చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలో 50 ఎకరాలకు పైగా డ్రైనేజీ భూములు
రొంపేరు, ముసలమ్మ మురుగు నీటి కాలువల కోసం భూముల కేటాయింపు
అధికభాగం ఆక్రమించి అమ్మకానికి పెట్టిన టీడీపీ నేతల అనుచరులు
మరికొంత భూమి తనదంటూ అమ్మకానికి పెట్టిన రిటైర్డ్ అధికారి
ఎకరం రూ. 4 నుంచి 5 లక్షలకు అమ్మకం
ఎక్కువ భూమిని కొన్న మాజీ ఎమ్మెల్యే అనుచరుడు
వాటిలో రొయ్యల సాగుకు ఏర్పాట్లు
ఆక్రమణదారులతో డ్రైనేజీ అధికారులు కుమ్మక్కు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇసుక, బుసక, గ్రావెల్, గ్రానైట్‌తోపాటు పచ్చ నేతల కన్ను ఇప్పుడు ప్రభుత్వ భూములపై పడింది. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని డ్రైనేజీ (ప్రభుత్వ) భూములపై పచ్చనేతతోపాటు ఒక మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, ఇన్నాళ్లూ ఆ భూములను కాపుకాసిన విశ్రాంత అధికారి కన్నూ పడింది. తలో ఇంత పంచుకున్నారు. ఎటువంటి పట్టాలు పొందే అవకాశం లేని ఆ ప్రభుత్వ భూములను ఏకంగా అమ్మకానికి పెట్టారు. అగ్రిమెంట్ల మీదనే ఎకరం రూ. 4 నుంచి 5 లక్షలకు అమ్మారు.
వీటిలో ఎక్కువ భూములను మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దొరకబుచ్చుకున్నారు. ఆ భూముల్లో రొయ్యల చెరువుల సాగుకు సిద్ధమయ్యారు. వేటపాలెం మండలం సంతరావూరు బ్రిడ్జి సమీపంలో ప్రధాన రహదారికి పక్కనే రొంపేరు డ్రైన్, ముసలమ్మ మురుగు నీటి కాలువల మధ్య 50 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. డ్రైన్స్ నిర్మాణంలో భాగంగా వాటిని పూర్వం ప్రభుత్వం కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు.
పదేళ్ల క్రితం వరకు వేటపాలెం ప్రాంతంలో ఉన్న కుమ్మరులు (శాలివాహనులు) కుండలు, ఇతరత్రామట్టి పాత్రలు తయారు చేసేందుకు ఆ భూముల్లో ఉన్న బంకమట్టిని తీసుకువెళ్లేవారు. అప్పట్లో ఆ భూముల ఆక్రమణకు కొందరు నేతలు ప్రయత్నించగా కుమ్మరులు అడ్డుకున్నారు. ఆ తర్వాత మట్టి పాత్రలకు డిమాండ్ పడిపోయి తయారీ నిలిచి పోవడంతో కుమ్మరులు వాటిని వదిలేశారు. దీంతో ఆ భూములపై అక్రమార్కుల కన్నుపడింది.
వాలిపోయిన పచ్చ మూకలు
ఇప్పుడు వాటిని పరిరక్షించే వాళ్లు లేకపోవడంతో పచ్చ మూకలు వాలిపోయాయి. చీరాల ప్రాంతానికి చెందిన టీడీపీ నేత అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, మరికొందరు ఆ భూములను ఆక్రమించారు. 10 మంది కలిసి 15 ఎకరాల్లో వరి, జొన్న పంటలు సాగు చేసేవారు. ఇంకొందరు కొన్ని భూములు వారివంటూ హద్దులు గీసుకున్నారు. వేటపాలేనికి చెందిన డ్రైనేజీ విభాగం విశ్రాంత అధికారి సైతం కొంత మేర ఆక్రమించారు. వాస్తవానికి డ్రైనేజీ, డొంక, శ్మశాన తదితర పోరంబోకు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వదు.
ఇక్కడ కూడా ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని సమాచారం. కానీ టీడీపీ నేతల అనుచరులు ఇప్పటికే సుమారు 18 ఎకరాలు ఆక్రమించడంతో పాటు, అప్పటికే ఆక్రమించిన వారి వద్ద భూములను కూడా ఎకరం రూ. 4 నుంచి 5 లక్షలకు కొన్నారు. ఇలా ఇప్పటివరకూ 30 ఎకరాలకుపైగా డ్రైనేజీ భూములు విక్రయాలు జరిగినట్లు సమాచారం. డ్రైనేజీ విభాగం రిటైర్డ్ అధికారి సైతం కొన్ని భూములను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. వీటన్నింటినీ మాజీ ఎమ్మెల్యే అనుచరుడొకరు కొంటున్నారు.
ఈ భూముల ఆక్రమణ, అమ్మకాలను అడ్డుకోవాల్సిన డ్రైనేజీ విభాగం అధికారులు కూడా కబ్జాదారులతో కుమ్మక్కైపోయారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారి ఉంటాయని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, డ్రైనేజీ భూములను కొందరు సాగు చేసుకుంటున్న విషయం తన దృష్టిలో ఉందని, ఆక్రమణలు విషయం తన దృష్టికి రాలేదని మురుగునీటిపారుదల శాఖ డీఈ వెంకట సుబ్బారావు చెప్పారు. విచారణ జరిపి క్రయవిక్రయాలు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment