హద్దులు దాటిన రేషన్ దందా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 11.60 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. ఇందులో 5.61లక్షలు గ్రామీణ ప్రాంతాల్లోవి కాగా, 5.98 లక్షలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవి. వీరికి నెలకు 27,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పీడీఎస్ రూపంలో సరఫరా చేస్తున్నారు. వీటిని జిల్లా వ్యాప్తంగా 1,836 రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నారు. జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉండడం.. మరోవైపు రేషన్ కోటా సైతం పెద్ద మొత్తంలో ఉండడం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కార్డుల సంఖ్య సమనిష్పత్తిలో ఉండడంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. లబ్ధిదారులకు సరుకులు చేరే తీరుపై నిఘా కొరవడిన నేపథ్యంలో డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నెలవారీగా వచ్చే రేషన్ కోటాను దుకాణాలకు కాకుండా నేరుగా బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వేల టన్నుల బియ్యం దారిమళ్లిస్తున్నట్లు తాజా ఉదంతం బహిర్గతం చేసింది.
బ్లాక్ మార్కెట్‌లోకి..
జిల్లాలో రేషన్ సరఫరాలో అక్రమాలు కొత్తేమీ కాదు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 150కిపైగా బియ్యం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో సరుకు మొత్తం పదుల క్వింటాళ్లలోనే గుర్తించారు. ఈ అక్రమాల తంతు పెద్దమొత్తంలో జరుగుతున్నట్లు గురువారం సైబరాబాద్ పోలీసు విభాగం పేర్కొంది. జిల్లాలో నెలకు 27,500 మెట్రిక్ టన్నుల బియ్యం పీడీఎస్ పద్ధతిలో పంపిణీ చేస్తున్నారు. ఇందులో కనిష్టంగా 10 శాతం బియ్యం లబ్ధిదారులకు కాకుండా ప్రైవేటు మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తున్నట్లు తాజా ఘటనతో స్పష్టమవుతోంది. ఈ క్రమంలో యేటా 15వేల మెట్రిక్ టన్నుల బియ్యం దారిమళ్లుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏడాదిలో జిల్లా కేటాయించే బియ్యం కోటాలో నెల కోటా అక్రమార్కుల పాలవుతున్నట్లు సమాచారం.