చీరాల, న్యూస్‌లైన్ : వరుస తుపాన్లు.. అకాల వర్షాలకు అందరికీ పట్టెడన్నం పెట్టే అన్నదాత దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు రైతన్నను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. కోటి ఆశలతో మొదలైన సాగు ఏటా కళ్ల ముందే తుడిచి పెట్టుకుపోతుండటంతో రైతులు కుదేలవుతున్నారు. ఈ పాటికే జల్, లైలా, నీలం వంటి తుపాన్ల ధాటిని తట్టుకోలేక సర్వం కోల్పోయారు. వ్యవసాయం కోసం తెచ్చిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇదిలా ఉంటే గత నెలలో కురిసిన అకాల వర్షాలకు జిల్లాలోని 90 శాతం వ్యవసాయ పంటలు ముంపునకు గురయ్యాయి.
ప్రస్తుతం పై-లీన్ తుపాను నుంచి బయట పడినప్పటికీ లెహర్ తుపాను ప్రభావం ఎటువంటి విపత్తును మిగులుస్తుందోనని రైతులు వణికిపోతున్నారు. లెహర్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్‌లతో పాటు జిల్లా వ్యాప్తంగా వరి, వేరుశనగ, పత్తి, పొగాకు, మరికొన్ని పంటలు సాగవుతున్నాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వరి, మొక్కజొన్న, పొగాకు, కంది, వేరుశనగ, మినుముతో పాటు సుమారు 1.96.200 హెక్టార్ల పంటలు దెబ్బ తిన్నాయి. ప్రభుత్వం నుంచి విత్తన సాయం కూడా అందలేదు. వ్యవసాయం వదులు కోవడం ఇష్టం లేక రైతులు మళ్లీ సాగు మొదలు పెట్టారు. కొన్నిచోట్ల దెబ్బతిన్న పత్తిని పీకేసి మళ్లీ నాటారు. మరికొన్ని చోట్ల దెబ్బతిన్న పత్తిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు పత్తికి * 30 నుంచి * 35 వేల వరకు ఖర్చు చేశారు.
గత నెలలో కురిసిన వర్షాలకు వరి పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా ప్రస్తుతం మళ్లీ నార్లు పోశారు. చీరాల వ్యవసాయ సబ్ డివిజన్‌లో ఉన్న చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాల్లో వరి 4185 హెక్టార్లు, మొక్కజొన్న 1566 హెక్టార్లు, వేరుశనగ 177 హెక్టార్లు, మిరప 380 హెక్టార్లు, పొగాకు 1500 హెక్టార్లు, శనగ 300 హెక్టార్లలో సాగు చేశారు. ఇవి కాక కూరగాయలను 35 హెక్టార్లలో సాగు చేశారు. ఒక్కో రైతు ఎకరానికి * 9 వేల వరకు ఖర్చు చేశాడు. ప్రస్తుతం వైట్‌బర్లీ సాగు చేస్తున్నారు. పర్చూరు, ఇంకొల్లు, యద్దనపూడి, కారంచేడు మండలాల్లో పొగాకు సాగులో ఉంది. ఎకరాకు * 10 వేల వరకు ఖర్చయింది. మరికొన్ని పంటలు కూడా సాగవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఉపద్రవం ముంచుకొస్తుందేమోనని రైతులు బెంబేలెత్తుతున్నారు.
ఏటా వరుసగా ఎదురవుతున్న నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు లెహర్ ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ఏమి జరుగుతుందో, వేసిన పంటలు ఏమవుతాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు ఇక్కడితో ఆగితే పంటలకు పెద్దగా నష్టం ఉండదు. మరో రోజు కొనసాగినా, అధిక వర్షాలు కురిసినా పొలాలు మళ్లీ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.
సర్కార్‌పై నమ్మకం వదులుకున్న అన్నదాతలు
ఏటా ఎదురవుతున్న విపత్తులతో సర్వం కోల్పోయి అప్పుల పాలవుతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉండటం లేదు. నష్ట పరిహారం పంపిణీ చేస్తుందన్న ఆశ అన్నదాతలకు లేదు. గతంలో సంభవించిన నీలం, జల్ తుపానుకు సంబంధించిన నష్టపరిహారం పూర్తిగా రైతులకు చేరలేదు. బ్యాంక్ ఖాతాలతో పాటు అనేక ఆంక్షలతో పరిహారం రైతుల చేతికి పూర్తిగా అందలేదు. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీతో పాటు సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రే హామీ ఇచ్చినా అమలుకు మాత్రం నోచుకోలేదు. 50 శాతంపైగా పంటలు దెబ్బతింటేనా పరిహారం జాబితాలో పేర్లు నమోదు చేస్తామని, లేకుంటే నష్టపోయినట్లుగా లెక్కల్లో పరిగణనలోకి తీసుకోమంటూ కిరణ్ స ర్కార్ మొండికేస్తోంది. ఒకవేళ ఏదైనా ఉపద్ర వం ముంచుకొచ్చి నష్టం జరిగినా మిగిలేది మొండిచెయ్యే కాబట్టి ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్న ఆశ రైతులు వదిలేశారు.
వెన్నులో వణుకు
Published Fri, Nov 29 2013 5:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement