చీరాల : మూడు నెలలకే లక్షల రూపాయాల ఆదాయం తెచ్చే రొయ్యల సాగు.. ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. వరుస నష్టాలతో రైతులు అల్లాడిపోతున్నారు. ఆరు నెలల క్రితం వరకు రైతులకు సిరులు కురిపించిన రొయ్యల సాగు.. ప్రస్తుతం నష్టాలు తెచ్చి పెడుతోంది. అదునులో కూడా వర్షాలు కురవకపోవ డంతో వైట్‌స్పాట్ సోకి రొయ్యలు చనిపోతున్నాయి.
రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదు. ఏడాదికి రెండు సార్లు సాగు చేయాల్సి ఉండగా రైతులు వరస పెట్టి చెరువులు సాగు చేయడం తెగుళ్లకు మరో కారణం. రొయ్య పిల్లల్లో నాణ్యత లేకపోవడం.. సాగు ఖర్చులు పెరిగిపోవడం.. వైరస్‌లతో దిగుబడులు పడిపోవడంతో గతంలో మీసాల తిప్పిన రైతులు ప్రస్తుతం నష్టాల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు.
జిల్లాలోని చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, కొత్తపట్నం, టంగుటూరు, శింగారాయకొండ, ఉలవపాడు మండలాల్లో 3000 హెక్టార్లలో రొయ్యల చెరువులు సాగవుతున్నాయి.
తెగుళ్లు ఆశిస్తున్న సమయాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తే చెరువుల్లో చేరే నీటిని రైతులు బయటకు విడుదల చేస్తుంటారు. దీంతో వైరస్ ప్రభావం తగ్గుతుంది.
{పస్తుతం వర్షాలు కురవక పోవడంతో రొయ్యలకు వైరస్ సోకి అవి చనిపోతున్నాయి.
సీడ్ (రొయ్యపిల్లలు) ఎంపికలో నాణ్యత లేకపోడం తెగుళ్లకు మరో కారణం. ఇతర దేశాల నుంచి మన డిమాండ్‌కు తగ్గిన విధంగా బ్రూడర్ (తల్లి రొయ్య) అందకపోవడంతో రొయ్య పిల్లల కోసం రైతులు స్థానికంగా ఉండే హేచరీలను అశ్రయించాల్సి వస్తోంది. సీడ్ మంచిదో కాదో ల్యాబ్‌లో నిర్ధారించకుండానే చెరువుల్లో పెంచున్నారు. ఫలితంగా అవి నెల.. లేకుంటే రెండు నెలల్లో చనిపోతున్నాయి. సాధారణంగా చెరువుల్లో 100 పిల్లలు వేస్తే 70 పిల్లల వరకు బతుకుతాయి. ప్రస్తుతం వంద పిల్లలకుగాను 20 నుంచి 30 రొయ్య పిల్లలే బతుకుతున్నాయి.
తడిసి మోపెడైన ఖర్చులు
వనామి సాగు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. సీడ్, ఫీడ్, మందులు, డీజల్, లీజు ఖర్చులు అంతకంతకూ పెరిగాయి. వనామి సాగులో వరస లాభాలు రావడంతో రొయ్యల సాగుకు డిమాండ్ పెరిగి లీజు ధరలు రెట్టింప్పయ్యాయి. గతంలో ఎకరా చెరువు ఎడాదికి లక్ష రూపాయల లీజు ఉండగా ప్రస్తుతం రూ.1.80 లక్షలకు పెరిగింది. మందుల ధరలు ఈ ఎడాది 25శాతం పెరిగాయి. గత ఎడాది ఫీడ్ ధర టన్ను రూ.63 వేలుండగా ప్రస్తుతం రూ.70 వేల వరకు పెరిగింది. గత ఎడాది ఎకరా చెరువుకు రూ.7 నుంచి రూ.9 లక్షలు ఖర్చు కాగా ప్రస్తుతం రూ.13 నుంచి రూ.15 లక్షలకు పెరిగింది.
దిగజారిన ధరలు
రొయ్యల ధరలు రోజురోజూకూ పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడంతో రొయ్యలు ధరలు జనవరి నెలకంటే ఇప్పుడు గణనీయంగా తగ్గాయి.
జనవరిలో..
కౌంట్ రేటు ప్రస్తుతం
30 రూ.680 రూ.540
40 రూ.580 రూ.440
50 రూ.510 రూ.350
60 రూ.400 రూ.310
సీడ్‌లో కొరవడిన నాణ్యత : డాక్టర్ రఘునాథ్,మత్స్యశాఖ ఏడీ
సీడ్‌లో నాణ్యత లేకపోవడం రొయ్యల సాగులో నష్టాలకు ప్రధాన కారణం. ముఖ్యంగా సర్వేయల్స్(బతికిన పిల్లల సంఖ్య) పడిపోతున్నాయి. 100 కిలోలకు 30 కిలోలే బతుకుతున్నాయి. రొయ్యలు సాగు చేసే రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుని మన కేంద్ర ప్రభుత్వం వాటికి పరీక్షలు నిర్వహిస్తోంది.
అందులో మంచివాటిని ఎంపిక చేసుకుని చెన్నైలో ఉన్న హేచరీస్‌కు పంపి సీడ్‌ను తయారు చేస్తారు. అక్కడ పరీక్షల అనంతరం మేలైన రొయ్య పిల్లలను రైతులకు విక్రయిస్తారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్నా రొయ్య పిల్లలు దిగుమతి కావడం లేదు. రైతులు స్థానికంగా హేచరీల వద్ద నుంచి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. వాటిలో నాణ్యత లేకుండా ఉండటం వల్లే రొయ్య పిల్లలు చనిపోతున్నాయి.
వర్షాలు లేక రొయ్యలకు సోకుతున్న రోగాలు
Published Sat, Aug 16 2014 3:21 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement