
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని నసరుల్లాబాద్ శివారులో బుధవారం లారీ–ఆటో ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి తీవ్ర గాయాలతో బయటపడింది. జడ్చర్ల సీఐ వీరస్వామి కథనం ప్రకారం.. జడ్చర్ల మండలంలోని నసరుల్లాబాద్‌కి చెందిన నరేశ్ (20) అన్నాసాగర్‌లో ఉంటున్న అక్క, బావ, మేన కోడళ్లలను తీసుకుని ఆటోలో తమ గ్రామానికి బయల్దేరాడు. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఆటో నడుపుతున్న నరేశ్‌తో పాటు బావ శంకర్ (35), అక్క జ్యోతి (22), అక్క కూతురు మేఘవర్షిణి (2) దుర్మరణం చెందారు. ప్రమాదం నుంచి మరో చిన్నారి ఆయావతి (5) తీవ్ర గాయాలతో బయటపడింది.
మరో రెండు నిమిషాల్లో గ్రామానికి చేరుకుంటారన్న సమయంలో.. ఎదురుగా వచి్చన లారీ, ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో శంకర్.. అతడి చిన్న కూతురు మేఘవర్షిణి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన జ్యోతి, నరేశ్, ఆయావతిలను 108లో బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలో జ్యోతి మృతి చెందింది. నరేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయావతిని మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.