ఏలూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్‌సీపీ జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలకు మంచి చేయడం మాని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. నూజివీడు సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పేర్నినానితోపాటు, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పరామర్శించారు. ఆనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
‘చంద్రబాబు సమావేశాల్లో అమరావతి, అభివృద్ధి, సంపద సృష్టి అని కబుర్లు చెబుతున్నారు. కానీ తెరవెనుక జరిగేదంతా మట్టి, ఇసుక దోపిడీ, లే అవుట్ల పేరుతో దోపిడీ చేస్తున్నారు. అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను జైలులో వేస్తున్నారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారు. టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తిరగబడితే.. ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారు.
ఇప్పటి వరకూ 71 మంది పేర్లను చేర్చారు. ఇంకా ఉన్నారని చెబుతున్నారు. గన్నవరం వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా ఉన్నవారిని పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేయిస్తున్నారు. .. పోలీసులను అడ్డగోలుగా దిగజార్చి వాడుకుంటున్నారు. బెయిల్ రాకుండా చేయడానికి సెక్షన్లు మార్చి జైళ్లలో ఉంచుతున్నారు. అరెస్టైన వారిలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడి తల్లి చనిపోతే దినం చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఏడాది క్రితం జరిగిన కేసులో ఒక్కొక్కరినీ చేరుస్తూ అరెస్ట్ చేస్తున్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జైల్లో ఉన్నవారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పాం. అక్రమంగా అరెస్టైన వారి బెయిల్ కోసం పార్టీ ప్రయత్నిస్తోంది. ఎన్ని కేసులు పెట్టినా జెండా వదిలిపెట్టేదిలేదని కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేసి టీడీపీ నేతలు సునకానందం పొందుతున్నారు. గతంలో కొడాలి నానికి కేన్సర్ అంటూ ప్రచారం చేశారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ వార్తలు వేసి శునకానందం పొందారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంపైకి బెజవాడ నుంచి గూండాలు దాడికి వస్తే.. వంశీపై అన్యాయంగా కేసు పెట్టారు. వంశీ న్యాయం కోసం పోరాడుతున్నారు. కచ్చితంగా బెయిల్ తీసుకుని వంశీ వస్తారు. టీడీపీ చేస్తున్న మోసాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రజాపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment