చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెంలోని రైస్‌మిల్లులో ఇటీవల పట్టుబడిన రేషన్ బియ్యం(ఫైల్)
సాక్షి, అమరావతి బ్యూరో: పల్నాడు ప్రాంతంలో రేషన్ మాఫియా రాజ్యమేలుతోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో చౌక దుకాణాలు నడుస్తున్నాయి. డ్వాక్రా గ్రూపు మహిళలను తాత్కాలిక డీలర్లుగా నియమించుకొని, రేషన్ దందా సాగిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2802 రేషన్ దుకాణా లున్నాయి. తెల్ల రేషన్ కార్డులు 14,89,722 ఉన్నాయి. వీటికి సంబంధించి 22,075 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో 30 శాతంకు పైగా రేషన్ బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ప్రధానంగా పల్నాడు ప్రాంతం, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇలాకా అయిన చిలకలూరిపేట నియోజకవర్గం, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో రేషన్ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా 310 రేషన్ డీలర్ల ఖాళీలున్నాయి.
ఆ స్థానాల్లో డ్వాక్రా మహిళలను తాత్కాలికంగా నియమించుకొని, అధికార పార్టీ నేతలే పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇందులో గుంటూరు డివిజన్‌లో 26, తెనాలి డివిజన్‌లో 36, నరసరావుపేట డివిజన్‌లో 238, గురజాల :10 రేషన్ షాపులకు సంబంధించి డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాశ్వతంగా డీలర్ల పోస్టుల భర్తీని అధికార పార్టీ నేతలు అడ్డుకుంటూ ఉండటంతో, అధికారులు సైతం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రధానంగా రేషన్ బియ్యం రోజు జిల్లాలో ఎక్కడోచోట పట్టుబడుతూనే ఉన్నాయి. చిలకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో రేషన్ మాఫియా భారీగా డంప్‌లు ఏర్పాటు చేసుకొని ఇతర రాష్ట్రాలతో పాటు, కృష్ణపట్నం, కాకినాడ ఓడరేపుల ద్వారా భారీగా తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇందులో భాగస్వాములు కావడంతో, అధికారులు సైతం ఏమీ చేయలేక చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి నెలకొంది. మాచర్ల నిమోజకవర్గంలో సోమవారం 400 అనధికార రేషన్ బియ్యం బస్తాలను సీజ్ చేయడం గమనార్హం. చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడుకు చెందిన ఓ అధికార పార్టీ నేత మానుకొండువారిపాలెంలో రైస్‌మిల్లును అద్దెకు తీసుకుని దాన్నే గోడౌన్‌గా మార్చి రేషన్ బియ్యాన్ని నిలువ చేస్తున్నట్టు ఇటీవల అధికారుల దాడుల్లో కనుగొన్నారు.
సామాజిక తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి
ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం రొంపిచర్ల, మాచవరం, నకరికల్లు, ముప్పాళ, ఈపూరు మండలాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో ç179 రేషన్ దుకాణాల్లో పలు అవకతవలు జరిగినట్టు గుర్తించారు. పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ సైతం ఈఏడాది ఫిబ్రవరి నెలలో గుంటూరులో జరిగిన వర్క్‌షాపులో రేషన్ వ్యవస్థ గాడి తప్పిందని, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీ డీలర్ల స్థానంలో వెంటనే డీలర్లలను నియమించాలని ఆదేశించారు. సామాజిక తనిఖీల్లో భాగంగా ఈపూరు మండలంలో 7, రొంపిచర్ల 22, నకరికల్లు 12, ముప్పాళ్ల 8, మాచవరం మండలంలో 22, షాపుల్లో ఈ–పాస్‌లో ఉన్న డీలర్ పేరుతో కాకుండా బినామీ వ్యక్తులు షాపులను నడుపుతున్నట్టు నిర్ధారించారు. ప్రధానంగా వీరు ప్రజలకు బియ్యం ఇవ్వకుండా స్వాహా చేస్తున్నట్లు గుర్తించారు.తూకాల్లో తేడాలు, చనిపోయిన వారి బియ్యం, వలసలు వెళ్లిన వారి పేర్లతో రేషన్ బియ్యం కాజేస్తున్నట్లు తేలింది. పల్నాడు మొత్తం ఇదే తీరు.
బియ్యం పట్టుబడుతున్నా...ఆగని దందా
ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెల వరకు పౌరసరఫరాల శాఖ అధికారులు బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి 221 కేసులు నమోదు చేశారు. రూ.2,26,89,056 విలువైన బియ్యాన్ని సీజ్ చేశారు. 22 వాహనాలను సీజ్ చేశారు. డిసెంబరులోనే అనధికారికంగా నిల్వ ఉంచిన 1000 టన్నులకు పైగా బియ్యాన్ని పట్టుకొని 13 కేసులు నమోదు చేశారు. ఇందులో కొంతమందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేస్తున్న వినుకొండ పట్టణంలోని రెండు రైస్ మిల్లులు, శావల్యాçపురంలో ఒకటి, సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొమెర్లపూడిలో ఒక రైస్ మిల్లులపై దాడులు చేసి పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. ఓ వైపు దాడులు చేస్తున్నా, రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగటం లేదు.
నిఘా పెంచాం...
జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వీలుగా నిఘా పెంచాం. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అనధికారికంగా నిల్వ చేసిన బియ్యాన్ని సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లాలో శాశ్వత ప్రాతిపదికన డీలర్ల పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌లు విడుదల చేశాం. ఈ నెలాఖరుకు 150 డీలర్ పోస్టులు భర్తీ చేసేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకొంటున్నాం. అనధికారికంగా రేషన్ బియ్యం నిల్వ చేస్తున్న రైస్ మిల్లులు, డంప్‌లపై దృష్టి సారించి, దాడులు చేస్తున్నాం.రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
టి.శివరాం ప్రసాద్,డీఎస్‌ఓ, గుంటూరు.
Comments
Please login to add a commentAdd a comment