![No cabinet expansion in near future: CM Revanth Reddy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/CHAIR-1.jpg.webp?itok=6C2PQISe)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రి పదవుల(Ministerial post) ఆశావహులకు కాంగ్రెస్(Congress) అధిష్టానం షాకిచ్చింది. రాష్ట్ర పార్టీ పెద్దలంతా ఢిల్లీ వెళ్లారని, ఈసారి కేబినెట్ బె ర్తులు ఖరారై త్వరలోనే మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేస్తామనుకున్నవారి ఆశలపై నీళ్లు చల్లింది. కేబినెట్ విస్తరణ(Cabinet expansion) ఇప్పుడప్పుడే అవసరం లేదని తేల్చేసింది. ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంకం ఎప్పటికో తెలియని సమయానికి వా యిదా పడింది. సీఎం రేవంత్(revanth reddy) స్వయంగా ఈ విష యం ప్రకటించడంతో మంత్రి పదవి రేసులో ఉన్న ఎమ్మెల్యేలు నిరాశలో మునిగిపోవాల్సి వచ్చింది.
అదిగో ఇదిగో అంటూనే..
రాష్ట్ర కేబినెట్‌లో ప్రస్తుతం సీఎంతోపాటు మరో 11 మంది మంత్రులు కలిపి మొత్తం 12 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో ఆరుగురిని మంత్రులుగా నియమించే అవకాశం ఉంది. 2023 డిసెంబర్ 7న సీఎం, 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచీ మిగిలిన ఆరు బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. వీటిని భర్తీ చేసే అంశంపై తరచూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఆ పండుగ, ఈ పండుగ, ఆ ఎన్నికలు, ఈ ఎన్నికల తర్వాత అంటూ కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూనే వచ్చింది.
సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా కూర్పు కుదరడం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికలతో కూడా ఈ అంశం ముడిపడి ఉన్నందున ముహూర్తం కుదరడం లేదనే చర్చ జరిగింది. అయితే ఈసారి పార్టీ అధిష్టానం తెలంగాణ పార్టీ పెద్దలను ఢిల్లీకి పిలిపించడంతో.. మంత్రివర్గ విస్తరణతోపాటు పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ వంటివి కొలిక్కి వస్తాయని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆశించారు.
కార్యవర్గానికి లైన్ క్లియర్..
రాష్ట్ర నేతల ఢిల్లీ పర్యటనలో కొలిక్కి వచ్చిన ఏకైక అంశం టీపీసీసీ కార్యవర్గ కూర్పు మాత్రమే. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు తీసుకుని నాలుగు నెలలు దాటింది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ పార్టీ సంస్థాగత పదవులు ఖాళీగా ఉండటాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు 15 రోజుల్లో పార్టీ పదవులను భర్తీ చేయాలని స్పష్టం చేశారు.
దీనితో వేగంగా కసరత్తు చేపట్టి ఓ కొలిక్కి తేవడంతో.. టీపీసీసీ కార్యవర్గ కూర్పునకు అధిష్టానం ఆమోదం తెలిపింది. ఒకట్రెండు రోజుల్లోనే టీపీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. పీసీసీ కార్యవర్గంలోనూ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు చాలా డిమాండ్ ఉందని.. దీనితో 25కు చేరిందని తెలిసింది. పార్టీ కోశాధికారి, ప్రచార కమిటీ చైర్మన్ పోస్టులను కూడా ఈసారి భర్తీ చేయనున్నట్టు సమాచారం. కొన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులను కూడా మార్చే అవకాశం ఉందని సమాచారం.
కార్పొరేషన్ పదవులకు ‘కోడ్’ తిప్పలు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల అంశం కూడా ఈసారి తేలిపోతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశించాయి. చాలా మంది నేతలు ఆ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటికే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, త్వరలోనే రానున్న స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా ప్రస్తుతానికి వీటిని కూడా వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతానికి పార్టీ పదవులు.. స్థానిక ఎన్నికలు ముగిశాకే అధికారిక పదవులు దక్కనున్నాయి.
నాలుగు జిల్లాలు.. నాలుగు సామాజిక వర్గాలు
ప్రస్తుత కేబినెట్ కూర్పును పరిశీలిస్తే... రాష్ట్రంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఏ ఒక్కరికీ మంత్రివర్గంలో చాన్స్ దక్కలేదు. దీంతో ఈ నాలుగు జిల్లాల నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు వస్తాయనే ఆశలో ఉన్నారు. రేసులో ప్రేమ్‌సాగర్‌రావు, జి.వివేక్, వినోద్, పి.సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, దానం నాగేందర్‌ల పేర్లు వినిపించాయి.
ఇప్పటికే కేబినెట్‌లో స్థానమున్న జిల్లాల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, వాకిటి శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఈర్లపల్లి శంకర్ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్ కూడా కేబినెట్ రేసులోకి వచ్చారు. పేర్ల మాట ఎలా ఉన్నా ఈసారి నాలుగు బెర్తులు తప్పకుండా భర్తీ అవుతాయని.. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు చాన్స్ ఉంటుందనే చర్చ జరిగింది. కానీ కేబినెట్ విస్తరణ లేదని అధిష్టానం తేల్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment