సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాల ప్రభావం రాష్ట్రం మీద అంతంత మాత్రంగానే ఉన్నా, తుపానుల రూపంలో వర్షాలు విరివిగా కురుస్తున్నాయి. తాజాగా, అండమాన్ సమీపంలో కేంద్రీకృతమైన లెహర్ తుపాను ఆంధ్ర వైపుగా పయనించి తీరం దాటనున్నది. తీరం దాటే సమయంలో ఏర్పడే తీవ్రత రాష్ట్రం మీద ఉండబోదు. అయితే, ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కుండపోత: లెహర్ ద్రోణి ప్రభావంతో శనివారం రాత్రి నుంచి విల్లుపురం, కడలూరు, నాగపట్నం, తంజావూరు, నీలగిరి, కన్యాకుమారి జిల్లాల్ని వర్షం ముంచెత్తింది. కడలూరులోని నెల్లి కుప్పుం, మాదవ నగర్, తాలం కులం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. విల్లుపురం జిల్లా ఊలందూరు పేట, తిరువన్నై, మైలంలో కుండపోత వర్షానికి రోడ్లు నదుల్ని తలపించాయి. తంజావూరు జిల్లా కుంబకోణం పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కల్లనై, పెన్నారుల్లో నీటి ఉధృతి పెరగడంతో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయూయి. నీలగిరి జిల్లాలో పలు చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఊటీ -మెట్టుపాళయం మార్గంలోని వంతెన కొట్టుకుపోవడంతో కోతగిరి మీదుగా రాకపోకలను మళ్లించారు. ఊటీ రైలు మార్గంలో కొండ చరియలు విరిగి పడటంతో మూడు రోజులపాటుగా రైళ్లను రద్దు చేశారు. కన్యాకుమారిలో గోదై నది, పేచ్చి పారై, తిరువట్టారు పరిసర గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కాయి. గోదై నది పరవళ్లు తొక్కుతుండగా, తిరుప్పరపు జలపాతం పొంగి పొర్లుతోంది. శనివారం అర్ధరాత్రి కాంచీపురం, చెన్నై శివారుల్లో మోస్తారుగా వర్షం కురిసింది.
ప్రమాద హెచ్చరిక: ఆదివారం అర్ధరాత్రికి అండమాన్ సమీపంలోని ఫోర్ట్ బ్లేయర్ దీవుల్ని లెహర్ దాటనున్నది. గంటకు 110 కి.మీ వేగంతో వాయువ్య దిశలో ఇది పయనిస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో సముద్ర తీర వాసుల్ని అప్రమత్తం చేశారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున, కడలిలోకి వెళ్లొదని సూచిస్తున్నారు. చెన్నై ఎన్నూరు, కడలూరు, నాగపట్నం, తూత్తుకుడి, కన్యాకుమారి, పంబన్, పుదుచ్చేరి హార్బర్‌లలో రెండో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు.
‘లెహర్’ గండం
Published Mon, Nov 25 2013 12:07 AM | Last Updated on Fri, Jun 1 2018 9:35 PM
Advertisement
Advertisement