ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు కేంద్ర స్థానాల్లో 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. ఈ నెల 28న తీరం దాటనున్న లెహర్ తుపానును ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓ, తహశీల్దారులు, ఐకేపీ, పీహెచ్‌సీ మెడికల్ ఆపీసర్లు, వ్యవసాయ శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలలో నీరు సమృద్ధిగా ఉందని అన్నారు. లెహర్ తుపానుతో నష్టం జరగకుండా మండల పరిధిలోని అన్ని చెరువులను తనిఖీ చేయాలని రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కల్లాలు.. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని భద్రపరచాలని రైతులకు సూచించారు. వరదలతో ఎలాంటి నష్టం తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. నదులు, వాగుల్లోకి వచ్చే వరదల ప్రవాహంపై వివరాలను కంట్రోల్ రూమ్‌కు తెలపాలన్నారు.
జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ.. ప్రసవ తేదీ వారం లోపు ఉన్న గర్భిణులను సమీపంలోని పీహెచ్‌సీలలో చేర్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని భద్రపరిచే విషయంలో రైతులకు సహకరించాలని మార్కెటింగ్, ఐకేపీ ఏపీఎంలకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ కలెక్టర్ మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకాధికారుల నియామకం
తుపాను పరిస్థితులను మానిటరింగ్ చేసేందుకుగాను జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారులను నియమించినట్టు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం- నగర పాలక సంస్థ కమిషనర్ బి.శ్రీనివాస్, పాలేరు- ఖమ్మం ఆర్డీవో సంజీవరెడ్డి, మధిర- స్పెషల్ కలెక్టర్ (పోలవరం) లక్ష్మయ్య, ఇల్లందు- బీసీ సంక్షేమ శాఖాధికారి వెంకటనర్సయ్య, పినపాక- ఎస్‌డీసీ పాల్వంచ నారాయణరెడ్డి, సత్తుపల్లి- సీపీఓ ఆనందరత్నాబాబు, కొత్తగూడెం- ఆర్డీవో అమయ్‌కుమార్, అశ్వారావుపేట- పాల్వంచ ఆర్డీవో శ్యాంప్రసాద్, భద్రాచలం- ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ వైవి.గణేష్, వైరా- సీఈఓ జడ్పీ జయప్రకాష్ నారాయణ్‌ను నియమించారు.
ఉద్యోగులంతా కేంద్ర స్థానాల్లో ఉండాలి
Published Thu, Nov 28 2013 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement
Advertisement