ఊరికే ఇచ్చారా మంత్రిపదవి...!
మంత్రి పదవి నుంచి పీకేస్తారా? ఉత్తి పుణ్యానికే మంత్రి పదవి ఇచ్చారనుకుంటున్నారా? తీసివేయడానికి...! అమాత్య పోస్టుకు రూ.కోట్లు కాసులు కురిపించాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాధ్యతలన్నీ భుజాలపై మోశాం. పీకేసీ చూడమనండి...!! అంటూ ఓ మంత్రిగారి భార్య చిందులేశారు. అన్నీ తానై చక్రం తిప్పే సదరు మంత్రి గారి భార్య తమ అనుచరవర్గానికి చెప్పిన ధైర్యవచనాలివి. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే వార్తల నేపధ్యంలో ఓ అమాత్యుడికి పదవీ గండంపై రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. సదరు మంత్రి గారు తన సతీమణి వ్యవహార శైలితో తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. అన్ని వ్యవహారాల్లో ‘ఆమె’ జోక్యం ఎక్కువ కావడంతో అమాత్యుడికి చిక్కులు తప్పడం లేదు. రేషన్ మాఫియా నుంచి వివాదాస్పద భూములు కొనుగోలు వరకు అన్నింటిలో తలదూర్చి షాడో మంత్రిగా ‘ఆమె’ చక్రం తిప్పుతున్నారు.
కొంత కాలం మంత్రి గారు ఆమెను హైదరాబాద్‌కు పరిమితం చేసి కట్టడి చేశారు. కానీ మళ్లీ ఇటీవల ఆమె అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇటీవలే జిల్లాలో ఓ ఉన్నతాధికారికి మంత్రిగారి సతీమణి ఓ పని అప్పగించి చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఆ పని సదరు ఉన్నతాధికారి చేయకపోవడంతో అగ్గి మీద గుగ్గిలమైన మంత్రి గారి భార్య ఉన్నతాధికారిని తిట్ల దండకంతో ఫోన్‌లో హోరెత్తించారు. ఈ దండకాన్ని ఫోన్‌లో రికార్డు చేసిన సదరు ఉన్నతాధికారి సీఎం వద్ద పంచాయతీ పెట్టారు. సీఎం తనదైన శైలిలో మంత్రికి క్లాస్ పీకారు. కట్టడి చేయకుంటే... ఊస్టింగ్ తప్పదని సీఎం హెచ్చరికలు జారీ చేశారట. సీఎం హెచ్చరికల్ని తన భార్యకు వివరించిన మంత్రి గారికి సతీమణి చేసిన వ్యాఖ్యలతో ఊరట దక్కిందని టీడీపీలో అంతర్గత ప్రచారం జరుగుతోంది. ఊరికే మంత్రి పోస్టు ఇవ్వలేదన్న సంగతి తెలియదా...! ఆరోజు రేటు ‘40 సీ’ తగ్గకుండా తీసుకున్నప్పుడు తెలియదా..? అంటూ ఏం ఫరవా లేదని మంత్రిగారికి ధైర్యవచనాలు చెప్పారని పార్టీలో గుసగుసలు గుప్పుమంటున్నాయి.