
సాక్షి, చెన్నై : పెరోల్ గడువు ముగియటంతో అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ నటరాజన్ తిరిగి జైలుకు పయనం అయ్యారు. భర్త నటరాజన్ అనారోగ్యం దృష్ట్యా బెంగళూరు కోర్టు ఆమెకు ఐదు రోజుల పెరోల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
గురువారం ఉదయం తన మద్ధతుదారులకు, కార్యకర్తలకు అభివాదం చేసి అనంతరం ఆమె బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు బయలుదేరారు. సాయంత్రానికి ఆమె పరప్పన అగ్రహార జైల్లో రిపోర్టు చేయనున్నారు. కాగా, పెరోల్‌ను వ్యక్తిగత కారణాలకు మాత్రమే వినియోగించుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలపై చర్చలు జరపొద్దని నిబంధన విధించిన విషయం తెలిసిందే. అయితే ఆమె వాటిని అతిక్రమించినట్టు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఐదు రోజుల్లో ఆమె కేవలం రెండు రోజులు మాత్రమే ఆస్పత్రికి వెళ్లి భర్తను పరామర్శించారని.. అక్కడ కూడా ఐదారు గంటల కంటే ఎక్కువ సేపు లేదని ఆరోపణలు వినిపించాయి. ఇక మిగతా సమయమంతా పార్టీ కార్యకలాపాల్లోనే ఆమె మునిగి తేలిందని.. దినకరన్, న్యాయ నిపుణులతో పార్టీపై పట్టు కోసం చర్చలు జరిపిందన్న వార్తలు వచ్చాయి. దీంతో పరప్పన అగ్రహార జైలు ఆ అంశంను పరిశీలించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆమెకు పెరోల్ మంజూరు అవుతుందా? అన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment