=భయం గుప్పెట్లో తీరప్రాంతాలు
=జిల్లాకు ఏడు రెస్క్యూ బోట్లు, ప్రత్యేక బృందం రాక
=కంట్రోల్ రూంల ఏర్పాటు
=ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులు
= కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 08672-252572, టోల్‌ఫ్రీ నంబర్ 1077
తుపాను పేరెత్తితే చాలు అంతా హడలిపోతున్నారు. మరీ ముఖ్యంగా అన్నదాతల గుండెలు జారిపోతున్నాయి. గత నెలలో ఫై-లీన్ తుపాను, ఆ తర్వాత వాయుగుండం ఏర్పడి కుండపోతగా కురిసిన భారీవర్షాలకు రైతులు అతలాకుతలమయ్యారు. తీవ్ర పంట నష్టాలను చవిచూశారు. మళ్లీ ఇప్పుడు తాజాగా హెలెన్ తుపాను వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వరిపంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో వస్తున్న తుపాను వార్త అన్నదాతలను గజగజ వణికిస్తోంది.
సాక్షి, మచిలీపట్నం/న్యూస్‌లైన్, చల్లపల్లి : హెలెన్ తుపాను ప్రభావం వల్ల 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయనే అధికారుల హెచ్చరికలు తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వరి పంట చేతికొచ్చిన తరుణంలో తుపాను వల్ల ఎలాంటి నష్టాన్ని చవిచూడాల్సివస్తుందోనని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. గత నెలలో 23 నుంచి 27 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో 1.94 లక్షల ఎకరాల్లో పంట నష్టాలు జరిగినట్టు ఇటీవల అధికారులు నివేదికలు తయారుచేశారు. రూ.683 కోట్ల మేర జరిగిన నష్టాన్ని తలచుకుని గుండెలు బాదుకుంటున్నారు. ఆ భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న జిల్లా రైతాంగం ఈ హెలెన్ తుపాను ఎలాంటి బీభత్సాన్ని సృష్టిస్తుందోనని భయపడిపోతున్నారు.
పంట చేతికొచ్చేనా..
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తుపానుగా మారింది. దీనికి అధికారులు హెలెన్ అని పేరుపెట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు చేస్తున్న హెచ్చరికలు రైతులను వణికిస్త్తున్నాయి. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 6.43 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. మరో నాలుగు రోజుల్లో ముమ్మరమవుతాయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది సాగు తలకుమించిన భారమైంది. ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.25 వేలు ఖర్చు చేశారు. ఈదురుగాలులు వీస్తే కోతకొచ్చిన పంట పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనిక, పాలుపోసుకునే దశలో ఉన్న పంట దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
మూడో ప్రమాద హెచ్చరిక..
ఇప్పటికే తీరప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. మచిలీపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. నాగాయలంక మండలం సొర్లగొందిలో మూడురోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వస్తుండగా బోట్లలో ఆయిల్ అయిపోవడంతో మూడు గంటలు సముద్రంలో వారు నరకం చవిచూశారు. ప్రస్తుతం నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లోని తీరప్రాంతాల్లో సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని తీరప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటున్నారు.
అంతటా అప్రమత్తం : డీఆర్వో
జాతీయ విపత్తుల కమిషన్ ఇచ్చిన సమాచారం మేరకు హెలెన్ తుపానుపై జిల్లాలో అప్రమత్తమైనట్టు జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.విజయచందర్ బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కలెక్టర్ రఘునందన్‌రావు ఆదేశాల మేరకు తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. ఆర్డీవో, తహశీల్దార్, గ్రామస్థాయి సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజ లను సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 127 తుపాను షెల్టర్లు సిద్ధం చేసి వాటిని ఆయా ప్రాంతాల్లోని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఏడు రెస్క్యూబోట్లను సిద్ధం చేసి నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్(ఎన్టీఆర్‌ఎఫ్) టీంకు చెందిన 40 మందిని గురువారం ఉదయానికి జిల్లాకు రప్పిస్తున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కిరావాలని, ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 08672-252572, టోల్‌ఫ్రీ నంబర్ 1077ను ఏర్పాటు చేశారు. కాగా ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.
డిస్కమ్ పరిధిలో.. తుపాను ప్రభా వం జిల్లాల్లో విద్యుత్ వినియోగదారులకు అత్యవసర సేవలు అందించేందుకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు ఏపీఎస్పీడీసీఎల్ (డిస్కమ్) సీఎండీ హెచ్‌వై దొర ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్ రూంల వివరాలను ఎస్‌ఈ మోహన్‌కృష్ణ సాక్షికి తెలిపారు. విజయవాడ సర్కిల్ ఆఫీసు, విజయవాడ టౌన్, రూరల్, గుణదల ప్రాంతాలకు 0866-2575620, 9440817561, నూజివీడు డివిజన్‌కు 08656-232746, 9490615606, గుడివాడ డివిజన్‌కు 08674-242703, 9440817573, మచిలీపట్నం డివిజన్‌కు 08672-222294, 9440812104, ఉయ్యూరు డివిజన్‌కు 08676-233718, 9491054708 కంట్రోల్ రూం నంబర్లు అందుబాటులో ఉంటాయి.
రైతు గుండె జారెన్!
Published Thu, Nov 21 2013 12:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement