four killed in road accident
-
లారీ–ఆటో ఢీ.. నలుగురి దుర్మరణం
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని నసరుల్లాబాద్ శివారులో బుధవారం లారీ–ఆటో ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి తీవ్ర గాయాలతో బయటపడింది. జడ్చర్ల సీఐ వీరస్వామి కథనం ప్రకారం.. జడ్చర్ల మండలంలోని నసరుల్లాబాద్కి చెందిన నరేశ్ (20) అన్నాసాగర్‌లో ఉంటున్న అక్క, బావ, మేన కోడళ్లలను తీసుకుని ఆటోలో తమ గ్రామానికి బయల్దేరాడు. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఆటో నడుపుతున్న నరేశ్‌తో పాటు బావ శంకర్ (35), అక్క జ్యోతి (22), అక్క కూతురు మేఘవర్షిణి (2) దుర్మరణం చెందారు. ప్రమాదం నుంచి మరో చిన్నారి ఆయావతి (5) తీవ్ర గాయాలతో బయటపడింది. మరో రెండు నిమిషాల్లో గ్రామానికి చేరుకుంటారన్న సమయంలో.. ఎదురుగా వచి్చన లారీ, ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో శంకర్.. అతడి చిన్న కూతురు మేఘవర్షిణి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన జ్యోతి, నరేశ్, ఆయావతిలను 108లో బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలో జ్యోతి మృతి చెందింది. నరేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయావతిని మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నలుగురి ప్రాణాలు తీసిన నిద్రమత్తు
కొనకనమిట్ల: నిద్రమత్తు.. నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టడంతో కర్ణాటకకు చెందిన నలుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం–పొదిలి జాతీయ రహదారిపై గురువారం ఉదయం 6.40గంటల సమయంలో జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పాటిమీదపాలేనికి చెందిన వెన్నపూస శాంతారామిరెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఆయన భార్య సరస్వతి తోబుట్టువు, వారి బంధువులు మరో 9 మంది కర్నాటక రాష్ట్రం బళ్లారి మండలం సిద్దంపల్లి, ఎరెంగలి, ఉద్దట్టి గ్రామాల నుంచి తుఫాన్ వాహనంలో బయల్దేరారు. మరో గంటలో పాటిమీదపాలెం చేరుకోవాల్సి ఉండగా.. కొనకనమిట్ల మండలం కొత్తపల్లి వద్ద చెన్నై నుంచి మార్కాపురానికి ఫ్లైవుడ్ లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో తుఫాన్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జయింది. వాహన డ్రైవర్ మంజు అందులోనే ఇరుక్కుపోగా సిద్దంపల్లి హేమంత్‌రెడ్డి(62), చెట్ల హంసమ్మ(59), చెట్ల సుగుణమ్మ(58) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి వైద్యశాలకు తరలించగా సునీత(32) చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల్లో హంసమ్మ, సునీత తల్లీకూతుళ్లు. చెట్ల శృతి, చెట్ల వీరారెడ్డి, సిద్దంపల్లి రామిరెడ్డి, సురేష్‌రెడ్డి, తిమ్మారెడ్డి, కవితతోపాటు తుఫాన్ డ్రైవర్ మంజు ప్రస్తుతం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృత దేహాలను కందుకూరు ఆర్డీవో ఓబులేసు, దర్శి డీఎస్పీ సూర్యప్రకాశ్‌రావు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ తెలిపారు. ఘటనా స్థలంలో మృతదేహాలు, క్షతగాత్రులు -
ఆయువు తీసిన ఆయిల్ ట్యాంకర్
సామర్లకోట (పెద్దాపురం) / కాకినాడ రూరల్: రంజాన్ మాసం, వేసవి సెలవుల్లో కొన్నిరోజులు ఆత్మీయుని ఇంట గడుపుదామని బయల్దేరిన వారికి ఆ ప్రయాణంలోనే ఆయువు తీరిపోయింది. ఎక్కిన ఆటోయే ఆఖరి మజిలీ అయింది. ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకరే మృత్యుదూత అయింది. ఆటో డ్రైవర్‌ను పొట్టన పెట్టుకుంది. అమ్మమ్మను, ఇద్దరు మనుమలనూ ఒకేసారి కబళించింది. అదే కుటుంబంలోని మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచింది. కాకినాడ–సామర్లకోట ఏడీబీ రోడ్డులో హోప్ ఆసుపత్రి సమీపంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకరు ఆటో డ్రైవర్ కాగా మిగిలిన ముగ్గురు మృతులు, గాయపడ్డ మరో ముగ్గురు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఒకే కుటుంబం వారు. గాయపడ్డ వారు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల గంజిపాలెంకు చెందిన షేక్ అమీనాబీబీ (60) రంజాన్ మాసం, వేసవి సెలవుల నేపథ్యంలో.. కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో ఐఓసీ పెట్రోల్ ట్యాంకుల వద్ద సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తూ వలసపాకలలో నివాసం ఉంటున్న కుమారుడు షేక్ పీర్(మాజీ సైనికుడు) ను చూసేందుకు తన ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనుమరాళ్లు, ఒక మనుమడితో కలసి కాకినాడ బయలుదేరింది. చీరాల నుంచి సామర్లకోటకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఆ కుటుంబం వలసపాకల వెళ్ళేందుకు సామర్లకోటలో ర్యాలి సుబ్బారావు (45) ఆటోను కట్టించుకున్నారు. ఏడీబీ రోడ్డులో ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగిన తరువాత ఎదురుగా కాకినాడ నుంచి సామర్లకోట వస్తున్న ఆయిల్ ట్యాంకరు తొలుత కాకినాడ నుంచి సామర్లకోట మోటారు సైకిలుపై వస్తున్న యు.సత్తిబాబును ఢీకొంది. ఆ క్రమంలో అదుపు తప్పి ఆటోను ఢీకొంది. అమీనాబీబీ, 9 ఏళ్ల మనుమడు షమ్ము, 7 ఏళ్ల మనుమరాలు, ఆటో డ్రైవర్ సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందారు. అమీనాబీబీ కుమార్తెలు షేక్ మహబూబ్ ఉన్నీసా, షేక్ రహమత్ బీ, మనుమరాలు యాస్మిన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతున్నారు. యాస్మిన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించిన ఆత్మీయులు ప్రమాదవార్త తెలిసి ఆసుపత్రికి వచ్చిన షేక్ పీర్ తీవ్రంగా గాయపడ్డ తోబుట్టువులను, మేనకోడలిని చూసి బోరున విలపించాడు. సామర్లకోటకు చెందిన ఆటో డ్రైవర్ సుబ్బారావుకు భార్య పద్మ, 12 సంవత్సరాల కుమార్తె దేవి ఉన్నారు. కుటుంబసభ్యులు జీజీహెచ్‌కు తరలివచ్చి, అతడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సామర్లకోటకు చెందిన ఆటో డ్రైవర్లు సుబ్బారావు మృతదేహాన్ని చూసి చలించిపోయారు. కాగా షేక్ పీర్ తట్టుకోలేడని అతడి తల్లి, మేనల్లుడు, మేనకోడళ్ల మృతదేహాలను చూడనివ్వలేదు. కాగా మోటారు సైకిలిస్టుకు స్వల్ప గాయం కావడంతో ఇంటికి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. ప్రమాదస్థలాన్ని సందర్శించిన హోం మంత్రి రాజప్ప హోం మంత్రి చినరాజప్ప, ఎస్పీ విశాల్ గున్ని కాకినాడ డీఎస్పీ రవివర్మ, సీఐ కృష్ణచైతన్య, సామర్లకోట, తిమ్మాపురం, ఇంద్రపాలెం ఎస్సైలు ప్రమాదస్థలాన్ని సందర్శించారు. తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదసమయంలో శ్రీనివాస్ తాగి ఉన్నట్లు గుర్తించారు. కాగా హోం మంత్రి చినరాజప్ప, ఎస్పీ విశాల్ గున్ని ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించారు. మెరుగైన వైద్యసేవల కోసం అపోలో ఆసుపత్రికి తరలించాలని హోంమంత్రి ఆదేశించారు. వీరికి ఆసుపత్రిలో అయ్యే అన్ని రకాల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం వర్తింప చేస్తామని, ప్రభుత్వపరంగా రావల్సిన అన్ని సౌకర్యాలు అందజేస్తామని వివరించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు దుర్మరణం
-
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట మండలం తిమ్మాపురం ఏబీడీ రోడ్డు వద్ద ఓ లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దర్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
డిచ్పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, నిజామాబాద్ : డిచ్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. కారు-లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కోటగిరికి చెందిన రైస్‌మిల్ వ్యాపారి రాఘవేంద్ర..భార్య, ఇద్దరు పిల్లలితో కలిసి హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరై స్వస్థలానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఎండ తీవ్రత వల్ల కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న లారీనీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఘటనాస్థలంలోనే నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు. -
ఇన్నోవా బోల్తా, నలుగురు దుర్మరణం
-
ఇన్నోవా బోల్తా, నలుగురు దుర్మరణం
విశాఖపట్టణం : విశాఖ జిల్లా రాయవరం సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం ముందుగా డివైడర్‌ను ఢీకొని అనంతరం పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. వీరంతా గాజువాక నుంచి పాయకరావుపేట వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు గాజువాకకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.