సాక్షి, ఏలూరు : ఈ ఏడాది వరుసగా విరుచుకుపడిన తుపాన్లు, అధిక వర్షాల వల్ల అన్నదాత కష్టాల పాలయ్యాడు. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని స్థితికి చేరారు. రబీ పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు. దిక్కుతోచని స్థితిలో కష్టాలు ఎదుర్కొం టున్న రైతులను ఆదుకోవాలని జిల్లా బ్యాంకర్లు నిర్ణయించారు. వచ్చే కొత్త ఏడాది కానుకగా తుపాను, వర్షాల బాధిత రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయాలని నిర్ణయించారు.
నవంబర్‌లో సంభవించిన హెలెన్ తుపాను, అధిక వర్షాలకు జిల్లాలో 2,46,250 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు తేల్చారు. దాదాపు 1.82 లక్షల మంది రైతులను బాధితులుగా గుర్తించారు. వీరంతా ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.443.25 కోట్ల రుణాలు బ్యాంకుల నుంచి పొందారు. బాధిత రైతులు తహసిల్దార్ నుంచి అణావారీ ధ్రువీకరణ పత్రం తీసుకుని బ్యాంకులకు సమర్పిస్తే పంట రీ షెడ్యూల్‌ను వర్తింపచేస్తారు.
మూడేళ్ల గడువు.. వడ్డీ రారుుతీకి మంగళం
ఏటా జిల్లాలో దాదాపు 2 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.80 వేల వరకూ రుణం పొందుతుంటారు. ఎకరాకు రూ.18 వేల చొప్పున తీసుకున్న రుణాలను ప్రస్తుతానికి తిరిగి చెల్లించనవసరం లేకుండా రీషెడ్యూల్ చేయనున్నారు. ఆ మొత్తాలను మూడేళ్లలోపు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలావుండగా, స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్పు చేయడం వల్ల రైతులు రాయితీలను కోల్పోతారు. పంట రుణంపై సాధారణంగా వడ్డీ ఉండదు. రీ షెడ్యూల్ వల్ల రుణం చెల్లించేంతవరకూ అసలుపై 10 శాతం వడ్డీ చెల్లించాలి. అయినా ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పులు తెచ్చుకుని అధిక వడ్డీలు చెల్లించేకంటే ఇదే మంచిదని రైతులు పేర్కొంటున్నారు.
ఎక్కువ మందికి రుణాలివ్వాలని నిర్ణయం
ఈ ఏడాది రబీ ఆశాజనకంగా ఉంటడంతో బ్యాంకులు లక్ష్యాన్ని మించి పంట రుణాలు మంజూరు చేసేందుకు ముందుకొస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రూ.4,374 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ రూ.4,250 కోట్లు ఇచ్చేశారు. ఇంకా మూడు నెలలు అంటే వచ్చే మార్చి వరకూ రబీ రుణాలు పొందే అవకాశం ఉంది. అప్పటికి మరో రూ.500 కోట్లు రుణాలుగా ఇస్తామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.లక్ష్మీనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. దీని ప్రకారం చూస్తే ఈ ఏడాది రుణ లక్ష్యం దాటి రూ.376కోట్లు రైతులకు అదనంగా అందనున్నాయి.
అన్నదాతకు ఆసరా
Published Tue, Dec 31 2013 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement