చీరాల, న్యూస్‌లైన్: వరుస ప్రకృతి వైపరీత్యాలతో అన్ని విధాలా నష్టపోయి అప్పుల ఊబిలో చిక్కుకొని వ్యవసాయానికి దూరమవుతున్న రైతులను సర్కారు విధానాలు మరింత నష్టపరుస్తున్నాయి. సవాలక్ష నిబంధనలతో రుణాలు మంజూరు చేయడంలో రైతులకు ‘చెయ్యి’స్తున్న ప్రభుత్వం చివరకు వారికి ఇవ్వాల్సిన వడ్డీలు కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. గతేడాది రబీ సీజన్‌కు సంబంధించిన రుణాలు వడ్డీతో సహా కట్టినప్పటికీ రైతులకు తిరిగి ఇవ్వాల్సిన వడ్డీ మాత్రం ప్రభుత్వం బ్యాంకులకు జమ చేయలేదు. వివరాల్లోకి వెళితే...ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల్లోపు పంట రుణాలను వడ్డీ లేకుండా అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.
అయితే ఆచరణలో రుణాల తాలూకు వడ్డీ తిరిగి రైతులకు జమచేయడంలో ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. రైతులు తీసుకున్న రుణాలకు అసలుతో పాటు ఏడు శాతం వడ్డీ కలిపి తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు చెప్పారు. రైతులు కట్టిన వడ్డీ నగదు ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన వెంటనే తిరిగి వారి ఖాతాల్లో జమచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పంట రుణాలు తీసుకొన్న వారు ఏడాది లోపు వడ్డీతో కలిపి బ్యాంకులకు తిరిగి చెల్లించేశారు. అయితే రుణాలు కట్టి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు వడ్డీ తిరిగి రైతుల ఖాతాల్లోకి చేరలేదు. పంట రుణాలు చెల్లించిన రైతులు బ్యాంకుల చుట్టూ రోజూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకు అధికారులు ప్రభుత్వం నుంచి వడ్డీకి సంబంధించిన నిధులు రాలేదంటున్నారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన
నిధులు * 7 కోట్లు:
లక్ష నుంచి * 3 లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ ప్రభుత్వం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలో సుమారు రెండు లక్షల మంది రైతులకు గత ఏడాది రబీ సీజన్‌లో * 1200 కోట్ల పంట రుణాలిచ్చారు. రుణాలు తీసుకున్న వారిలో దాదాపు 90 శాతం మంది రైతులు సకాలంలో బ్యాంకులకు ఏడు శాతం వడ్డీతో కలిపి తిరిగి చెల్లించేశారు. రుణాలు చెల్లించి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు వడ్డీ తిరిగి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేదు. ప్రభుత్వం నుంచి రుణాల తాలూకు దాదాపు * 7 కోట్ల వడ్డీ బ్యాంకులకు జమకావాల్సి ఉంది. వడ్డీలేని రుణాల మాట ప్రభుత్వం మరిచిపోయిందని రైతులు విమర్శిస్తున్నారు. వరుస నష్టాలతో అప్పులపాలైన తమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నాటకాలాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణం చెల్లించి నాలుగు నెలలైంది
డి.సత్యనారాయణ
గత ఏడాది రబీ సీజన్‌లో వరి సాగు కోసం బ్యాంకులో వ్యవసాయ రుణం తీసుకున్నా. సంవత్సరంలోపు చెల్లిస్తే వడ్డీ ఉండదు. వడ్డీతో కలిపి అక్టోబర్‌లోనే రుణం తిరిగి చెల్లించా. కానీ వడ్డీ ఇంత వరకు ఇవ్వలేదు. బ్యాంకు అధికారులు ఇంకా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటున్నారు.
బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా
యానాదిరెడ్డి
రబీ సీజన్‌లో వరి సాగుకు బ్యాంకులో రుణం తీసుకున్నాను. ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే వడ్డీ ఉండదన్నారు. ముందుగా వడ్డీతో కలిపి రుణం చెల్లించాలని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కట్టాను. నాలుగు నెలలైనా ఇంత వరకు వడ్డీ తిరిగి ఇవ్వలేదు. బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను.
గత ఏడాది రబీ రుణాలు వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారు
లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రసాద్
గత ఏడాది 2012 నవంబర్ నుంచి 2013 మార్చి వరకు రబీ సీజన్‌లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల వడ్డీ రాయితీ వ్యవహారం వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారు. బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లించిన రైతు జాబితాలను ప్రభుత్వం వద్దకు పంపి, వాటి వడ్డీని బ్యాంకులకు జమచేసే బాధ్యత వ్యవసాయశాఖ పైనే ఉంటుంది.
లేహ్యం పేరుతో లూటీ
Published Sun, Dec 15 2013 4:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement