స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పట్టు దిశగా రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు!
అన్ని సామాజిక వర్గాలు, ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా సీఎం రేవంత్ ఉండేలా కసరత్తు
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కనున్న బెర్తులు.. రెడ్డి, వెలమలకూ చాన్స్
దీనితో ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరిని తొలగించవచ్చనే చర్చ
నేడు అధిష్టానంతో చర్చించనున్న రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుచేర్పులకు రంగం సిద్ధమవుతోంది. కీలక ఎన్నికలన్నీ ముగియడం, కేబినెట్‌లో బెర్తులు ఖాళీ ఉండటం నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా.. అన్ని జిల్లాలు, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు నాటికి విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం సీఎం రేవంత్ సహా 12 మంది మంత్రులు ఉన్నారు.
మరో ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు వీలుంది. ఈ మేరకు కేబినెట్ కూర్పుపై సీఎం రేవంత్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతమున్న మంత్రుల్లో ఒకరిద్దరిని తొలగించవచ్చనే చర్చ జరుగుతోంది. దీనికితోడు ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న పలు కీలక శాఖలను పంపిణీ చేసే క్రమంలో.. కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారమే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది.
పాలన, పట్టు.. రెండింటిపై ఫోకస్‌తో..
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక 12 మంది మంత్రులతోనే పరిపాలన కొనసాగుతోంది. కొన్ని కీలక శాఖలు ఇంకా సీఎం రేవంత్ వద్దనే ఉన్నాయి. గత ఐదు నెలల్లో మూడు నెలల పాటే పాలన సజావుగా సాగింది. రెండు నెలలకుపైగా ఎన్నికల కోడ్‌తోనే గడిచిపోయింది. పాలన విషయంలో పలు రకాల సమస్యలు అటు సీఎం, ఇటు కేబినెట్ దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణతో త్వరలో పూర్తిస్థాయి పరిపాలన మొద లుపెట్టాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం కీలక ఎన్నికలన్నీ ముగిశాయి.
లోక్‌సభతోపాటు పలు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలకు, తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాలి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. కొన్ని ఉమ్మడి జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ ‘స్థానిక’ ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. పలు సామాజిక వర్గాలకు కేబినెట్లో స్థానం లేకపోవడం కూడా ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చని నేతలు అంటున్నారు. కేబినెట్ విస్తరణతో ఈ ఇబ్బందులు తీరుతాయని పేర్కొంటున్నారు.
కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి!
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొందరు మంత్రుల పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉందన్న చర్చ జరుగుతోంది. కొందరు మంత్రులు ఇన్‌చార్జులుగా ఉన్న నియోజకవర్గాల్లో సరిగా పనిచేయకపోవడం, చాలా మంది మంత్రుల నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ ఓట్లు రావడం వంటి అంశాలు నివేదికల రూపంలో అధిష్టానానికి చేరినట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో స్వల్పంగా ఓట్లు తక్కువగా వచ్చినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన తీరు, రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తడంపై అధిష్టానం మన్ననలు పొందినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
అధిష్టానంతో చర్చించనున్న సీఎం!
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. శనివారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు విందు ఇస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పార్టీ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉందని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర రాజకీయాల హడావుడి ముగిసిన తర్వాత ఆగస్టు నాటికి కేబినెట్ విస్తరణ జరగవచ్చని అంటున్నాయి.
‘చాన్స్’పై సామాజిక వర్గం, జిల్లాలవారీ లెక్కలు!
రాష్ట్ర కేబినెట్ నుంచి ఒకరిద్దరికి ఉద్వాసన ఉండవచ్చన్న ప్రచారం జరుగుతున్నా టీపీసీసీ నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. మంత్రులుగా నియామకమై చాలా తక్కువ సమయమే కావడంతో ఎవరి పనితీరు ఏమిటనేది అంచనా వేయడం సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. కానీ ఒకరిద్దరు మంత్రుల వ్యవహారశైలిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయన్న ప్రచారమూ ఉంది. మరోవైపు మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరు వస్తారన్న దానిపై మాత్రం ఆసక్తి నెలకొంది. కేబినెట్ ప్రస్తుత కూర్పును బట్టి.. కొన్ని ఉమ్మడి జిల్లాలు, కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం కలి్పంచాల్సి ఉంది. అందులో ఎస్సీ (మాదిగ), ఎస్టీ (లంబాడా), బీసీ (ముదిరాజ్)లకు బెర్త్ ఖాయమని గాం«దీభవన్ వర్గాలు అంటున్నాయి.
⇒ పెద్ద బీసీ సామాజిక వర్గాల్లో ఒకటైన మున్నూరు కాపులకు కేబినెట్ చాన్స్ రాలేదు. కొండా సురేఖ ఉన్నా ఆమెను పద్మశాలి కోటాలోనే లెక్క వేస్తున్నారు. ఈ క్రమంలో మున్నూరుకాపులకు విస్తరణలో చాన్స్ ఉంటుందనే చర్చ జరుగుతోంది.
⇒ ఇక కేబినెట్‌లో ముదిరాజ్‌లకు అవకాశమిస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గానికి బెర్త్ దక్కే చాన్స్ ఉంది.
⇒ ఇతర వర్గాల విషయానికి వస్తే రెడ్డి ఎమ్మెల్యేల్లో ఒకరికి చాన్స్ ఉంటుందని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వకుంటే వెలమ వర్గాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. వెలమ కోటాలో ముగ్గురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి.
⇒ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కేబినెట్‌లో ఎవరికి స్థానం దక్కలేదు. ఇప్పటికే ఇక్కడ పార్టీ బలహీనంగా ఉండటం, రాష్ట్రానికి గుండెకాయ వంటి ప్రాంతానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం నష్టమన్న అంచనాలో పార్టీ ముఖ్యులు ఉన్నారు. దీనితో గ్రేటర్ హై దరాబాద్ పరిధి నుంచి ఒకరికి కేబినెట్ చాన్స్ రావొచ్చని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
⇒ కేబినెట్ కూర్పులో స్థానం దక్కని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కూడా ఈసారి ప్రాతినిధ్యం కల్పిస్తారని నేతలు
చెప్తున్నారు.
⇒ ఎవరికి చాన్స్ దక్కుతుందన్నదానిపై స్పష్టత లేకపోయినా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి లేదా వెలమ, జీహెచ్‌ఎంసీ, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల కోటా లెక్కల్లోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment