నేడు సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు
కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై హైకమాండ్‌తో చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి హస్తినకు చేరుకున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి శనివారం జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. కోడ్ ముగిసినందున కేబినెట్ విస్తరణతోపాటు నామినేటెడ్ పదవుల కేటాయింపునకు సంబంధించిన అంశాలపై పార్టీ హైకమాండ్‌తో చర్చించే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు తెలిపాయి.
ఇటీవలి లోక్‌సభ ఫలితాల్లో ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసి అభినందించనున్నారు. 2019లో తెలంగాణలో కేవలం మూడు లోక్‌సభ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ , తాజా ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితి గురించి రాహుల్ సహా పార్టీ పెద్దలకు రేవంత్‌రెడ్డి వివరించే అవకాశాలున్నాయి. రేవంత్ ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవితో పాటు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
దీంతో రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పూర్తిస్థాయి నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించే అంశంపైనా హైకమాండ్‌తో చర్చించే అవకాశముందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాగా శనివారం ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, సీడబ్ల్యూసీ సభ్యురాలు దీపాదాస్ మున్షీ, శాశ్వత ఆహ్వానితుడు, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ఆహ్వానితుడు, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డిలు హాజరు కానున్నారు.
ప్రజలకు సీఎం మృగశిర కార్తె శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా...రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలకరి జల్లుల పలకరింపుతో పుడమి పులకరించిందని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలని, అన్నదాతల ఇంట సిరులు పండాలని కోరుకుంటున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment