సినీఫక్కీలో సైకో ఖైదీ పరార్
బెంగళూరు, న్యూస్‌లైన్: కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలు నుంచి ఓ సైకో ఖైదీ శనివారం అర్ధరాత్రి దాటాక సినీఫక్కీలో తప్పించుకున్నాడు. పటిష్ట బందోబస్తు, చుట్టూ ఎత్తై గోడలు ఉన్నా అనూహ్యంగా పోలీసుల కళ్లుగప్పి 42 అత్యాచార, హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జైశంకర్ అలియాస్ సైకో శంకర్ (36) అనే కరడుగట్టిన ఖైదీ పరారయ్యాడు. పోలీసు దుస్తుల్లో ఖాకీలకే టోకరా వేసి రెండు 15 అడుగుల గోడలతోపాటు మరో 30 అడుగుల గోడ దూకి పలాయనం చిత్తగించాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు 11 మంది జైలు అధికారులను సస్పెండ్ చేసింది. కర్ణాటక అదనపు డీజీపీ (జైళ్లశాఖ) కె.వి. గగన్‌దీప్ వివరాల ప్రకారం... మానసిక సమస్యలతో బాధపడుతున్న శంకర్‌ను జైలు అధికారులు అండర్‌గ్రౌండ్ సెల్‌లో ఉంచారు.
అయితే శనివారం అర్ధరాత్రి 2 నుంచి 4 గంటల మధ్య వర్షం వల్ల జైల్లో కరెంటు పోవడంతో శంకర్ నకిలీ తాళం ఉపయోగించి సెల్‌లోంచి బయటకు వచ్చాడు. అనంతరం అక్కడున్న ఓ పోల్ సాయంతో బెల్ట్, గ్లౌజ్‌లు ఉపయోగించి రెండు 15 అడుగుల గోడలు దూకాడు. ఆపై వెంట తెచ్చుకున్న పోలీసు దుస్తుల్లో పలువురు సెంట్రీ సిబ్బందిని బురిడీ కొట్టించి 30 అడుగుల ప్రధాన ప్రహరీ వద్దకు చేరుకొని బెడ్‌షీట్ సాయంతో పెకైక్కి కిందకు దూకి పారిపోయాడు. ఆదివారం ఉదయం ఖైదీల హాజరు సమయంలో జైశంకర్ కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.