ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం పర్యటించనున్నారు. ముంపు ప్రాంత నియోజకవర్గాలైన పాలకొల్లు, నరసాపురం, భీమవరంలలో 65 కి.మీ మేర ఆయన పర్యటించనున్నారు. ఉద యం 9 గంటలకు దిండి రిసార్ట్‌నుంచి బయలుదేరి యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిమీదుగా జిల్లాలో ప్రవేశిస్తారని పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. యలమంచిలిలో పొలాలను చంద్రబాబు పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం ఊటాడ-కాజతూర్పుమీదుగా బ్రిడ్జివరకు చేరుకుని అక్కడ పొలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత పెదమామిడిపల్లి మీదుగా దిగమర్రు, నరసాపురం-మత్స్యపురిరోడ్డు బ్రిడ్జిమీదుగా చినమామిడిపల్లి, శరపల్లి, లిఖితపూడిమీదుగా కొప్పర్రు, భీమవరం నియోజకవర్గంలోని మత్స్యపురి, తుందుర్రు ప్రాంతాల్లో పొలాలను పరిశీలించి పంట స్థితిగతులపై రైతులను చంద్రబాబు అడిగి తెలుసుకుంటారు. అనంతరం భీమవరం టౌన్ నుంచి ఉండి, చెరుకువాడ, ఆకివీడు మీదుగా ఉప్పటేరు బ్రిడ్జి నుంచి చంద్రబాబు కృష్ణాజిల్లాలో ప్రవేశిస్తారని ఆమె వివరించారు.