రాష్ట్రానికి ‘లెహర్’ ముప్పు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంపై ప్రకృతి పగబట్టినట్టుంది! ఒక ముప్పు నుంచి తేరుకోక ముందే మరొకటి ముంచుకొస్తోంది. పై-లీన్, హెలెన్ తుపాన్ల విలయం చాలదన్నట్టు తాజాగా ‘లెహర్’ తుపాను రాష్ట్రంపైకి శరవేగంగా దూసుకొస్తోంది. హెలెన్ తుపాను ఛాయలు ఇంకా కనుమరుగు కాకుండానే మరో ముప్పు ముంచుకువస్తుండడంతో తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. అండమాన్ వద్ద బంగాళాఖాతంలో మూడ్రోజుల కిందట ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడి తుపానుగా మారింది. ‘లెహర్’ పేరుతో పిలుస్తున్న ఈ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ ఆదివారం అర్ధరాత్రికి పోర్టుబ్లెయిర్ వద్ద తీరాన్ని దాటాక ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అనంతరం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనుంది.
ఇది పశ్చిమ వాయవ్య దిశగా (కోస్తాంధ్ర వైపు) పయనిస్తూ మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద ఈ నెల 28 ఉదయానికల్లా తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. లెహర్ ప్రభావం రాష్ట్రంలోని కోస్తాంధ్రపై అధికంగా పడనుంది. ఇప్పటికే అక్టోబర్ రెండో వారంలో సంభవించిన పై-లీన్ దెబ్బకు తీరప్రాంతాలు అల్లాడాయి. ఆ గండం నుంచి ఊపిరి పీల్చుకున్న వారానికే భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అన్నదాతకు అపార నష్టాన్ని మిగిల్చాయి. తర్వాత పక్షం రోజులైనా గడవక ముందే నవంబర్ 19 నుంచి 23 వరకూ హెలెన్ కోస్తాంధ్రను అతలాకుతలం చేసింది. మచిలీపట్నం వద్ద తీరం దాటిన ఈ తుపాను చేతికొచ్చిన పంటను నేలమట్టం చేసింది. పై-లీన్, భారీ వర్షాలు, హెలెన్ దెబ్బకు రాష్ట్రంలో 48 లక్షల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. 30 లక్షల ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. 10 లక్షల ఎకరాల్లో పత్తి తడిసిపోయింది. కొబ్బరి, మామిడి, అరటి తోటలు నేలకూలాయి. ఈ నేపథ్యంలో లెహర్ రూపంలో రైతులపై ప్రకృతి మరోసారి పడగ విప్పుతోంది.
లెహర్‌తో పెను ముప్పే: లెహర్ తుపానుతో పెను ముప్పు ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన తుపానుగా మారిన ‘లెహర్’ తీరానికి చేరవయ్యే కొద్దీ తీవ్రత పెంచుకుంటుంది. పెను గాలులు, భారీ వర్షాలతో విరుచుకుపడే ఈ తుపాను ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని, హెలెన్ కంటే రెట్టింపు తీవ్రత ఉండొచ్చని భావిస్తున్నారు. లెహర్ తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని ‘స్కైమెట్’ వాతావరణ సంస్థ పేర్కొంది.
40 రోజులు.. 3 తుపాన్లు..
ఇటీవల ఎన్నడూ లేనివిధంగా నలభై రోజుల్లో 3 తుపాన్లు సంభవించాయి. ఈ మూడూ తీవ్రమైనవే. ఒక సీజనులో ఇంత స్వల్ప వ్యవధిలో మూడు తుపాన్లు రావడం చాలా అరుదు. వాస్తవానికి మే నుంచి మొదలయ్యే రుతుపవనాల సీజన్ నుంచి ఇప్పటిదాకా 4 తుపాన్లు ఏర్పడ్డాయి. ఇందులో మొదటిది ఈ ఏడాది మే 10-17 మధ్య ఏర్పడ్డ ‘మహాసేన్’ తుపాను. ఆ తర్వాత అక్టోబర్ (6-17 మధ్య)లో పై-లీన్ వచ్చింది. అనంతరం ఈనెల (19-23 మధ్య)లో హెలెన్ ముంచెత్తింది. తాజాగా ఇప్పడు లెహర్ తరుముకొస్తోంది.
లెహర్’ పేరు మనదే!
అండమాన్‌లో ఏర్పడ్డ తాజా తుపానుకు ‘లెహర్’ అని నామకరణం చేశారు. ఈ పేరును సూచించింది మన దేశమే. ‘లెహర్’ అంటే అందమైన పసిపాప అని అర్థం. ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో వచ్చిన తొలి తుపాను మహాసేన్ పేరును శ్రీలంక, అక్టోబర్‌లో వచ్చిన పై-లీన్‌కు థాయిలాండ్, హెలెన్‌కు బంగ్లాదేశ్‌లు పేర్లు పెట్టాయి.