ration mafia
-
బియ్యం ఇస్తే ఓకే.. లేదంటే ‘6ఏ’ అస్త్రం
చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని ఒక రేషన్ డీలర్ (ఇతను రేషన్ మాఫియాలో నెలకు రూ.25 వేల జీతానికి పనిచేస్తున్నాడు) మండలంలో ఉన్న రేషన్ డీలర్ల నుంచి మాఫియా తరఫున నెలనెలా బియ్యం సేకరించి అప్పగిస్తాడు.ఇదే మండలంలో కూతురు పేరుతో రేషన్ షాపు నడుపుతున్న మరో డీలర్‌ను బియ్యం ఇవ్వాలని నవంబరు 2న కోరాడు. అమ్మకాలు పూర్తికాలేదని, బియ్యం తర్వాత ఇస్తానని ఆ డీలర్ చెప్పాడు. దీంతో డీలర్ కం మాఫియా ఉద్యోగి వెంటనే రేషన్ మాఫియాను నడిపిస్తున్న ‘ఒంగోలు ప్రసాద్’కు ఫోన్‌చేశాడు.బియ్యం అడిగితే డీలర్ స్పందించడంలేదని, అతను మనకు సక్రమంగా బియ్యం ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశాడు. అంతే.. రేషన్ షాపులు పర్యవేక్షించే ఎన్ఫోర్స్మెంట్ అధికారికి ప్రసాద్ ఫోన్ కొట్టి తనకు బియ్యం ఇవ్వని రేషన్ డీలర్‌ను వెంటనే బుక్‌చేయాలని హుకుం జారీచేశాడు. అరగంటలో అక్కడ వాలిన అధికారి షాపును తనిఖీచేసి 92 బస్తాల బియ్యం అధికంగా ఉన్నాయంటూ ఆ డీలర్ వివరణ కూడా తీసుకోకుండా సిక్స్–ఏ కింద బుక్‌చేసి వెంటనే ఆయనను తొలగించారు. కొసమెరుపు ఏంటంటే రేషన్ మాఫియాలో నెలజీతానికి పనిచేస్తున్న వేటపాలెంకు చెందిన డీలర్‌కే ఈ డీలర్షిప్ అప్పగించారు. బియ్యం విషయంలో చీరాల రూరల్ పరిధిలోని ఒక డీలర్‌తో రేషన్ మాఫియాకు నవంబరులో గొడవైంది. ఏకంగా డీలర్‌పైనే రేషన్ మాఫియా మనుషులు దాడిచేసి కొట్టారు. రేషన్ డీలర్ చీరాల టూటౌన్లో ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదైంది. చీరాల నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. రేషన్ మాఫియా ఆగడాలు శృతిమించాయనడానికి ఈ రెండు ఘటనలు ఉదాహరణ.సాక్షి ప్రతినిధి, బాపట్ల: పేదల బియ్యాన్ని చవగ్గా కొట్టేసి రీసైక్లింగ్ చేసి అక్రమార్జనకు పాల్పడుతున్న మాఫియా, రేషన్ డీలర్లను శాసిస్తోంది. పేదల కడుపుకొట్టి మొత్తం చౌక బియ్యాన్ని తమకే అప్పగించాలని బెదిరిస్తోంది. ఈ ప్రాంతంలో ఓ పచ్చనేత ఇలాగే రేషన్ మాఫియా నుంచి రూ.20 లక్షలు కప్పం పుచ్చుకుంటున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో రెచి్చపోతున్న మాఫియా రేషన్ డీలర్లతో కుమ్మక్కైంది. ఈ అక్రమ వ్యాపారం తొలిరోజుల్లో కార్డుదారులకు కిలోకు రూ.8 నుంచి రూ.10.. డీలర్లకు రూ.13 చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యానికి డిమాండ్ నెలకొనడంతో ఎక్కువ ధర ఇస్తామని వ్యాపారులు పోటీపడుతున్నారు. కిలో బియ్యానికి రూ.10 నుంచి రూ.13 ఇస్తామని లబ్ధిదారులకు.. అదే సమయంలో డీలర్లకు రూ.16 ఇస్తామని చెబుతున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలో.. లబ్దిదారులు, డీలర్లు ఇంకా ఎక్కువ మొత్తం కోరుతున్నారు. మరోవైపు.. నియోజకవర్గ పచ్చనేతల డిమాండ్ కూడా పెరిగింది. ప్రారంభంలో చీరాల ప్రాంతంలోని ఒక పచ్చనేతకు నెలకు రూ.12 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న మాఫియా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 20 లక్షలకు పెంచినట్లు సమాచారం. ఇలా పచ్చనేతకు పెద్ద మొత్తంలో కప్పం కడుతున్న చీరాల మాఫియా రేషన్ డీలర్లను ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. కొందరు ఎక్కువ మొత్తం కావాలని డిమాండ్ చేస్తూ బియ్యం సక్రమంగా ఇవ్వకపోవడంతో ఈ మాఫియా ప్రైవేటు సైన్యాన్ని పెట్టి బెదిరింపులకు దిగడమే కాక ఏకంగా భౌతికదాడులకు తెగబడుతోంది. రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సైతం నెలనెలా మామూళ్లు ఇస్తుండడంతో వారు మాఫియాకు దన్నుగా నిలుస్తున్నారు. వారిని అడ్డుపెట్టి మాటవినని డీలర్లపై సిక్స్–ఏ కేసులు నమోదు చేయించి డీలర్లను తొలగిస్తున్నారు. ఇలా తొలగించిన వారి స్థానంలో తమకు అనుకూలంగా ఉన్న చుట్టుపక్కల డీలర్లకు ఈ షాపులను అప్పగిస్తున్నారు. దీంతో.. పచ్చనేత, అధికారుల మద్దతు ఉండడంతో రేషన్ మాఫియా ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా ఉంటోంది. మరోవైపు.. కొందరు డీలర్లు కార్డుదారులకు బియ్యం అస్సలు ఇవ్వకుండా మొత్తం బియ్యం తీసేసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కార్డులు రద్దుచేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని పర్చూరు, అద్దంకి ప్రాంతాల్లో రీసైక్లింగ్ చేసి కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నారు. కొందరు జిల్లాస్థాయి అధికారులు మాఫియాతో కుమ్మక్కై తమకేమీ పట్టనట్లు మిన్నకుండి పోవడంతో రేషన్ దందా జోరుగా సాగుతోంది. సిక్స్–ఏ కేసు అంటే..ప్రభుత్వ రేషన్ షాపుల్లో అవకతవకలు జరిగితే రెవెన్యూ అధికారులు (ఎన్ఫోర్స్మెంట్ డిటీ, తహసీల్దారు తదితరులు) ఈ 6ఏ కేసులు నమోదు చేస్తారు. ప్రధానంగా డీలర్ వద్ద ఉన్న స్టాకు రికార్డులకు అనుగుణంగా ఉండకపోతే ఈ కేసులు పెట్టడం పరిపాటి. విచారణలో నిజమని తేలితే ఆర్డీఓ స్థాయిలో డీలర్‌ను తొలగించవచ్చు. రాజకీయంగా ఎలాంటి మద్దతు లేకపోతే ఈ కేసు బుక్ చేసిన వెంటనే తహసీల్దార్ స్థాయిలోనే డీలర్íÙప్ నిలిపివేసి వేరొకరికి కేటాయిస్తారు. -
పాలకుల కనుసన్నల్లోనే రేషన్ దందా
సాక్షి, అమరావతి బ్యూరో: పల్నాడు ప్రాంతంలో రేషన్ మాఫియా రాజ్యమేలుతోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో చౌక దుకాణాలు నడుస్తున్నాయి. డ్వాక్రా గ్రూపు మహిళలను తాత్కాలిక డీలర్లుగా నియమించుకొని, రేషన్ దందా సాగిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2802 రేషన్ దుకాణా లున్నాయి. తెల్ల రేషన్ కార్డులు 14,89,722 ఉన్నాయి. వీటికి సంబంధించి 22,075 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో 30 శాతంకు పైగా రేషన్ బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ప్రధానంగా పల్నాడు ప్రాంతం, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇలాకా అయిన చిలకలూరిపేట నియోజకవర్గం, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో రేషన్ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా 310 రేషన్ డీలర్ల ఖాళీలున్నాయి. ఆ స్థానాల్లో డ్వాక్రా మహిళలను తాత్కాలికంగా నియమించుకొని, అధికార పార్టీ నేతలే పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇందులో గుంటూరు డివిజన్లో 26, తెనాలి డివిజన్లో 36, నరసరావుపేట డివిజన్లో 238, గురజాల :10 రేషన్ షాపులకు సంబంధించి డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాశ్వతంగా డీలర్ల పోస్టుల భర్తీని అధికార పార్టీ నేతలు అడ్డుకుంటూ ఉండటంతో, అధికారులు సైతం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రధానంగా రేషన్ బియ్యం రోజు జిల్లాలో ఎక్కడోచోట పట్టుబడుతూనే ఉన్నాయి. చిలకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో రేషన్ మాఫియా భారీగా డంప్‌లు ఏర్పాటు చేసుకొని ఇతర రాష్ట్రాలతో పాటు, కృష్ణపట్నం, కాకినాడ ఓడరేపుల ద్వారా భారీగా తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇందులో భాగస్వాములు కావడంతో, అధికారులు సైతం ఏమీ చేయలేక చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి నెలకొంది. మాచర్ల నిమోజకవర్గంలో సోమవారం 400 అనధికార రేషన్ బియ్యం బస్తాలను సీజ్ చేయడం గమనార్హం. చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడుకు చెందిన ఓ అధికార పార్టీ నేత మానుకొండువారిపాలెంలో రైస్‌మిల్లును అద్దెకు తీసుకుని దాన్నే గోడౌన్‌గా మార్చి రేషన్ బియ్యాన్ని నిలువ చేస్తున్నట్టు ఇటీవల అధికారుల దాడుల్లో కనుగొన్నారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం రొంపిచర్ల, మాచవరం, నకరికల్లు, ముప్పాళ, ఈపూరు మండలాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో ç179 రేషన్ దుకాణాల్లో పలు అవకతవలు జరిగినట్టు గుర్తించారు. పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ సైతం ఈఏడాది ఫిబ్రవరి నెలలో గుంటూరులో జరిగిన వర్క్‌షాపులో రేషన్ వ్యవస్థ గాడి తప్పిందని, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీ డీలర్ల స్థానంలో వెంటనే డీలర్లలను నియమించాలని ఆదేశించారు. సామాజిక తనిఖీల్లో భాగంగా ఈపూరు మండలంలో 7, రొంపిచర్ల 22, నకరికల్లు 12, ముప్పాళ్ల 8, మాచవరం మండలంలో 22, షాపుల్లో ఈ–పాస్‌లో ఉన్న డీలర్ పేరుతో కాకుండా బినామీ వ్యక్తులు షాపులను నడుపుతున్నట్టు నిర్ధారించారు. ప్రధానంగా వీరు ప్రజలకు బియ్యం ఇవ్వకుండా స్వాహా చేస్తున్నట్లు గుర్తించారు.తూకాల్లో తేడాలు, చనిపోయిన వారి బియ్యం, వలసలు వెళ్లిన వారి పేర్లతో రేషన్ బియ్యం కాజేస్తున్నట్లు తేలింది. పల్నాడు మొత్తం ఇదే తీరు. బియ్యం పట్టుబడుతున్నా...ఆగని దందా ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెల వరకు పౌరసరఫరాల శాఖ అధికారులు బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి 221 కేసులు నమోదు చేశారు. రూ.2,26,89,056 విలువైన బియ్యాన్ని సీజ్ చేశారు. 22 వాహనాలను సీజ్ చేశారు. డిసెంబరులోనే అనధికారికంగా నిల్వ ఉంచిన 1000 టన్నులకు పైగా బియ్యాన్ని పట్టుకొని 13 కేసులు నమోదు చేశారు. ఇందులో కొంతమందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేస్తున్న వినుకొండ పట్టణంలోని రెండు రైస్ మిల్లులు, శావల్యాçపురంలో ఒకటి, సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొమెర్లపూడిలో ఒక రైస్ మిల్లులపై దాడులు చేసి పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. ఓ వైపు దాడులు చేస్తున్నా, రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగటం లేదు. నిఘా పెంచాం... జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వీలుగా నిఘా పెంచాం. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అనధికారికంగా నిల్వ చేసిన బియ్యాన్ని సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లాలో శాశ్వత ప్రాతిపదికన డీలర్ల పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశాం. ఈ నెలాఖరుకు 150 డీలర్ పోస్టులు భర్తీ చేసేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకొంటున్నాం. అనధికారికంగా రేషన్ బియ్యం నిల్వ చేస్తున్న రైస్ మిల్లులు, డంప్‌లపై దృష్టి సారించి, దాడులు చేస్తున్నాం.రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. టి.శివరాం ప్రసాద్,డీఎస్ఓ, గుంటూరు. -
నల్లబజారుకు రేషన్‌బియ్యం
రేషన్‌బియ్యం మాఫియా పెచ్చరిల్లుతోంది. అందినంత చౌకబియ్యాన్ని రూటు మార్చి, బియ్యం రూపు మార్చి నల్లబజారుకు తరలించి సొమ్ముచేసుకుంటోంది. అధికార పార్టీ నేతల అండదండలతో అధికారుల హెచ్చరికలను పెడచెవినపెట్టి తమ దందా కొనసాగిస్తోంది. నరసరావుపేటటౌన్: అధికారులు ఓవైపు హెచ్చరిస్తున్నా రేషన్ మాఫియా ఆగడాలను ఆపడం లేదు. పేదలకు పంచాల్సిన బియ్యాన్ని యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ ఆలస్యంగా మేల్కొన్న అధికార యంత్రాంగం అక్రమ బియ్యం రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అక్రమార్కులకు అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతినెలా వేల క్వింటాళ్ల కొద్దీ ప్రజాపంపిణీ బియ్యాన్ని మాఫియా రూటుమార్చి...రూపుమార్చి పక్కదారి పట్టిస్తూనే ఉంది. వివరాల్లో కెళితే...డివిజన్ కేంద్రమైన నరసరావుపేట మండల పరిధిలో ఉన్న 115 చౌకదుకాణాల ద్వారా 49వేల మంది కార్డుదారులకు 757మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా పంపిణీ చేయాల్సి ఉంది. అందులో కార్డుదారులకు నామమాత్రంగా పంపిణీ చేసి మిగిలిన బియ్యాన్ని డీలర్లు నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. ఈతంతు ఒక్క నరసరావుపేటలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. తెలుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు ఉన్న రేషన్ డీలర్లను అకారణంగా తొలగించి వారి స్థానాల్లో పార్టీ ద్వితియశ్రేణి నాయకులను నియమించారు. దీంతో రేషన్ అక్రమాలపై అనేక ఫిర్యాదులు వచ్చినా పౌరసరఫరాల, రెవెన్యూ శాఖల అధికారులు రేషన్‌షాపుల వైపు నామమాత్రపు తనిఖీలు కూడా చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది డీలర్లు ప్రతినెలా కార్డుదారుల నుంచి వేలిముద్రలు వేయించుకొని బియ్యం ఇవ్వకుండా నగదు ఇస్తున్నారు. బియ్యం పంపిణీ చేయాలని కోరినప్పటికీ వచ్చేనెల తీసుకోండి అంటూ ప్రతినెలా అదేమాట చెప్పి రేషన్ బియ్యాన్ని భోంచేస్తున్నారు. పర్యవేక్షణ లేమి... ప్రతినెలా కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి చౌకదుకాణాలకు వేలాది క్వింటాళ్ల బియ్యం దిగుమతి అవుతుంది. గతంలో రూట్ అ«ధికారైన ఆర్ఐ పర్యవేక్షణలో బియ్యం దిగుమతి జరిగేది. ప్రజాపంపిణీ బియ్యం రవాణా వాహనానికి జీపీఆర్ఎస్ సిస్టం అమర్చడంతో రూట్ అధికారులను తొలగించారు. దీంతో రేషన్ షాపుల వద్ద బియ్యం దిగుమతి సమయంలోనే అక్రమార్కులు సంచులు మార్చి నల్లబజారుకు తరలిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. దీంతోపాటు ప్రజాపంపిణీ సక్రమంగా జరుగుతుందా లే దా అనే అంశాన్ని అధికారులు విస్మరించారు. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించకపోవడంతో గంటల కొద్ది వేచిఉన్న కార్డుదారులు అసహనంతో వెనుదిరిగి పోవడం పరిపాటిగా మారింది. రేషన్‌సరుకుల కోసం కాళ్ళరిగేలా తిరగలేక డీలరిచ్చినంత పుచ్చుకుంటున్నారు కార్డు దారులు. ఇలా సేకరించిన బియ్యాన్ని సంచులు మార్చి బియ్యం మాఫియా రాష్ట్రాలను దాటిస్తుంది. ప్రతినెలా డీలర్ల నుంచి రెవెన్యూ, పోలీస్‌శాఖ మామూళ్ళు తీసుకుంటూ నిద్రావస్థలో నటిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామాజిక బృందం తనిఖీతో వెలుగు చూసిన అక్రమాలు... సామాజిక తనిఖి బృందం గతేడాది అక్టోబర్ నెలలో నకరికల్లు, రొంపిచర్ల, ఈపూరు మండలాల్లోని చౌకదుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. 107చౌకదుకాణాల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా ఇటీవల ఆర్డీవో గంధం రవీందర్ 87రేషన్ డీలర్లను తొలగించారు. బియ్యం అక్రమ రవాణాను నివారించేందుకు పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులను కలిపి జేఏసీగా ఏర్పాటు చేశారు. దీంతోపాటుగా బియ్యం అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి పర్యవేక్షణకు ఏఎస్‌వోను అధికారిగా నియమించారు. మొదటివిడత నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గంలో పలు మండలాలను పైలెట్ మండలాలుగా గుర్తించారు. జేఏసీ బృందం ప్రతిరోజు చౌకదుకాణాలను తనిఖీ చేసి అక్రమాలకు పాల్పడిన డీలర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. అక్రమ రవాణాను జేఏసీ అరికట్టేనా? ఆర్డీఓ గంధం రవీందర్ బియ్యం అక్రమ రవాణాపై జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేసిన రెండో రోజే రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెంలోని ఓ చౌకదుకాణంలో 41క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యం దుర్వినియోగం అయింది. దీంతోపాటు గత 20రోజుల క్రితం ప్రకాష్‌నగర్, సత్తెనపల్లి రోడ్డు రెండు ప్రాంతాల్లో రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారి అధికారపార్టీ కౌన్సిలర్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఏంజల్ టాకీస్ ప్రాంతంలోని ఓ చౌకదుకాణ డీలరు రేషన్ బియ్యాన్ని రాత్రిపూట అక్రమంగా తరలిస్తున్నాడు. సమాచారం అందుకుని పోలీసులు అక్కడికి చేరుకునే సరికి బియ్యంలోడు ఆటో వెళ్ళిపోయింది. అధికారులు హెచ్చరిస్తున్నా...నివారణకు చర్యలు చేపడుతున్నా...బియ్యం మాఫియా మాత్రం తన ఆగడాలను ఆపడం లేదు. ఉన్నతస్థాయి అధికారులు దృష్టిసారిస్తే గానీ బియ్యం మాఫియా నియంత్రణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. -
రేషన్ మాఫియాపై సీఎం యోగి కన్నెర్ర
అధికారం చేపట్టినప్పటి నుంచి వరుసగా ఒక్కో విషయంపై తనదైన మార్కు చూపిస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తాజాగా రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగారాలపై తనకు ఓ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేదలకు తప్పనిసరిగా రేషన్ కార్డులు ఇవ్వాలని, అదేసమయంలో ఆహార ధాన్యాలు, రేషన్ సరుకులను నల్లబజారుకు తరలిస్తున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయాలపై తగిన ప్రచారం చేయడంతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని గోరఖ్‌పూర్, బస్తీ డివిజన్ల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సూచించారు. ప్రభుత్వ పథకాలు అసవరంలో ఉన్నవాళ్లకు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు. మైనింగ్, అటవీ, పశువుల మాఫియా విషయంలో కూడా గట్టిగా ఉండాలని చెప్పారు. చెరుకు రైతుల బకాయిలను 15 రోజుల్లోగా చెల్లించాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు. తదుపరి చెరుకు సీజన్‌కు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. డీనోటిఫైడ్ గిరిజన తెగలను గుర్తించాలని, అలాగే గిరిజనులు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటున్నారో లేదో తేల్చేందుకు ఓ సర్వే చేయాలని సూచించారు. సర్వే తర్వాత వన్ తంగియా, ముసాహర్ తెగలవాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించి అక్కడ విద్య, ఆరోగ్యం, తాగునీరు, రోడ్లు, ఇళ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించి ప్రభుత్వ రేషన్ దుకాణాలను తెరవాలని చెప్పారు. నేరచరిత్ర లేనివారికి మాత్రమే నిర్మాణ పనుల కాంట్రాక్టులు ఇవ్వాలని సీఎం గట్టిగా స్పష్టం చేశారు. నేరస్తులు ఏవైనా ఒత్తిళ్లు తెస్తే, ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీల దృష్టికి తెచ్చి వాళ్లపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేయాలన్నారు. -
సిండికేట్‌గా రేషన్ మాఫియా
రేషన్ బియ్యం అక్రమంగా తరలించి అమ్ముకోవడం కొత్తేమీ కాదు.. ఏళ్ల తరబడి కొనసాగుతున్నదే.. రెండేళ్ల కిందటి వరకు ఇలా పేదల బియ్యాన్ని బొక్కే దొంగలంతా విడివిడిగా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకుడొకరు వీరినందరినీ ఒక తాటిపైకి తెచ్చాడు. ఆ విధంగా రేషన్ డీలర్ల మాఫియా తయారైంది. అధికారులు వారికి జీ హుజూర్ అంటున్నారు. ఇక రేషన్ దోపిడీ పట్టపగ్గాలు లేకుండా సాగుతోంది. మాచర్ల: నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయకుండానే డీలర్లు సిండికేట్‌గా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నాయకులకు అమ్మేస్తున్నారు. తాజాగా శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న 52 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎస్ఐ రామాంజనేయలు స్వాధీనపర్చుకుని కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పీఆర్కే బియ్యం లారీని పట్టించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వారం రోజులు గడవకముందే మరోసారి రేషన్ బియ్యం దొరికాయి. దీనినిబట్టి అధికార పార్టీకి చెందిన నాయకుల అక్రమ వ్యాపారం ఎలా సాగుతోందో అర్థమవుతోంది. దందా నడిపిస్తున్న నామినేటెడ్ నాయకుడు.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ వర్గాలుగా వున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులందరినీ తన కనుసన్నలలో ఉంచుకుని ఓ నామినేటెడ్ నాయకుడు దందాను నడిపిస్తున్నాడు. ఈ విషయంపై ఎమ్మెల్యే పీఆర్కే పలుమార్లు ఆరోపణలు కూడా చేశారు. వారం కిందట దుర్గి మండలంలోని అడిగొప్పల ప్రాంతంలో 420 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనపర్చుకుని పోలీసులకు పట్టించారు. అయినప్పటికీ పోలీసులు అధికార పార్టీ నాయకుల వత్తిళ్లకు తలొగ్గి దొరికిన డ్రైవర్‌పైనే కేసులు నమోదు చేసి అసలు సూత్రధారులను గాలికొదిలేశారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే పీఆర్కే అక్రమ రేషన్ బియ్యం లారీని పట్టుకున్న సమయంలో దొరికిన ఐదుగురు మినహా మిగతా వారు ఎవరనేది పోలీసులు తేల్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. దుర్గి మండలంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరి పేర్లను నమోదు చేశామని చెబుతున్నా, వారిని అరెస్టు చేశారా లే దా అనే విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా శుక్రవారం మాచర్ల శివారులో గుంటూరు రోడ్డులోని రాయవరం జంక్షన్ వద్ద 52 బస్తాల బియ్యాన్ని స్వాధీన పర్చుకున్నారు. ఈసారీ డ్రైవర్ ఒక్కడిపైనే కేసు నమోదు చేశారు. అసలు నిందితులను తేల్చకుండా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. పథకం ప్రకారం డంపింగ్.. అధికార పార్టీ నాయకులు ముందుగా వివిధ మండలాల నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకువచ్చి ఒక చోట డంప్ చేస్తారు. అక్కడ నుంచి వివిధ చోట్లకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఈ కార్యక్రమం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరుగుతుంటుంది. పోలీసు పెట్రోలింగ్ చేసే సమయంలోనే లోడ్లను తీసుకెళ్తున్నా పోలీసులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా రూరల్ æపరిధిలోని ఓ పోలీసు అ«ధికారి అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు బియ్యం పట్టుకున్న ప్రతిసారీ దొరికిన వారిపై కేసులు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. కీలక సూత్రధారులపై చర్యలు తీసుకోవడం లేదు. -
ఊరికే ఇచ్చారా మంత్రిపదవి...!
మంత్రి పదవి నుంచి పీకేస్తారా? ఉత్తి పుణ్యానికే మంత్రి పదవి ఇచ్చారనుకుంటున్నారా? తీసివేయడానికి...! అమాత్య పోస్టుకు రూ.కోట్లు కాసులు కురిపించాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాధ్యతలన్నీ భుజాలపై మోశాం. పీకేసీ చూడమనండి...!! అంటూ ఓ మంత్రిగారి భార్య చిందులేశారు. అన్నీ తానై చక్రం తిప్పే సదరు మంత్రి గారి భార్య తమ అనుచరవర్గానికి చెప్పిన ధైర్యవచనాలివి. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే వార్తల నేపధ్యంలో ఓ అమాత్యుడికి పదవీ గండంపై రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. సదరు మంత్రి గారు తన సతీమణి వ్యవహార శైలితో తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. అన్ని వ్యవహారాల్లో ‘ఆమె’ జోక్యం ఎక్కువ కావడంతో అమాత్యుడికి చిక్కులు తప్పడం లేదు. రేషన్ మాఫియా నుంచి వివాదాస్పద భూములు కొనుగోలు వరకు అన్నింటిలో తలదూర్చి షాడో మంత్రిగా ‘ఆమె’ చక్రం తిప్పుతున్నారు. కొంత కాలం మంత్రి గారు ఆమెను హైదరాబాద్‌కు పరిమితం చేసి కట్టడి చేశారు. కానీ మళ్లీ ఇటీవల ఆమె అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇటీవలే జిల్లాలో ఓ ఉన్నతాధికారికి మంత్రిగారి సతీమణి ఓ పని అప్పగించి చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఆ పని సదరు ఉన్నతాధికారి చేయకపోవడంతో అగ్గి మీద గుగ్గిలమైన మంత్రి గారి భార్య ఉన్నతాధికారిని తిట్ల దండకంతో ఫోన్లో హోరెత్తించారు. ఈ దండకాన్ని ఫోన్లో రికార్డు చేసిన సదరు ఉన్నతాధికారి సీఎం వద్ద పంచాయతీ పెట్టారు. సీఎం తనదైన శైలిలో మంత్రికి క్లాస్ పీకారు. కట్టడి చేయకుంటే... ఊస్టింగ్ తప్పదని సీఎం హెచ్చరికలు జారీ చేశారట. సీఎం హెచ్చరికల్ని తన భార్యకు వివరించిన మంత్రి గారికి సతీమణి చేసిన వ్యాఖ్యలతో ఊరట దక్కిందని టీడీపీలో అంతర్గత ప్రచారం జరుగుతోంది. ఊరికే మంత్రి పోస్టు ఇవ్వలేదన్న సంగతి తెలియదా...! ఆరోజు రేటు ‘40 సీ’ తగ్గకుండా తీసుకున్నప్పుడు తెలియదా..? అంటూ ఏం ఫరవా లేదని మంత్రిగారికి ధైర్యవచనాలు చెప్పారని పార్టీలో గుసగుసలు గుప్పుమంటున్నాయి. -
హద్దులు దాటిన రేషన్ దందా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 11.60 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. ఇందులో 5.61లక్షలు గ్రామీణ ప్రాంతాల్లోవి కాగా, 5.98 లక్షలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవి. వీరికి నెలకు 27,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పీడీఎస్ రూపంలో సరఫరా చేస్తున్నారు. వీటిని జిల్లా వ్యాప్తంగా 1,836 రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నారు. జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉండడం.. మరోవైపు రేషన్ కోటా సైతం పెద్ద మొత్తంలో ఉండడం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కార్డుల సంఖ్య సమనిష్పత్తిలో ఉండడంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. లబ్ధిదారులకు సరుకులు చేరే తీరుపై నిఘా కొరవడిన నేపథ్యంలో డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నెలవారీగా వచ్చే రేషన్ కోటాను దుకాణాలకు కాకుండా నేరుగా బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వేల టన్నుల బియ్యం దారిమళ్లిస్తున్నట్లు తాజా ఉదంతం బహిర్గతం చేసింది. బ్లాక్ మార్కెట్లోకి.. జిల్లాలో రేషన్ సరఫరాలో అక్రమాలు కొత్తేమీ కాదు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 150కిపైగా బియ్యం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో సరుకు మొత్తం పదుల క్వింటాళ్లలోనే గుర్తించారు. ఈ అక్రమాల తంతు పెద్దమొత్తంలో జరుగుతున్నట్లు గురువారం సైబరాబాద్ పోలీసు విభాగం పేర్కొంది. జిల్లాలో నెలకు 27,500 మెట్రిక్ టన్నుల బియ్యం పీడీఎస్ పద్ధతిలో పంపిణీ చేస్తున్నారు. ఇందులో కనిష్టంగా 10 శాతం బియ్యం లబ్ధిదారులకు కాకుండా ప్రైవేటు మార్కెట్లో అక్రమంగా విక్రయిస్తున్నట్లు తాజా ఘటనతో స్పష్టమవుతోంది. ఈ క్రమంలో యేటా 15వేల మెట్రిక్ టన్నుల బియ్యం దారిమళ్లుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏడాదిలో జిల్లా కేటాయించే బియ్యం కోటాలో నెల కోటా అక్రమార్కుల పాలవుతున్నట్లు సమాచారం.