలో ముఖ్యపాత్ర పోషించింది. 

దేశరాజకీయాల్లోనే వైఎస్‌ జగన్‌ పాలన విప్లవాత్మకమైనది అని చెప్పకతప్పదు. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ తుచ తప్పకుండా నెరవేర్చాలని కంకణం కట్టుకున్న ఏకైక రాజకీయనాయకుడు వైఎస్‌ జగన్‌. కలలోనైనా ప్రజలకిచ్చిన మాట తప్పకూడదన్నది ఆయన సిద్ధాంతం. పారదర్శకపాలన అందించాలన్నదే తపన. చిత్తశుద్దితో సంక్షేమ పథకాల అమలు, దూరదృష్టితో అభివృద్ది ప్రణాళికలు అమలు చేస్తు ముందుకు సాగుతున్న వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు దొరికిన ఆణిముత్యం

స్వంత పార్టీ పెట్టిన తర్వాత వైయస్‌ జగన్‌ దేశచరిత్రలోనే అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పార్టీని ముందుకు నడపడమే ఏకైక దీక్షగా సాగారు. అదే సమయంలో ఆయన జైలు జీవితం కూడా చూడాల్సి వచ్చింది. జైలునుంచి రాగానే 2014 ఎన్నికల్లో జగన్‌ పార్టీ వైఎస్సార్‌ సీపీ బరిలో నిలిచింది. ఒంటరిగానే ముందుకు సాగింది. కేవలం ఐదులక్షల ఓట్ల తేడాతో  అధికారానికి దూరమైంది. 

తర్వాత నవ్వాంధ్ర ప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ శాసనసభలో ప్రతిపక్షనేతగా వున్నారు. ప్రతిపక్షనేతగా ప్రతిరోజూ ప్రజాసమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేవారు. ఆయన మాటలు పట్టించుకునే వారే కరువయ్యారు. చివరాఖరుకు అసెంబ్లీలో మైకు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు అధికారపక్షం. ఇలా కాదనుకున్న వైఎస్‌జగన్‌ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలనుకున్నారు. గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపథం చేశారు. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. చరిత్రలో నిలిచిపోయిన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 

ఈ పాదయాత్రే నవ్యాంధ్ర చరిత్రను మార్చింది.  ఇలా సాగిన ఈ పాదయాత్రే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ పాదయాత్రే వైయస్‌ జగన్‌లో మరింతగా రాజకీయ పరిణతి పెరిగేలా చేసింది. ఈ పాదయాత్ర కాలంలోనే వేలకిలోమీటర్లు నడిచిన జగన్‌ లక్షలాది మంది హృదయాలను సృజించారు. గుండెగుండెను తట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆత్మీయసమ్మేళనాలతో అన్ని వర్గాల, కులాల, మతాల వారి సమస్యలు తెలుసుకున్నారు. తనపై వారికున్న నమ్మకాన్ని గమనించారు. 
రుతువులు మారినా, వర్షాలు కుమ్మరించినా, ఎండలు మండినా, చలి వణికించినా చలించని జగన్‌ పాదయాత్ర అనుభవాలతోనే తన పార్టీ మేనిఫెస్టోను రూపొందించుకున్నారు. అందులో ఇచ్చే ప్రతి హామీ నెరవేర్చి తీరాలని తపించారు. 

ఈ మేనిఫెస్టోనే నేడు ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలు మారుస్తోంది. విద్య,వైద్యం ఇలా అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. సరికొత్తపాలను చవిచూపిస్తోంది. కులమత, వర్గ, ప్రాంత, పార్టీల కతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగే పాలనకు అసలుసిసలు అర్థం చెబుతోంది. 

ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల అపార నమ్మకం వున్నవారు ఏపీ సీఎం. 
వ్యవస్థలను స్వేచ్ఛగా ముందుకు నడిపించగలిగితే.. ప్రజలందరికీ సుపరిపాలన అందుతుంది అన్నది ఆయన విశ్వాసం. 
విలువలు, విశ్వసనీయతలే నాయకుడిగా వేసే ప్రతి అడుగుకూ సార్ధకత చేకూరుస్తాయని వైఎస్‌ జగన్‌ బలంగా విశ్వసిస్తారు. 
కుల, మత, పార్టీ, ప్రాంతాల కతీతంగా సాగుతున్న  వైఎస్‌ జగన్‌ పాలన .. దార్శనికుడైన పాలకుడి సమర్ధతను పట్టిచూపుతోంది. 
అటు మేధావుల్ని, ఇటు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. 



2019 ఎన్నికల్లో జగన్‌పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కనివిని ఎరుగని రీతిలో మెజారిటీ సీట్లలో గెలిపించారు. మొత్తం 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపి 151 సీట్లలో విజయకేతనం ఎగరేసింది. 25 పార్లమెంటు స్థానాల్లో 22 ఎంపీ సీట్లు వైఎస్సార్‌సీపీవి అయ్యాయి. ఇంతకన్నా విజయముండునా? ఇంతకన్నా ప్రజవిశ్వాసం గెలుచుకున్న పార్టీ ఉండునా. ఇదంతా ఒకే ఒకడుగా జగన్‌రెడ్డి సాధించిన విజయం. పొత్తుల్లేవు. ఒకటే గుర్తు.. ఒకటే జెండా.. ఒకడే నాయకుడు అన్నట్టుగా సాగిన 2019 ఎన్నికల్లో ఆ ఒకే ఒక్కడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

నవ్యాంధ్రలో అన్ని ఎన్నికల్లోనూ రికార్డులు బద్దలు కొట్టిన జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఆరోజు నుంచి ప్రతిరోజు ఆయనకు మేనిఫెస్టోనే ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీత అయ్యాయి. కలనైనా మరవకూడదన్న ఆలోచన కళ్లెదుటే కనిపించేలా మేనిఫెస్టోను అతికించుకున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఆయన ఐదు సంతకాల ప్రాధాన్యత ప్రజల్లో ఆసక్తిని రేపింది. ఒక సగటు కుటుంబం మీద వాటి ప్రభావమెంత, రాష్ర్టప్రగతి దిశలో ఈ కీలక నిర్ణయాలతో ఒనగూరే నిజమైన ఉపయోగం ఏమిటి అన్నదానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అమ్మ ఒడి, సామాజిక పెన్షన్ల పెంపు, ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ, ఊరూరా జనసేవాల కేంద్రాలు ఇవీ ఆయన వాగ్దానాలు. చెప్పినవే కాకుండా చెప్పనవి కూడా ప్రజలకు ఉపయోగపడితే అమలు చేసే జగన్‌...అటు విద్యారంగంలోనూ ఇటు వైద్యరంగంలోనూ నాడు-నేడును ప్రకటించారు. ఆ వ్యవస్థల రూపురేఖలు పూర్తిగా మార్చేయాలన్న ప్రయత్నాలు శీఘ్రంగా సాగుతున్నాయిప్పుడు. 

వైఎస్‌ సంక్షేమ పథకాలన్నింటినీ మళ్లీ సంతృప్త స్థాయిలో నెరవేర్చాలని, వాటిని పటిష్టపరచి, వాస్తవ స్పూర్తితో తు.చ తప్పకుండా అమలు చేయాలనే భావన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ది. దీంతో పాటు అదనంగా మరికొన్ని పథకాలనూ ప్రవేశపెట్టాలనేది జగన్‌మోహన్‌ రెడ్డి లక్ష్యం. అంటే.. వైఎస్‌ స్ఫూర్తికి కొనసాగింపు అన్నమాట. మరింత విస్తరణ అన్నమాట. ప్రజాసేవలో నాన్నకన్నా రెండడుగులు ముందుకే వేస్తానన్న మాటలకు అర్థమన్నమాట. 

దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే తన బలం అని గట్టిగా నమ్మిన వైఎస్‌జగన్‌, ఆ విశ్వాసబలంతోనే ముందుకు సాగుతున్నారు.
ఎక్కడా తగ్గేదేలా అన్న అపార ఆత్మవిశ్వాసం ఆయనకు మాత్రమే స్వంతం.
తన పనితీరే తనకు శ్రీరామరక్ష అని గట్టిగా విశ్వసిస్తున్నారు. 
తన పాలనను, గత పాలకుడి పాలనను బేరీజు వేసి చూడాలని, తన సంక్షేమపథకాల లబ్ది ఏ మేరకు, ఎంతమందికి, ఎన్ని జీవితాల్లో వెలుగులు నింపుతోందో ఆలోచించమని ఆయన నేరుగా ప్రజలనే కోరుతున్నారు. 
నిరంతరం ప్రజలకు మేలు చేయడం మినహా మరో లక్ష్యం తనకు లేదని స్పష్టంగా ప్రకటిస్తున్న జగన్‌ నేటి రాజకీయాల్లో ఓ సంచలనం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement