ఆయువు తీసిన ఆయిల్‌ ట్యాంకర్‌ | four killed in road accident | Sakshi
Sakshi News home page

ఆయువు తీసిన ఆయిల్‌ ట్యాంకర్‌

Published Sun, Jun 3 2018 8:04 AM | Last Updated on Sun, Jun 3 2018 8:04 AM

four killed in road accident - Sakshi

సామర్లకోట (పెద్దాపురం) / కాకినాడ రూరల్‌:  రంజాన్‌ మాసం, వేసవి సెలవుల్లో కొన్నిరోజులు ఆత్మీయుని ఇంట గడుపుదామని బయల్దేరిన వారికి ఆ ప్రయాణంలోనే ఆయువు తీరిపోయింది. ఎక్కిన ఆటోయే ఆఖరి మజిలీ అయింది. ఎదురుగా వచ్చిన ఆయిల్‌ ట్యాంకరే మృత్యుదూత అయింది. ఆటో డ్రైవర్‌ను పొట్టన పెట్టుకుంది. అమ్మమ్మను, ఇద్దరు మనుమలనూ ఒకేసారి కబళించింది. అదే కుటుంబంలోని మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచింది. కాకినాడ–సామర్లకోట ఏడీబీ రోడ్డులో హోప్‌ ఆసుపత్రి సమీపంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకరు ఆటో డ్రైవర్‌ కాగా మిగిలిన ముగ్గురు మృతులు, గాయపడ్డ మరో ముగ్గురు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఒకే కుటుంబం వారు. గాయపడ్డ వారు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  

ప్రకాశం జిల్లా చీరాల గంజిపాలెంకు చెందిన షేక్‌ అమీనాబీబీ (60) రంజాన్‌ మాసం, వేసవి సెలవుల నేపథ్యంలో.. కాకినాడ రూరల్‌ మండలం వలసపాకలలో ఐఓసీ పెట్రోల్‌ ట్యాంకుల వద్ద సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తూ వలసపాకలలో నివాసం ఉంటున్న కుమారుడు షేక్‌ పీర్‌(మాజీ సైనికుడు) ను చూసేందుకు తన ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనుమరాళ్లు, ఒక మనుమడితో కలసి కాకినాడ బయలుదేరింది. చీరాల నుంచి సామర్లకోటకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఆ కుటుంబం వలసపాకల వెళ్ళేందుకు సామర్లకోటలో ర్యాలి సుబ్బారావు (45) ఆటోను కట్టించుకున్నారు. 

ఏడీబీ రోడ్డులో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి దిగిన తరువాత ఎదురుగా కాకినాడ నుంచి సామర్లకోట వస్తున్న ఆయిల్‌ ట్యాంకరు తొలుత కాకినాడ నుంచి సామర్లకోట మోటారు సైకిలుపై వస్తున్న యు.సత్తిబాబును ఢీకొంది. ఆ క్రమంలో అదుపు తప్పి  ఆటోను ఢీకొంది.  అమీనాబీబీ, 9 ఏళ్ల మనుమడు షమ్ము, 7 ఏళ్ల మనుమరాలు, ఆటో డ్రైవర్‌ సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందారు. అమీనాబీబీ కుమార్తెలు షేక్‌  మహబూబ్‌ ఉన్నీసా, షేక్‌ రహమత్‌ బీ, మనుమరాలు యాస్మిన్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతున్నారు. యాస్మిన్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

కన్నీరుమున్నీరుగా విలపించిన ఆత్మీయులు
ప్రమాదవార్త తెలిసి ఆసుపత్రికి వచ్చిన షేక్‌ పీర్‌ తీవ్రంగా గాయపడ్డ తోబుట్టువులను, మేనకోడలిని చూసి బోరున విలపించాడు.  సామర్లకోటకు చెందిన ఆటో డ్రైవర్‌ సుబ్బారావుకు భార్య పద్మ, 12 సంవత్సరాల కుమార్తె దేవి ఉన్నారు. కుటుంబసభ్యులు జీజీహెచ్‌కు తరలివచ్చి, అతడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సామర్లకోటకు చెందిన ఆటో డ్రైవర్లు  సుబ్బారావు మృతదేహాన్ని చూసి చలించిపోయారు. కాగా షేక్‌ పీర్‌ తట్టుకోలేడని అతడి తల్లి, మేనల్లుడు, మేనకోడళ్ల మృతదేహాలను చూడనివ్వలేదు. కాగా మోటారు సైకిలిస్టుకు స్వల్ప గాయం కావడంతో ఇంటికి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. 

ప్రమాదస్థలాన్ని సందర్శించిన హోం మంత్రి రాజప్ప
హోం మంత్రి చినరాజప్ప, ఎస్పీ విశాల్‌ గున్ని కాకినాడ డీఎస్పీ రవివర్మ, సీఐ కృష్ణచైతన్య, సామర్లకోట, తిమ్మాపురం, ఇంద్రపాలెం ఎస్సైలు ప్రమాదస్థలాన్ని సందర్శించారు. తిమ్మాపురం పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  పోలీసులు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదసమయంలో శ్రీనివాస్‌ తాగి ఉన్నట్లు గుర్తించారు.  

కాగా హోం మంత్రి  చినరాజప్ప, ఎస్పీ విశాల్‌ గున్ని ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించారు. మెరుగైన వైద్యసేవల కోసం అపోలో ఆసుపత్రికి తరలించాలని హోంమంత్రి  ఆదేశించారు. వీరికి ఆసుపత్రిలో అయ్యే అన్ని రకాల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం వర్తింప చేస్తామని, ప్రభుత్వపరంగా రావల్సిన అన్ని సౌకర్యాలు అందజేస్తామని  వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement