బియ్యం ఇస్తే ఓకే.. లేదంటే ‘6ఏ’ అస్త్రం | Ration mafia is flourishing in Chirala | Sakshi
Sakshi News home page

బియ్యం ఇస్తే ఓకే.. లేదంటే ‘6ఏ’ అస్త్రం

Published Wed, Dec 11 2024 6:05 AM | Last Updated on Wed, Dec 11 2024 6:05 AM

Ration mafia is flourishing in Chirala

బియ్యం ఇవ్వని రేషన్‌ డీలర్లపై పచ్చబ్యాచ్‌ కక్షసాధింపు

తొలగించిన డీలర్ల స్థానంలో సొంత మనుషులను నియమించుకుంటున్న మాఫియా

చీరాలలో పేట్రేగిపోతున్న రేషన్‌ మాఫియా 

ఓ పచ్చనేతకు నెలకు రూ.20 లక్షలు కప్పం 

రెవెన్యూ, పోలీసు అధికారులకూ వాటాలు 

మండలానికొక వ్యక్తిని నియమించి దందా 

చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని ఒక రేషన్‌ డీలర్‌ (ఇతను రేషన్‌ మాఫియాలో నెలకు రూ.25 వేల జీతానికి పనిచేస్తున్నాడు) మండలంలో ఉన్న రేషన్‌ డీలర్ల నుంచి మాఫియా తరఫున నెలనెలా బియ్యం సేకరించి అప్పగిస్తాడు.

ఇదే మండలంలో కూతురు పేరుతో రేషన్‌ షాపు నడుపుతున్న మరో డీలర్‌ను బియ్యం ఇవ్వాలని నవంబరు 2న కోరాడు. అమ్మకాలు పూర్తికాలేదని, బియ్యం తర్వాత ఇస్తానని ఆ డీలర్‌ చెప్పాడు. దీంతో డీలర్‌ కం మాఫియా ఉద్యోగి వెంటనే రేషన్‌ మాఫియాను నడిపిస్తున్న ‘ఒంగోలు ప్రసాద్‌’కు ఫోన్‌చేశాడు.

బియ్యం అడిగితే డీలర్‌ స్పందించడంలేదని, అతను మనకు సక్రమంగా బియ్యం ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశాడు. అంతే.. రేషన్‌ షాపులు పర్యవేక్షించే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారికి ప్రసాద్‌ ఫోన్‌ కొట్టి తనకు బియ్యం ఇవ్వని రేషన్‌ డీలర్‌ను వెంటనే బుక్‌చేయాలని హుకుం జారీచేశాడు. 

అరగంటలో అక్కడ వాలిన అధికారి షాపును తనిఖీచేసి 92 బస్తాల బియ్యం అధికంగా ఉన్నాయంటూ ఆ డీలర్‌ వివరణ కూడా తీసుకోకుండా సిక్స్‌–ఏ కింద బుక్‌చేసి వెంటనే ఆయనను తొలగించారు. కొసమెరుపు ఏంటంటే రేషన్‌ మాఫియాలో నెలజీతానికి పనిచేస్తున్న వేటపాలెంకు చెందిన డీలర్‌కే ఈ డీలర్‌షిప్‌ అప్పగించారు. 

బియ్యం విషయంలో చీరాల రూరల్‌ పరిధిలోని ఒక డీలర్‌తో రేషన్‌ మాఫియాకు నవంబరులో గొడవైంది. ఏకంగా డీలర్‌పైనే రేషన్‌ మాఫియా మనుషులు దాడిచేసి కొట్టారు. రేషన్‌ డీలర్‌ చీరాల టూటౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదైంది. చీరాల నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. రేషన్‌ మాఫియా ఆగడాలు శృతిమించాయనడానికి ఈ రెండు ఘటనలు ఉదాహరణ.

సాక్షి ప్రతినిధి, బాపట్ల: పేదల బియ్యాన్ని చవగ్గా కొట్టేసి రీసైక్లింగ్‌ చేసి అక్రమార్జనకు పాల్పడుతున్న మాఫియా, రేషన్‌ డీలర్లను శాసిస్తోంది. పేదల కడుపుకొట్టి మొత్తం చౌక బియ్యాన్ని తమకే అప్పగించాలని బెదిరిస్తోంది. ఈ ప్రాంతంలో ఓ పచ్చనేత ఇలాగే రేషన్‌ మాఫియా నుంచి రూ.20 లక్షలు కప్పం పుచ్చుకుంటున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో రెచి్చపోతున్న మాఫియా రేషన్‌ డీలర్లతో కుమ్మక్కైంది. 

ఈ అక్రమ వ్యాపారం తొలిరోజుల్లో కార్డుదారులకు కిలోకు రూ.8 నుంచి రూ.10.. డీలర్లకు రూ.13 చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యానికి డిమాండ్‌ నెలకొనడంతో ఎక్కువ ధర ఇస్తామని వ్యాపారులు పోటీపడుతున్నారు. కిలో బియ్యానికి రూ.10 నుంచి  రూ.13 ఇస్తామని లబ్ధిదారులకు.. అదే సమయంలో డీలర్లకు రూ.16 ఇస్తామని చెబుతున్నారు. 

ఈ డిమాండ్‌ నేపథ్యంలో.. లబ్దిదారులు, డీలర్లు ఇంకా ఎక్కువ మొత్తం కోరుతున్నారు. మరోవైపు.. నియోజకవర్గ పచ్చనేతల డిమాండ్‌ కూడా పెరిగింది. ప్రారంభంలో చీరాల ప్రాంతంలోని ఒక పచ్చనేతకు నెలకు రూ.12 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న మాఫియా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 20 లక్షలకు పెంచినట్లు సమాచారం.  ఇలా పచ్చనేతకు పెద్ద మొత్తంలో కప్పం కడుతున్న చీరాల మాఫియా రేషన్‌ డీలర్లను ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. 

కొందరు ఎక్కువ మొత్తం కావాలని డిమాండ్‌ చేస్తూ బియ్యం సక్రమంగా ఇవ్వకపోవడంతో ఈ మాఫియా ప్రైవేటు సైన్యాన్ని పెట్టి బెదిరింపులకు దిగడమే కాక ఏకంగా భౌతికదాడులకు తెగబడుతోంది. రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు సైతం నెలనెలా మామూళ్లు ఇస్తుండడంతో వారు మాఫియాకు దన్నుగా నిలుస్తున్నారు. వారిని అడ్డుపెట్టి మాటవినని డీలర్లపై సిక్స్‌–ఏ కేసులు నమోదు చేయించి డీలర్లను తొలగిస్తున్నారు. ఇలా తొలగించిన వారి స్థానంలో తమకు అనుకూలంగా ఉన్న చుట్టుపక్కల డీలర్లకు ఈ షాపులను అప్పగిస్తున్నారు. 

దీంతో.. పచ్చనేత, అధికారుల మద్దతు ఉండడంతో రేషన్‌ మాఫియా ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా ఉంటోంది. మరోవైపు.. కొందరు డీలర్లు కార్డుదారులకు బియ్యం అస్సలు ఇవ్వకుండా మొత్తం బియ్యం తీసేసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కార్డులు రద్దుచేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని పర్చూరు, అద్దంకి ప్రాంతాల్లో రీసైక్లింగ్‌ చేసి కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నారు. కొందరు జిల్లాస్థాయి 
అధికారులు మాఫియాతో కుమ్మక్కై తమకేమీ పట్టనట్లు మిన్నకుండి పోవడంతో రేషన్‌ దందా జోరుగా సాగుతోంది.  

సిక్స్‌–ఏ కేసు అంటే..
ప్రభుత్వ రేషన్‌ షాపుల్లో అవకతవకలు జరిగితే రెవెన్యూ అధికారులు (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిటీ, తహసీల్దారు తదితరులు) ఈ 6ఏ కేసులు నమోదు చేస్తారు. ప్రధానంగా డీలర్‌ వద్ద ఉన్న స్టాకు రికార్డులకు అనుగుణంగా ఉండకపోతే ఈ కేసులు పెట్టడం పరిపాటి. విచారణలో నిజమని తేలితే ఆర్డీఓ స్థాయిలో డీలర్‌ను తొలగించవచ్చు. రాజకీయంగా ఎలాంటి మద్దతు లేకపోతే ఈ కేసు బుక్‌ చేసిన వెంటనే తహసీల్దార్‌ స్థాయిలోనే డీలర్‌íÙప్‌ నిలిపివేసి వేరొకరికి కేటాయిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement