VB kamalasan reddy
-
నకిలీ మందుల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారిన నకిలీ డ్రగ్స్ పై సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి కోరారు. ప్రజాదరణ పొందిన ప్రముఖ కంపెనీల బ్రాండ్లను పోలి ఉండేలా కొన్ని మోసపూరిత కంపెనీలు నకిలీ మందులను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు గత కొద్ది రోజులలో డీసీఏ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో గుర్తించిన మందులే ఉదాహరణగా ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ మందులు వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా కాలక్రమేణా, రోగికి వినాశకరమైన పరిణామాలను సృష్టిస్తాయని తెలిపారు. అనుమానం వచ్చినా ఫోన్ చేయండి నకిలీ మందులను గుర్తించినా, నకిలీ అనే అనుమానం వచ్చినా స్థానిక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు తెలియజేయాలని సూచించారు. వివరాల కోసం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ వెబ్సైట్ https:// dca.telangana.gov.in లో ‘కీ కాంటాక్ట్స్’ విభాగంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీసీఏ టోల్ ఫ్రీ నంబర్ 18005996969లో అన్ని పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మెడికల్ షాపు ల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ (పేరు, సంప్రదించాల్సిన నంబర్, చిరునామా) వివరాలు, డీసీఏ టోల్ ఫ్రీ నంబర్‌తో కూడిన ‘పోస్టర్’ని ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. -
కన్నతండ్రే 'కర్కోటకుడు'
కరీంనగర్ క్రైం: కన్నతండ్రే కర్కోటకుడిగా మారి కూతురును హత్య చేశాడు. కరీంనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని ముత్త రాధికను గొంతు కోసి చంపింది ఆమె తండ్రి కొమురయ్యేనని పోలీసులు నిర్ధారించి, అరెస్టు చేశారు. పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి సోమవారం కేసు వివరాలను వెల్లడించారు. కమిషనర్ ఏం చెప్పారంటే.. కొమురయ్య హమాలీ. ఆయన కూతురు రాధిక చిన్ననాటి నుంచి పోలియోతో బాధపడేది. ఆమె వైద్యానికి తండ్రి రూ.6 లక్షలు ఖర్చు చేశాడు. ఇటీవల రాధికకు మళ్లీ ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కొమురయ్య.. రాధిక ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపాడు. బయటి వ్యక్తులపై అనుమానం వచ్చేలా గొంతు కోశాడు. తండ్రి బనియన్, చెప్పులపై రక్తపు మరకలు.. అదే రోజు కొమురయ్య ఇంట్లో 99 వేల నగదు, 3 తులాల బంగారం పోయిందని ఫిర్యాదు చేసి కేసును పక్కదారి పట్టించాడు. పోలీసులు హత్య, దొంగతనం కేసుగా నమోదు చేశారు. కేసు దర్యాప్తునకు 8 బృందాలు ఏర్పాటు చేసి 75 మంది పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ సిటీ పోలీసు విభాగం క్లూస్ టీం వచ్చింది. జర్మన్ టెక్నాలజీ వాడి.. రాధిక తండ్రి బనియన్, చెప్పుల మీద ఆమె రక్తపు మరకలున్నట్లు గుర్తించింది. సంబంధిత నివేదిక వచ్చిన తర్వాత పోలీసుల అనుమానం నిజమైంది. 21 రోజుల విచారణ అనంతరం కొమురయ్యను తమదైన శైలిలో విచారించగా.. రాధికను తానే హతమార్చినట్లు అంగీకరించాడు. -
రూంకి రమ్మనందుకు యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, కరీంనగర్ : ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈసీఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వ్యవహరించే సురేందర్ అనే ప్రొఫెసర్ ఆ విద్యార్థినిని వేధించడంతోపాటు వాట్సప్ చాటింగ్ చేసిన స్క్రీన్‌షాట్ ఫొటోలు, సదరు కీచక ప్రొఫెసర్ ఫొటోలు, వీడియోలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే కళాశాల విద్యార్థిని వేధించిన ఘటన గానీ, ఆత్మహత్యాయత్నం గానీ ఇప్పట్లో కాకుండా కొద్దిరోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే సదరు హెచ్ఓడీ సురేందర్‌ను కళాశాల నుంచి పంపించివేసిన యాజమాన్యం ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని తల్లిదండ్రులతో చర్చించి విషయం బయటకు పొక్కకుండా చూసినట్లు సమాచారం. కాగా సంఘటనకు సంబంధించి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఎక్కడా పోలీసు కేసు నమోదు కాలేదు. సదరు విద్యార్థిని ఆచూకీ కూడా తెలియకపోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే... కళాశాల యాజమాన్యం, వివిధ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు..సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజాంపల్లికి చెందిన విద్యార్థిని అల్గునూరులోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతోంది. ఇదే కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేసే ప్రొఫెసర్ సురేందర్ ఆ విద్యార్థినిపై కన్నేశాడు. తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ, సదరు ప్రొఫెసర్‌ను కాలేజీ నుంచి తొలగించారు. అయితే ఈ ప్రొఫెసర్ వేధింపులు భరించలేక కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా సోమవారం సురేందర్ అనే ప్రొఫెసర్ ఆ విద్యార్థినితో జరిపిన చాటింగ్‌కు సంబంధించిన మొబైల్ స్క్రీన్షాట్లు, తన రూంకు రావాలని అభ్యర్థిస్తే, ఆ విద్యార్థిని నిరాకరించడం ఈ స్క్రీన్‌షాట్ ఫొటోల్లో కనిపిస్తోంది. దీనికి తోడు సురేందర్ వీడియోలు, ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు సమాచారం లేదు తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాల ఉండగా, విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి సంబంధించి అక్కడ ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. విద్యార్థిని సొంత గ్రామం నిజాంపల్లి పరిధిలోని కోనరావుపేట మండలంలో గానీ, ఆ అమ్మాయి ఇప్పుడు ఉంటుందని ప్రచారం జరుగుతున్న సిరిసిల్లలో గానీ ఫిర్యాదులు లేవు. ఈ విషయంపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా వాట్సప్‌లలో వైరల్ అయిన సమాచారం తప్ప ఎలాంటి ఫిర్యాదు తమకు రాలేదని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేసి ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, నిందితునిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా తమ కళాశాలలో అమ్మాయి ఎవరూ ఆత్మహత్యయత్నం చేయలేదని, ప్రొఫెసర్ సురేందర్ అనే వ్యక్తి ప్రవర్తన సరిగా లేనందున గతంలోనే కాలేజీ నుంచి తొలగించామని సదరు కళాశాల కరెస్పాండెంట్ ‘సాక్షి’కి వివరించారు. అడ్మిషన్ల సమయంలో ఇతర కళాశాలల యాజమాన్యాలు తమను అప్రతిష్ట పాలు చేసేందుకు ఇలాంటి కుట్రలకు తెరతీశారని అన్నారు. అయితే ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అక్బర్ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కరీంనగర్లో ప్రసంగంలో ఎలాంటి విద్వేషపూరిత, రెచ్చ గొట్టే వ్యాఖ్యలు లేవని న్యాయ నిపుణులు తేల్చి నట్టు నగర పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నెల 23న కరీంనగర్లో జరిగిన సభలో అక్బర్ పాల్గొన్నారు. ఈ సభలో ఒక వర్గం మనోభావాలను కించపరిచే విధంగా, విద్వేషాలను రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రసంగించారని మూడు రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వైరల్ అయింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా తానెలాంటి విద్వేషపూరిత ప్రసంగం చేయలేదని వివరణ ఇచ్చారు. ‘ముందు జాగ్రత్త చర్యగా అక్బరుద్దీన్ ప్రసంగాన్ని రికార్డు చేయించాం. ఆ వీడియోను అనువాద నిపుణుల సహాయంతో ట్రాన్స్‌లేట్ చేయించి, వీడియో రికార్డింగును, అనువాద ప్రతిని న్యాయ నిపుణుల సలహా కోసం పంపించాం. అయితే.. ఆ వీడియో ప్రసంగంలో ఎటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు గానీ, రెచ్చగొట్టే పదాలు గానీ లేవని , ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్పారు’’అని సీపీ తెలిపారు. ఈ మేరకు ఎలాంటి కేసు నమోదు చేయడం లేదని స్పష్టం చేశారు. -
పోకిరీలకు వణుకు పుట్టాలి..
సాక్షి, కరీంనగర్ : అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమల్‌హాసన్ రెడ్డి టాస్క్‌ఫోర్స్ విభాగం పోలీసులను ఆదేశించారు. కరీంనగర్ కమిషనరేట్‌లో శుక్రవారం విబి కమల్‌హాసన్ రెడ్డి టాస్క్‌ఫోర్స్ , షీ బృందాల పోలీసు విభాగాలతో సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..రేషన్ బియ్యం అక్రమ రవాణా, కల్తీ విత్తనాలు, ఆహార పదార్థాలపై దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ విభాగం పోలీసులు అంకితభావంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. ఉత్తమ పనితీరును కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ తరహాలో కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. పోకిరీలకు వణుకు పుట్టాలి.. ప్రేమ పేరిట విద్యార్థులను, మహిళలను వేధించే పోకిరీలకు వణుకు పుట్టించేలా పనిచేయాలని కమిషనర్ కమల్‌హాసన్ రెడ్డి షీ బృందాల పోలీసులను ఆదేశించారు. పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు వారిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదూ చేస్తామని తెలిపారు. ముఖ్యంగా షీ బృందాలు తమ పనితీరుతో మహిళలకు భద్రత పట్ల భరోసా కల్పించాలని పేర్కొన్నారు. ప్రేమ పేరుతో వేధిస్తున్న పోకిరీలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చే విద్యార్థినులు, మహిళల పేర్లను గోప్యంగా ఉంచుతామని హామి ఇచ్చారు.ఈ సమావేశానికి అడిషనల్ డీసీపీ(లా అండ్ ఆర్డర్) ఎస్.శ్రీనివాస్, ఎసిసి శోభన్ కుమార్, మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుట్టల్లో జీవనం.. గుళ్లకు కన్నం
ఆరు నెలలుగా ఇదే జీవితం పోలీసులకు చిక్కిన చిల్లరదొంగ కరీంనగర్ క్రై ం: అతడో చిల్లర దొంగ. ఓసారి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత కూడా పాత బాటనే అనుసరిస్తున్నాడు. అయితే, పోలీసుల భయంతో తన మకాంను గుట్టల్లోకి మార్చేశాడు. ఆర్నెల్లుగా గుట్టల్లో నివాసముంటూ చిన్నచిన్న చోరీలకు పాల్పడుతున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు గుట్టల వద్ద నిఘా వేయడంతో దొరికిపోయాడు. శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన పెద్దాపురం ఆనంద్(25) పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చిల్లర దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. గతంలో పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లిన అతడు ఈ ఏడాది మే 11న బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడతాననే భయంతో తన మకాంను గుట్టల్లోకి మార్చాడు. మండలంలోని ఇల్లందు, శాంతినగర్, గన్నేరువరం, మైలారం గుట్టలు మారుతూ సమీప ప్రాంతాల్లో ఉన్న ఆలయాలతోపాటు కరీంనగర్, చిగురుమామిడి మండలాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం మైలారం గుట్టల వద్ద ఓ బైక్ కనిపించింది. వారం గడిచినా ఎవరూ రాకపోవడంతో పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్ ప్రతిరోజు రాత్రి మైలారం గుట్ట సమీపంలో ఉన్న గుడి వద్దకు వచ్చి సెల్, ట్యాబ్ చార్జింగ్ పెట్టుకుని మళ్లీ గుట్టల్లోకి వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో ఆలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి సంచరిస్తున్నాడనే అనుమానంతో గ్రామస్తులు కాపాలా పెట్టారు. అయితే, రాత్రి సమయంలో ఆలయం వద్దకు ఎలుగుబంట్లు వస్తాయి. దీంతో రాత్రి కాగానే గ్రామస్తులు వెళ్లిపోయేవారు. వారు వెళ్లిపోయిన తర్వాత ఆనంద్ ఆలయం వద్దకు వచ్చి తన పనులు చేసుకుంటున్నాడు. నాలుగైదు రోజులకోసారి బయటకు వచ్చి సరుకులు కొనుక్కుని మళ్లీ గుట్టల్లోకి వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి కదలికలపై సమాచారం అందుకున్న గన్నేరువరం ఎస్సై కోటేశ్ ఆలయం వద్ద నిఘా పెట్టాడు. ఈనెల 24న రాత్రి ఆలయం వద్దకు వచ్చిన ఆనంద్‌ను పట్టుకుని విచారించగా వివరాలు బయటపెట్టాడు. పోలీసులు సదరుగుట్టలను సందర్శించి అతడి జీవనాన్ని పరిశీలించారు. ఆనంద్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి, అతడిలో మార్పుతీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు.