తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో చెప్పిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల నాలుగో తేదీన మరి కొంత మందిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని సమాచారం.
మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు మరోసారి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు.
కాగా, అధిష్టానం ఇచ్చిన సమయాన్ని బట్టి మంగళవారం లేదా బుధవారం వారు హస్తిన చేరుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తుది జాబితాకు ఆమోదముద్ర వేస్తారని, తుది దఫా చర్చల్లో భాగంగా ఇప్పటివరకు స్పష్టత రాని ఒకట్రెండు బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
ఇదిలా ఉండగా.. మంత్రి వర్గంలోకి మరో ఆరుగురికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు బీసీ, ఒక మైనార్టీ, ఇద్దరు ఓసీ, ఒక ఎస్టీకి కేబినెట్‌లో ఛాన్స్ దక్కనున్నట్టు సమాచారం. మరోవైపు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలకు కీలక పదవులు ఇస్తారనే టాక్ నడుస్తోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం.
అలాగే, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇక, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకే పదవులు ఇస్తున్నారనే చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment