- ఇద్దరు చిన్నారులు మృతి
- పరారీలో తల్లిదండ్రులు
- సామర్లకోట లాడ్జిలో ఘటన
- దంపతులపై 302 కేసు నమోదు
లాడ్జిలో కటుంబం ఆత్మహత్యాయత్నం
Published Sat, Jun 24 2017 12:34 AM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM
సామర్లకోట :
పట్టణంలోని లాడ్జిలో ఓ కుటుంబం ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ ఘనటలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వారి తల్లిదండ్రులు పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లా పార్వతీపురానికి (బెలగామ్) చెందిన కోడూరి సత్యనారాయణ, గౌరమ్మ దంపతులతో పాటు వారి పిల్లలు శిరీష(9), అనూష (7) గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రైల్వేస్టేషన్ సెంటర్‌లో ఉన్న ఎన్‌ఆర్‌సీ లాడ్జి, రూమ్ నంబర్ 106లో దిగారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో భార్యభర్తలు ఇద్దరు బయటకు వెళ్తున్నట్టు చెప్పి శుక్రవారం మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తన తోడల్లుడు కొప్పంగి సతీష్‌కు ఫోన్ చేసి, తాము ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేయగా పిల్లలు చనిపోయారని, తాము కూడా బయటకు వెళ్లి చనిపోతున్నామని చెప్పినట్టు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. సతీష్ సమాచారం మేరకు పోలీసులు లాడ్జి వద్దకు వచ్చి విచారణ ప్రారంభించారు.
«కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి నలుగురు తాగగా... చిన్నారులు కావడంతో వారు పిల్లలు చనిపోయారని, ఈ విషయాన్ని గమనించిన సత్యనారాయణ, గౌరమ్మ పరారయ్యారని సీఐ చెప్పారు. వీరిపై 302 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారి నుంచి వచ్చిన సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా వారిని గుర్తిస్తామని చెప్పారు. సత్యనారాయణ తోడళ్లుడు సతీష్ విశాఖపట్నం నుంచి శుక్రవారం సామర్లకోట చేరుకున్నారు. 12 రోజుల క్రితం తీర్థయాత్రలకు వెళుతున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వారి నుంచి ఎటువంటి ఫోన్ లేదని సతీష్ విలేకరులకు చెప్పారు. శుక్రవారం ఉదయం ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం తెలిపి, ఇక్కడికి వచ్చానన్నారు. తన తోడళ్లుడు పెద్దవాల్తేరులో సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఇటీవలే రూ.లక్షతో మరమ్మతులు చేయించాడని, నెలకు రూ.2,500 అద్దె కూడా సక్రమంగా చెల్లిస్తున్నాడని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని సతీష్ తెలిపారు. విషయం తెలుసుకుని వచ్చిన పిల్లల తాత కొత్త సన్యాసిరావు (గౌరమ్మ తండ్రి) మనవరాళ్ల మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఎంతో చలాకీగా ఉండే పిల్లలను పుణ్యక్షేత్రాలకు తీసుకువెళుతున్నానని చెప్పి తన అల్లుడే చంపేశాడని రోదించారు.
లాడ్జి గుమస్తా నక్కా భాస్కరరావు మాట్లాడుతూ సత్యనారాయణ ఒక రోజుకు అడ్వాన్సుగా రూ.500 చెల్లించారని, రూమ్ అద్దె రూ.350 పోగా మిగిలిన సొమ్ము 24 గంటలు దాటినా ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం రూమ్‌ను పరిశీలించామన్నారు. రూము తలుపు తెరువక పోవడంతో ఏమి జరిగి ఉంటుందోనని వెనుక కిటికీ నుంచి చూడగా ఇద్దరు పిల్లలు మంచంపై ఉన్నారని, దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేసేలోపే పోలీసులు లాడ్జి వచ్చారని విలేకర్లకు చెప్పారు.
మృతుల చిన్నాన్న సతీష్ ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ వెంట ఎస్సై ఎల్.శ్రీనివాసు, ఏఎస్సై జీవీవీ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు. ఫోన్ ఆధారంగా సత్యనారాయణ దంపతులు సికింద్రాబాద్‌లో ఉన్నట్టు పోలీసులు శుక్రవారం రాత్రి గుర్తించారు.
Advertisement
Advertisement