ముందుగానే సమాచారం ఇచ్చిన ఇన్‌శాట్–3డీఆర్, ఈఓఎస్–06
సూళ్లూరుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను కదలికలను ఇస్రో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–06), ఇన్‌శాట్–3డీఆర్ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాయని ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్‌లో గురువారం తెలియజేసింది.
2022 నవంబర్ 26న పీఎస్‌ఎల్‌వీ సీ–54 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈఓఎస్–06, 2016 సెప్టెంబర్ 8న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–05 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఇన్‌శాట్–3డీఆర్ ఉపగ్రహాలు విపత్తులను ముందస్తుగా గుర్తించి మానవాళికి మేలు చేస్తుండటంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. ఈ నెల 20న బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సముద్రపు గాలి నమూనాలను బట్టి ఈఓఎస్–06 ఉపగ్రహం ముందస్తుగా గుర్తించింది.
మేఘాలను బట్టి ఇన్‌శాట్–3డీఆర్ ఉపగ్రహం ఈ తుపానును ముందస్తుగా గుర్తించింది. తుపాను బెంగాల్, ఒడిశా మీదుగా వెళ్లి తీరం దాటింది. ఈ విషయాన్ని ఈ రెండు ఉపగ్రహాలు ముందస్తుగా ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. దీనివల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకునే అవకాశం చిక్కింది.
మోదీ అభినందనలు
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఉపగ్రహాలు దేశానికి చేస్తున్న సేవలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా కొనియాడారు. వాటిని తయారు చేస్తున్న మన శాస్త్రవేత్తలు విపత్తులను ముందుగా గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించి.. దేశ ప్రగతిని కాపాడుతున్నారని ప్రధాని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment