భరోసా ఇవ్వండి
Published Tue, Sep 27 2016 11:19 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
భారీ వర్షాలపై అప్రమత్తత అవసరం
ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలి
సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలి
జిల్లా ప్రత్యేక అధికారి వికాస్‌రాజ్
వర్షాలతో నష్టాలు, తీసుకుంటున్న చర్యలపై సమీక్ష
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో సంభవించిన నష్టాలు, రాబోయే వర్షాల కారణంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతులు, ప్రజలకు జిల్లా యంత్రాంగం భరోసా కల్పించాలని జిల్లా ప్రత్యేక అధికారి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ సూచించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం, యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ జగన్మోహన్ అధ్యక్షతన అటవీశాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి వికాస్‌రాజ్ మాట్లాడుతూ వర్షం ఎక్కువగా కురిస్తే వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని, ఆ మండల పరిధిలోని ప్రాజెక్టుల ప్రాంతాల్లో గల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షాల కారణంగా గోదావరి నదీ తీరాన ఉన్న ఐదు మండలాల్లోని 30 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు వివరించారు. ప్రాణహిత ప్రాజెక్టు ప్రాంతంలోని మూడు గ్రామాలను కూడా ఖాళీ చేయాల్సి పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ ద్వారా ప్రస్తుతం 5.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, వచ్చే రబీ సీజన్‌లో దాదాపు 4లక్షల ఎకరాలకు నీరందించవచ్చని వివరించారు. ఐటీడీఏ పరిధిలో తీసుకుంటున్న చర్యలపై ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్, సబ్ కలెక్టర్ అద్వైత్‌కుమార్, వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలతో పెద్దగా నష్టం జరగలేదని, పాక్షికంగా నష్టం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో జేసీ సుందర్ అబ్నార్, డీఆర్వో సంజీవరెడ్డి, ఆర్డీవోలు ఐలయ్య, శివలింగయ్య, ఆయేషా మస్రత్‌ఖానమ్, నీటిపారుదల శాఖ సీఈ భగవంత్‌రావు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖపై..
జిల్లాలో 1614 హెక్టార్లలో పత్తి పంట నష్టం వాటిల్లిందని, 532 హెక్టార్లలో సోయాబీన్, 350 హెక్టార్లలో మొక్కజొన్న, 100 హెక్టార్లలో వరి, 14 హెక్టార్లలో మినుము పంటలకు వర్షాల కారణంగా నష్టం సంభవించినట్లు జేడీఏ ఆశకుమారి తెలిపారు. ఇందుకు ప్రస్తుతం తీసుకుంటున్న, ముందస్తు చర్యలపై ప్రత్యేకాధికారి వికాస్‌రాజ్ అడిగి తెలుసుకున్నారు. త్వరగా చేతికొచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తే వర్షాలు కురిసినా నష్టం వాటిల్లి ఉండేది కాదని అన్నారు. గత నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో సోయా పంట తక్కువగా కాత కాసిందని, కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయిందని మంత్రి జోగు రామన్న ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని వికాస్‌రాజ్ జేడీఏను అడిగి తెలుసుకున్నారు.
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్..
రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రోడ్లు కొన్ని చెడిపోయూయని ఆ శాఖాధికారులు ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకొచ్చారు. ఆర్‌అండ్‌బీ పరిధిలోని 21 రోడ్లు చెడిపోయాయని, ఇందులో కొన్ని బ్రిడ్జిలు కూడా ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 150 కిలోమీటర్ల మేర రోడ్లు, పంచాయతీరాజ్ పరిధిలోని 32 రోడ్లు చెడిపోయాయని అధికారులు తెలిపారు. మంచిర్యాలలో 3, ఆసిఫాబాద్‌లో 11, నిర్మల్‌లో 18 ఉన్నట్లు వివరించారు.
డీఎంహెచ్‌వో, విద్యుత్ శాఖలపై..
వర్షాల కారణంగా వ్యాధులు సోకకుండా గ్రామాల్లో పంచాయతీ, ఆరోగ్య శాఖాధికారులు కలిసి బృందాల వారీగా ప్రజలకు వ్యాధుల నివారణ, పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వికాస్‌రాజ్ అధికారులను సూచించారు. జిల్లా వ్యాప్తంగా 180 విద్యుత్ స్తంభాలు పడిపోగా, 33 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ చౌహాన్ వివరించారు.
ఉద్యానవన,రెవెన్యూశాఖలపై..
భారీ వర్షాల కారణంగా కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకొచ్చారు. 250 హెక్టార్లలో పసుపు, మిరప 250, టమాటా 300, బెండకాయ 15, వంకాయలు 15 హెక్టార్లతోపాటు ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. జిల్లాలో 64 ఇళ్లు కూలిపోయూయని, ఇద్దరు మృత్యువాతపడ్డారని డీఆర్వో సంజీవ్‌రెడ్డి ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకొచ్చారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement