
అండమాన్‌లో ఉపరితల ఆవర్తనం
21న అల్పపీడనంగా మారే అవకాశం
23 నాటికి వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
నేటినుంచి 5 రోజులపాటు వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల ప్రభావంతో ఆదివారం నుంచి 5 రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 21 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి 23వ తేదీ నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ వాయుగుండం పశ్చిమ బెంగాల్ లేదా ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో తీరం దాటే సూచనలు సమానంగా ఉన్నాయనీ.. 21 తర్వాత ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై స్పష్టత వస్తుందని సీడబ్ల్యూసీ హెడ్ భారతి ఎస్ సబడే తెలిపారు. ఎక్కువగా ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో ఈ నెల 24 నుంచి 26 మధ్యలో తీరం దాటేందుకు అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం అధికారి స్టెల్లా పేర్కొన్నారు.
కాగా.. వారం క్రితం మన రాష్ట్రంలో బలహీనపడిన వాయుగుండం ప్రస్తుతం అరేబియా సముద్రం–దక్షిణ కర్ణాటక, రాయలసీమ ప్రాంతంలో అల్పపీడనంగా ఉంది. వీటన్నింటి ప్రభావంతో వచ్చే 5 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రధానంగా రాయలసీమ, దక్షిణాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఒడిశా వైపు కదిలే అవకాశం ఉండటంతో 23వ తేదీ తర్వాత ఉత్తరాంధ్రలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు ఈ నెల 29న ఒకటి, వచ్చే నెల 3న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడే సూచనలు మొదలైన నేపథ్యంలో సముద్రంలో అలజడి మొదలైందనీ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులెవరూ ఆదివారం నుంచి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.