గవినివారిపాలెంలో కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ అభ్యర్థి కొండయ్య
చీరాలలో వైఎస్సార్‌సీపీ నేతపై కాంగ్రెస్ అభ్యర్థి దాడి
చీరాల టౌన్/చీరాల: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్ అనుచరులు జరిపిన దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం గవినివారిపాలెం పోలింగ్ కేంద్రానికి కొండయ్య యాదవ్ అనుచరులతో వచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేశారు. దీన్ని రాష్ట్ర అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు అడ్డుకోవడంతో ఆయనపై కొండయ్య దురుసుగా ప్రవర్తించారు. ఇదే అదనుగా ఆయన అనుచరులు రాడ్లు, కర్రలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చితకబాదారు.
పోలీసుల కళ్లముందే ఇదంతా జరుగుతున్నా చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ, డీఎస్పీ బేతపూడి ప్రసాద్ చోద్యం చూస్తున్నారే తప్ప అడ్డుకోవడానికి యత్నించలేదు. పైగా దాడిలో గాయపడిన చీదరబోయిన రమణమ్మ, మరో ముగ్గురిని బలవంతంగా పక్కకు నెట్టేశారు. గవిని శ్రీను, మరో నలుగురు వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసు జీపులో ఎక్కించుకుని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడకు చేరుకున్న కొండయ్య కుమారుడు మహేంద్ర, అతని అనుచరులు కర్రలతో వచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. చివరకు డీఎస్పీ బేతపూడి ప్రసాద్ రంగంలోకి దిగి కొండయ్యను బతిమిలాడి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తరువాత పిట్టువారిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తూ టీడీపీకి ఓట్లు వేయకపోతే అందరి అంతూ చూస్తానంటూ బెదిరింపులకు దిగారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి దౌర్జన్యం
చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి కొండయ్య గెలవాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ నేత బలగంశెట్టి అంకమ్మరావుపై దాడికి దిగారు. రెడ్డిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద అంకమ్మరావు ప్రజలకు నమస్కరిస్తూండగా కారులోంచి దిగిన ఆమంచి దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆయన చీరాల ఏరియా వైద్యశాలలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరణంపై ఆమంచి దాడి
చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో కలసి బీభత్సం సృష్టించారు. ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు పట్టణంలోని ఏడో వార్డుకు సోమవారం సాయంత్రం వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్‌ను కులం పేరుతో దూషించి, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తన అనుచరులతో కలసి దాడికి తెగబడ్డారు. వెంకటేష్ కారు అద్దాలు పగులకొట్టించారు. అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చీరాల వన్‌టౌన్, టూటౌన్ సీఐలు పి.శేషగిరిరావు, సోమశేఖర్ ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమంచి వర్గీయులను అక్కడ నుంచి పంపించి వేశారు.
Comments
Please login to add a commentAdd a comment