
కొనకనమిట్ల: నిద్రమత్తు.. నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టడంతో కర్ణాటకకు చెందిన నలుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం–పొదిలి జాతీయ రహదారిపై గురువారం ఉదయం 6.40గంటల సమయంలో జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పాటిమీదపాలేనికి చెందిన వెన్నపూస శాంతారామిరెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఆయన భార్య సరస్వతి తోబుట్టువు, వారి బంధువులు మరో 9 మంది కర్నాటక రాష్ట్రం బళ్లారి మండలం సిద్దంపల్లి, ఎరెంగలి, ఉద్దట్టి గ్రామాల నుంచి తుఫాన్ వాహనంలో బయల్దేరారు.
మరో గంటలో పాటిమీదపాలెం చేరుకోవాల్సి ఉండగా.. కొనకనమిట్ల మండలం కొత్తపల్లి వద్ద చెన్నై నుంచి మార్కాపురానికి ఫ్లైవుడ్ లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో తుఫాన్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జయింది. వాహన డ్రైవర్ మంజు అందులోనే ఇరుక్కుపోగా సిద్దంపల్లి హేమంత్‌రెడ్డి(62), చెట్ల హంసమ్మ(59), చెట్ల సుగుణమ్మ(58) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి వైద్యశాలకు తరలించగా సునీత(32) చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల్లో హంసమ్మ, సునీత తల్లీకూతుళ్లు. చెట్ల శృతి, చెట్ల వీరారెడ్డి, సిద్దంపల్లి రామిరెడ్డి, సురేష్‌రెడ్డి, తిమ్మారెడ్డి, కవితతోపాటు తుఫాన్ డ్రైవర్ మంజు ప్రస్తుతం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృత దేహాలను కందుకూరు ఆర్డీవో ఓబులేసు, దర్శి డీఎస్పీ సూర్యప్రకాశ్‌రావు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరనాయక్ తెలిపారు.
ఘటనా స్థలంలో మృతదేహాలు, క్షతగాత్రులు
Comments
Please login to add a commentAdd a comment