కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని కొమ్మమూరు రైతాంగం ముంపు బారి నుంచి బయటపడటం గగనంగా మారింది.
చీరాల, న్యూస్‌లైన్ : కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని కొమ్మమూరు రైతాంగం ముంపు బారి నుంచి బయటపడటం గగనంగా మారింది. ఏటా వ్యవసాయ సీజన్‌లో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా వ్యయ ప్రయాసలతో వేసిన పంటలు ముంపునకు గురై రైతులు నష్టాలపాలవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు నోటిదాకా వచ్చేలోగా నీళ్లపాలవుతున్నాయి. డెల్టా రైతాంగానికి ఇటువంటి కన్నీటి కష్టాలు ఏటా మామూలే. ముంపు నుంచి బయట పడేందుకు చేపట్టిన కృష్ణా పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులు ప్రహసనంగా మారాయి. ఎప్పుడో పూర్తికావాల్సిన పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత కారణంగా మందకొడిగా సాగుతున్నాయి. రొంపేరు కుడి, ఎడమ కాలువలతో పాటు అనేక మేజర్, మైనర్ మురుగునీటి కాలువులను ఆధునికీకరించాల్సి ఉంది. ప్రధానంగా రొంపేరు కుడి, ఎడమ కాలువలను ఇప్పటి కంటే మరో 25శాతం వెడల్పు చేయాల్సి ఉంది. ఇది పూర్తయితే భారీగా వచ్చే వరదనీరు నేరుగా సముద్రంలో కలుస్తుంది. లేకుంటే వరదనీరు పంట పొలాలను ముంచెత్తుతుంది.
2006 నుంచి మొదలు..
కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని వ్యవసాయ మురుగునీటి కాలువల ఆధునికీకరణకు 2006లో ప్రభుత్వం రూ. 130 కోట్లు కేటాయించింది. మూడు సార్లు టెండర్లు పిలిచినా ఆ ప్రక్రియ కొలిక్కిరాలేదు. చివరకు రెండేళ్ల క్రితం టెండర్లు ఆహ్వానించగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మాత్రం నత్తతో పోటీపడుతున్నారు. వ్యవసాయ మురుగునీటి కాలువలు బ్రిటీష్ హయాంలో నిర్మించారు. అవి ప్రస్తుతం పూర్తిగా పాడయ్యాయి. వర్షాలు, తుపాన్ల సమయంలో కురిసే భారీ వర్షాలకు పంటలను ముంపు నుంచి కాపాడేందుకు ఈ మురుగునీటి కాలువలే దిక్కు. ఎగువ ప్రాంతాల నుంచి పంట పొలాలకు అనుసంధానమవుతూ చివరకు సముద్రంలో కలుస్తుంటాయి. కొన్నేళ్లుగా మురుగునీటి కాలువలు పనికి రాకుండా ఉన్నాయి. దీంతో చిన్నపాటి వర్షాలకే పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి.
జరిగింది రూ. 40 కోట్ల పనులే
ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం రూ. 40 కోట్ల మేర పనులు మాత్రమే పూర్తయయ్యాయి. రొంపేరు, కుడి, ఎడమ కాలువులు, మరికొన్ని మేజర్, మైనర్ కాలువలను మాత్రమే కొంత మేర తవ్వారు. ఇంకా కాలువల వెడల్పు చేయాల్సి ఉంది. వ్యవసాయ సీజన్ ముగిసిన తర్వాత అంటే.. వేసవి కాలంలోనే ఆధునికీకరణ పనులు చేయాల్సి ఉంది. మరో ఏడాదిన్నరతో కాంట్రాక్టర్లకు కాలపరిమితి ముగియనుంది.
ఆధునికీకరించాల్సిన కాలువలు ఇవే..
రొంపేరు రైట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్, వేటపాలెం, ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ కాలువలు, కుందేరు డ్రెయిన్, పర్చూరు వాగు, ముప్పాళ్ల వాగు, మద్దిరాల వాగు, సాకి డ్రెయిన్, పర్చూరు సబ్‌ప్లస్, నక్కలవాగు, ఆలేరు, అప్పేరు వాగులు, ఈదుమూడి, మట్టిగుంట, నాగండ్ల వాగులతో పాటు మొత్తం 27 డ్రెయినేజీ కాలువలను ఆధునికీకరించాల్సి ఉంది. డ్రైయినేజీ కాలువల వ్యవస్థ సక్రమంగా ఉంటే ముంపు నుంచి పంటలు దెబ్బతినే పరిస్థితి ఉండదు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షం నీరు డ్రైయినేజీ కాలువల ద్వారా నేరుగా సముద్రంలో కలుస్తాయి. దీంతో పంటలు ముంపు నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం కాలువలు అధ్వానస్థితికి చేరటంతో కొద్దిపాటి వర్షాలకే పంటపొలాలు మునుగుతున్నాయి.