- 93 లక్షల ఎకరాల్లో పంటల సాగు
- నేటి నుంచి మొదలుకానున్న రబీ పనులు..
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ముగిసింది. శనివారం నుంచి రబీ సీజన్ ప్రారంభం కానుంది. నైరుతి రుతుపవనాలు జూన్‌లో ప్రారంభం కావడంతో ఖరీఫ్ పంటలకు ఢోకా లేదని అన్నదాత ఆశిం చాడు. కానీ వారి ఆశలు అనుకున్నంతగా నెరవేరలేదు. ఈ జూన్‌లో ఏకంగా 50% అధికంగా వర్షాలు నమోదు కాగా ఆ తర్వాత జులైలో 3% లోటు, ఆగస్టులో 42% లోటు వర్షపాతం రికార్డయింది. కానీ సెప్టెంబర్‌లో 200% అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మొదట్లో ఖరీఫ్ పంటలకు ఎంతో ఊపునిచ్చినా కీలకమైన ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న, కంది, సోయాబీన్ ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మొక్కజొన్న సగానికిపైగా తుడిచిపెట్టుకుపోయింది. సోయాబీన్ కొంతమేర నష్టం వాటిల్లింది. మరోవైపు ఇటీవలి వర్షాలకు 1.79 లక్షల ఎకరాల్లో సోయా పంటకు నష్టం వాటిల్లింది. ఖరీఫ్‌లో సాధారణంగా 1.07 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉం డగా... 93.51 లక్షల ఎకరాల్లో (87%) పం టలు సాగయ్యాయి. వరి తక్కువగా 68%లోనే నాట్లు పడ్డాయి. నాట్లు పడిన అనేకచోట్ల ఇటీవలి వర్షాలకు మునిగిపోయాయి.
ఖరీఫ్ రుణాలపై బ్యాంకుల శీతకన్ను
ఖరీఫ్ పంట రుణాలను పూర్తిస్థాయిలో ఇవ్వడంలో బ్యాంకులు విఫలమయ్యాయి. ఖరీ ఫ్‌లో రూ. 17,460.83 కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా... రూ. 11,546.13 కోట్లు మాత్రమే ఇచ్చాయి. కనీసం రబీలోనైనా రుణాలు సరిగా ఇస్తే బాగుంటుందని రైతు లు కోరుతున్నారు. రుణమాఫీ సొమ్ము పూర్తిస్థాయిలో అందకపోవడం వల్లే బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడంలో ఆసక్తి చూపడంలేదని తేలింది. రుణ మాఫీలో మూడో విడత రూ. 4,039.98 కోట్లలో ప్రభుత్వం సగం రూ. 2019.99 కోట్లు విడుదల చేసింది. మూడో విడతలో మరో సగం ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి బ్యాంకులను వేధిస్తోంది. ఓ బ్యాంకులు... మరోవైపు ప్రభుత్వ వైఖరితో రైతులు నష్టపోతున్నారు.
రబీపైనే ఆశలు...
ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు, కుంటలు నిండటం... భూగర్భ జలాలు పెరగడంతో రబీ సీజన్‌లో పెద్ద ఎత్తున పంటలను సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వాస్తవంగా రబీలో 33.64 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుంది. కానీ ఈసారి దానికి అదనంగా మరో 10 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేసేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరి, వేరుశనగ, శనగ, మొక్కజొన్న పంట లు అధికంగా సాగు చేసే అవకాశం ఉంది.
ఆశ నిరాశలతో ముగిసిన ఖరీఫ్
Published Sat, Oct 1 2016 4:45 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement