
సాక్షి ప్రతినిధి, చెన్నై: మెరుపు దాడులతో శశికళ బంధువర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఆదాయపు పన్నుశాఖ ఇక శశికళ, ఇళవరసిలపై దృష్టి సారించనుంది. ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా బెంగళూరు జైలులో వీరిద్దరినీ విచారించనుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు శశికళ ఇటీవల పెరోల్‌పై చెన్నైకి వచ్చినపుడు 622 ఆస్తుల రిజిస్ట్రేషన్లలో మార్పులు, చేర్పులు చేసినట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ తతంగమంతా ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో జరిగినట్లు అభియోగం. దాడులు ముగిసిన నాటి నుంచి శశికళ బంధువులను ఐటీ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. ఆస్తులు కూడగట్టడంలో ప్రధానపాత్ర పోషించిన శశికళను, ఆమె అన్న భార్య ఇళవరసిలను విచారించేందుకు ఐటీ అధికారులు బెంగళూరు జైలుకు వెళ్లనున్నట్లు సమాచారం.
దినకరన్ సోదరికి శిక్ష ఖరారు
టీ నగర్ (చెన్నై): శశికళ సోదరి బి.వనితామణి కుమార్తె శీతలాదేవికి మూడేళ్లు, ఆమె భర్త ఎస్‌ఆర్ భాస్కరన్‌కు ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. శీతలాదేవి దినకరన్‌కు చెల్లెలు. భాస్కరన్ రిజర్వు బ్యాంకు మాజీ ఉద్యోగి. 1988– 97 మధ్యకాలంలో భాస్కరన్ తన భార్య పేరిట ఆదాయానికి మించి రూ.1.68కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ 1998లో కేసు వేసింది. కేసు విచారించిన సీబీఐ కోర్టు భాస్కరన్‌కు ఐదేళ్ల శిక్ష, రూ.20 లక్షలు జరిమానా, శీతలాదేవికి మూడేళ్ల శిక్ష, రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ 2008లో తీర్పుచెప్పింది. దీనిపై వీరు 2008లో హైకోర్టును ఆశ్రయించగా, శిక్షను నిలిపేసి హైకోర్టు విచారణ చేపట్టింది. తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు జడ్జి జయచంద్రన్ తీర్పుచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment