సాక్షి ప్రతినిధి, ఏలూరు : పై-లీన్, హెలెన్ తుపానుల ప్రభావం నుంచి ‘పశ్చిమ’ ఇంకా తేరుకోలేదు. ఈలోగానే ముంచుకొస్తున్న లెహర్ తుపాను ప్రజలను హడలెత్తిస్తోంది. పెనుగాలులతో బెంబేలెత్తించిన హెలెన్ కంటే లెహర్ తుపాను ప్రమాదకరంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అంతటా భయూందోళనలు నెలకొన్నారుు. హెలెన్ తుపాను ప్రభావానికి తీర ప్రాంతంలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతోగాలులు వీయడంతో సముద్రంతో సహవాసం చేసే గంగపుత్రులు సైతం వణికిపోయారు.
ఇప్పుడు లెహర్ తుపాను ప్రభావంతో 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయనే సమాచారం బెంబేలెత్తిస్తోంది. 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు కొబ్బరి, అరటి తోటలు ధ్వంసమయ్యాయి. వరి దుబ్బులు నేలకొరిగి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇక 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే మిగిలిన కాస్త పంటలు కూడా కొట్టుకుపోతారుు. గత నెలలో పై-లీన్ తుపా ను, అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డెల్టాలోని 1.36 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా హెలెన్ తుపాను 2,74,082 ఎకరాల్లో పంటలను మింగేసింది. జిల్లాలో మొత్తం ఆరు లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా, ఇప్పటికే వచ్చిన రెండు తుపాన్లు, అల్పపీడనం వల్ల నాలుగు లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది.
మిగిలిన రెండు లక్షల ఎకరాల పంటను లెహర్ మింగేస్తుందేమోనని రైతులు వణికిపోతున్నారు. హెలెన్ ధాటికి మునిగిన పొలాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. పంటను బయటకు తెచ్చే పనిలో ఉండగానే, మరో తుపాను ముంచుకురావడం రైతుల్ని కుదేలు చేస్తోంది.
వణుకుతున్న తీరం
గతంలో ఎన్నో తుపానులను చూసి.. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా నిబ్బరంగా తట్టుకోగలిగిన తీరప్రాంత వాసులు ప్రస్తుత వరుస తుపానుల దెబ్బకు వణికిపోతున్నారు. హెలెన్ ధాటికి నరసాపురం నియోజకవర్గంలో రెండురోజులపాటు కరెంటు లేక ప్రజలు అవస్థలు పడ్డారు. పెనుగాలులకు విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలింది. పునరుద్ధరణ పనులు చేస్తుండగానే, మరో తుపాను మరింత భీకర రూపంలో ముంచుకొస్తోందనే వార్త తీర ప్రాంత వాసులను బెంబేలెత్తిస్తోంది. మరోవైపు సముద్రాన్నే నమ్ముకున్న మత్స్యకారులు ఏం జరుగుతుం దోనని ఆందోళనలో మునిగిపోయారు. మొన్నటి తుపాను ధాటికి నరసాపురం మండలంలోని చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాలు అర కిలోమీటరు మేర కోత కు గురయ్యాయి. లెహర్ దెబ్బకు ఊరు కొట్టుకుపోతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. మిగిలిన 35 తీర ప్రాంతాల మత్స్యకారులు ఇప్పటికే బోట్లు, వలలు దెబ్బతిని నష్టాల పాలయ్యారు. కొద్దిరోజుల నుంచి వారి ఉపాధికి గండిపడింది. మళ్లీ పెను తుపాను వస్తుండడంతో ఇక తమకేమీ మిగలదని మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.
యంత్రాంగం బెంబేలు
జిల్లాలో నెలకొన్న విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియక అధికార యంత్రాం గం హైరానా పడుతోంది. అల్పపీడనం, పై-లీన్ తుపానుల వల్ల జరిగిన నష్టం అంచనాలను ఇంకా రూపొందించలేదు. హెలెన్ తుపాను సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగానే, లెహర్ విరుచుకుపతుందనే సమాచారం యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. లెహర్‌ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యలతో మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ ఎవరికీ కంటిమీద కునుకు లేకుండాపోయింది. వరుస విపత్తులతో ఏంచేయాలో తెలియని అయోమయం వారిని వెంటాడుతోంది. అక్టోబర్, నవంబర్ నెలలు జిల్లాకు అగ్నిపరీక్షగా మారాయి.
అమ్మో.. లెహర్
Published Tue, Nov 26 2013 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement