జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల ప్రారంభం నుంచి క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.
=గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
=కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్
=ఇబ్బంది పడుతున్న వృద్ధులు, పిల్లలు
సాక్షి, హన్మకొండ: జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల ప్రారంభం నుంచి క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. వారం రోజులుగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత సగటున 15 సెల్సియస్ డిగ్రీ లుగా నమోదైంది. ఇక శని, ఆదివారాల్లో ఏకంగా12 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయింది. ఈ ఏడాదిలోఇప్పటివరకు అతి తక్కువ ఉష్ణోగ్రతగా ఇది రికార్డుల్లోకెక్కింది.
ఉదయం, సాయంత్రం వేళలో చలితీవ్రత ఎక్కువగా ఉంటోంది. పొగమంచు కారణంగా ఉదయం వేళ వాహనాలపై వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో ఇదే సమయంలో మొదటి సారిగా ఉష్ణోగ్రతలు 20 సెల్సియస్ డిగ్రీల కంటే కిందికి పడిపోయాయి. అయితే ఆ తర్వాత హెలెన్, లెహర్ తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా నవంబర్ మధ్య నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ... వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం మొదలైంది.
ఈ క్రమంలో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి.చలి తీవ్రత పెరగడంతో పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఆరుగంటల తర్వాతే సూర్యుడు మబ్బుల మాటు నుంచి బయటకు వస్తున్నాడు. తొమ్మిదింటి వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. తిరిగి సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతూ ఐదున్నర గంటలకల్లా చీకటి పడుతోంది. జనవరిలో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు.