రాధిక, హత్య జరిగిన రోజు రోదిస్తున్న కొమురయ్య
కరీంనగర్ క్రైం: కన్నతండ్రే కర్కోటకుడిగా మారి కూతురును హత్య చేశాడు. కరీంనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని ముత్త రాధికను గొంతు కోసి చంపింది ఆమె తండ్రి కొమురయ్యేనని పోలీసులు నిర్ధారించి, అరెస్టు చేశారు. పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి సోమవారం కేసు వివరాలను వెల్లడించారు. కమిషనర్ ఏం చెప్పారంటే.. కొమురయ్య హమాలీ. ఆయన కూతురు రాధిక చిన్ననాటి నుంచి పోలియోతో బాధపడేది. ఆమె వైద్యానికి తండ్రి రూ.6 లక్షలు ఖర్చు చేశాడు. ఇటీవల రాధికకు మళ్లీ ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కొమురయ్య.. రాధిక ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపాడు. బయటి వ్యక్తులపై అనుమానం వచ్చేలా గొంతు కోశాడు.
తండ్రి బనియన్, చెప్పులపై రక్తపు మరకలు..
అదే రోజు కొమురయ్య ఇంట్లో 99 వేల నగదు, 3 తులాల బంగారం పోయిందని ఫిర్యాదు చేసి కేసును పక్కదారి పట్టించాడు. పోలీసులు హత్య, దొంగతనం కేసుగా నమోదు చేశారు. కేసు దర్యాప్తునకు 8 బృందాలు ఏర్పాటు చేసి 75 మంది పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ సిటీ పోలీసు విభాగం క్లూస్ టీం వచ్చింది. జర్మన్ టెక్నాలజీ వాడి.. రాధిక తండ్రి బనియన్, చెప్పుల మీద ఆమె రక్తపు మరకలున్నట్లు గుర్తించింది. సంబంధిత నివేదిక వచ్చిన తర్వాత పోలీసుల అనుమానం నిజమైంది. 21 రోజుల విచారణ అనంతరం కొమురయ్యను తమదైన శైలిలో విచారించగా.. రాధికను తానే హతమార్చినట్లు అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment