srinivasa srinaresh
-
ఉపాధి కల్పనకు ప్రణాళికలు
ఖమ్మం జెడ్పీ సెంటర్: జిల్లాలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సాధ్యనమైనంత త్వరగా ప్రణాళికలు రూపొంది స్తామని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర సంయుక్త కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లు, డ్వామా పీడీలతో శనివా రం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈజీ ఎస్, జాతీయ జీవనోపాధి మిషన్ పథకాలను సమర్థంగా అమలు చేసే సీఎఫ్‌టీ (క్లస్టర్ ఫెసిలిటేషన్ బృందం) ప్రాజెక్టుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్లస్టర్ ఫెసిలిటేషన్ బృందం ఎంపిక చేసిన గ్రామాల్లో పేదరికాన్ని పూర్తిగా రూపుమాపేలా ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు కింద డ్వామా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు వివరించారు. గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులను క్షేత్రస్ధాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సమర్థంగా అమలయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపా రు. ఈ సంద ర్భంగా రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ మూడేళ్ల కాలపరిమితి గల సీఎఫ్‌టీ ప్రాజెక్టు సంబందించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు త్వరగా తయారు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్‌నారాయణ, డ్వామా పీడీ వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతలను పంచుకుందాం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘బాధ్యతలను పంచుకుందాం.. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం... ఈ ప్రాంత ప్రజల ఆరు దశాబ్దాల కల తెలంగాణ రాష్ట్రం నేడు సాకారమైంది.. సుదీర్ఘ పోరాటాలు.. ఎందరో అమరుల త్యాగ ఫలితంగా 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది’ అని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా సోమవారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మహోద్యమంలో పాల్గొని అమరులైన వారందరికీ జోహార్లు అర్పించారు. ప్రజల చిరకాల వాంఛ సాకారమైనందున తెలంగాణ అంతటా సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌కు, ఆయన మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగధనులకు తెలంగాణ పుట్టినిల్లని, భిన్నజాతులు, కులాలు, వేషభాషలు, సంస్కృతి కలిగిన ప్రజలు ఉన్నారని చెప్పారు. కృష్ణ, గోదావరి, మానేరు, మంజీరా, మూసీ వంటి ఎన్నో నదులు, వాగులు, సహజ వనరులు కలిగిన ఈ ప్రాంతంలో కాకతీయులు తవ్వించిన చెరువులు ఇప్పటికీ రైతుల పాలిట కల్పతరువుగా ఉన్నాయని వివరించారు. అపార ఖనిజ నిల్వలు ఈ ప్రాంతానికి సొంతమని, చేనేత, శిల్పకళ, వెండి నగిషీలు, చిత్రకళ వంటి కళారూపాలు తెలంగాణకు గొప్ప కీర్తిని తెచ్చాయని అన్నారు. బతుకమ్మ, బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపాలని చెప్పారు. బాసర నుంచి భద్రాచలం వరకు, ఆలంపురం నుంచి కోటిలింగాల వరకు ఎన్నో దేవాలయాలు పురాణ ప్రసిద్ధి పొందాయని తెలిపారు. దేశమంతటా తమ గొంతుకలు వినిపించిన వేద ఘనాపాటీలు తెలంగాణలో ఉన్నారన్నారు. పలు చారిత్రక కారణాలతో ఈ ప్రాంతం కొంతకాలం పరాయి పాలనలో ఉందని, స్వాతంత్య్రానంతరం నిజాం ప్రభుత్వం నుంచి విమోచనకు ఈ ప్రాంత వాసులు కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించారని గుర్తు చేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి పొంది హైదరాబాద్ రాష్ట్రంగా అవతరించిందని, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలుగు భాష మాట్లాడే జిల్లాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించిందని చెప్పారు. తిరిగి 1969లో తెలంగాణ ఉద్యమం రూపుదాల్చిందని, ఆ పోరాటంలో 400 మంది అమరులయ్యారని తెలిపారు. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయన్నారు. 2001లో కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ఉద్యమం ప్రారంభమైందని.. నాటినుంచి నేటివరకు జరిగిన పరిణామాలను సోదాహరణంగా వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లాకు విశిష్టస్థానం ఉందని, ఉద్యమాల ఖిల్లాగా ఖ్యాతిని ఆర్జించిందని తెలిపారు. 1969లో అన్నాబత్తుల రవీంద్రనాధ్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టి ఉద్యమానికి పురుడు పోశారని అన్నారు. ఈ దీక్షతో కవులు, రచయితలు, మేథావులు, కళాకారులు, ఉద్యోగులు, సకలజనులు ఒక్కటై ముందుకు కదిలారని తెలిపారు. అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చేనేత, పాడి పరిశ్రమ, బొగ్గు గనులు, విద్యుత్, శిల్ప, స్వర్ణకారుల పరిశ్రమ ఎదగడానికి ఇక్కడ వనరులు ఉన్నాయని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులు నిబద్ధతతో సేవలందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రముఖ స్థానంలో నిలబెట్టేందుకు పూర్తి సహకారం అందించాలన్నారు. కాళోజీ, జయశంకర్ సార్లను స్మరించుకుంటూ ఆదర్శవంతమైన తెలంగాణగా తయారు చేయాలన్నారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా జిల్లాలోని అన్ని వర్గాల వారికి ఆయన అభినందనలు తెలిపారు. జేసీ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ ఐదు కోట్ల మంది చిరకాల స్వప్నం నెరవేరిందని, ఈ రోజును తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరని అన్నారు. ఎందరో త్యాగధనులు, ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయ పక్షాల కృషితో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దేశంలో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పాల్వంచలో త్వరలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు కు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో బొగ్గుగనులు, హెవీవాటర్ ప్లాంట్, గోదావరి నదీ జలాలు పుష్కలంగా ఉన్నాయని, తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా అడవులు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందుండేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రణాళికలు రచించుకుని ఆ దిశగా పనిచేయాలని సూచించారు. దేశానికి అన్నం పెట్టే రైతుల శ్రేయస్సుకు అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలు సాగవుతాయని, ఆ దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాకు రెండు నెలల్లో స్టీల్ ప్లాంట్ వస్తుందని, రూ.30 వేల కోట్లు కేంద్రం నుంచి వస్తాయని చెప్పారు. దీంతో ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రతి ఏడాది రూ.30 లక్షల విలువైన స్టీలు వస్తుందన్నారు. రెండు, మూడేళ్లలో స్టీల్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు, రాజీవ్ యువశక్తి లబ్ధిదారులకు క లెక్టర్ రుణాలు అందజేశారు. ఇంకా ఈ సభలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రా జేందర్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వర్రావు తదితరులు ప్రసంగించగా, వివిధ శాఖల అధికారులు, జిల్లా ప్రముఖలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
నూతనోత్సాహం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జెండావిష్కరణ చేపట్టారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్, రాజకీయపార్టీలు, ఉద్యోగసంఘాల కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వేడుకలను అత్యంత వైభవంగా జరిపారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తన క్యాంపు కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. అనంతరం కలెక్టరేట్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఉద్యోగులు, జిల్లా ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. శాంతికపోతాలను ఎగురవేశారు. కలెక్టరేట్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మహిళా ఉద్యోగినులు బతుకమ్మలు, బోనాలు, గంగిరెద్దుల ఆటలతో ఆకట్టుకున్నారు. కోలాట నృత్యాలతో సందడి చేశారు. ఈ ప్రదర్శనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జేసీ సురేంద్రమోహన్, అదనపు జేసీ బాబూరావు, జెడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణలు ఓపెన్‌టాప్ జీపుపై ప్రజలకు అభివాదం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ముందుకు సాగారు. పోలీసులు కవాతు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన కలెక్టరేట్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ సెంటర్, బస్టాండ్‌మీదుగా భక్త రామదాసు కళాక్షేత్రానికి చేరుకుంది. అక్కడ వేద పండితులు పూర్ణకుంభంతో కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగానికి స్వాగతం పలికారు. కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం లో జిల్లా అన్ని రంగాల్లో ఉన్నతశిఖరాలను అధిరోహించాలని కోరుతూ బెలూన్లను గాలిలోకి వదిలారు. తన క్యాంపు కార్యాల యంలో జేసీ జెండా ఆవిష్కరించారు. జిల్లా పరిషత్‌లో తెలంగాణ సంబురాలు మిన్నంటాయి. ఉద్యోగులు స్వీట్లు పంపిణీ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జెడ్పీ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి సీఈవో జయప్రకాష్‌నారాయణ, ఏవో ఇంజం అప్పారావు, ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటపతిరాజులు పూలమాలలు వేశారు. సీఈవో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మల్లయ్య, శ్రీనివాస్, నాయకులు రవీందర్‌ప్రసాద్, రామకృష్ణారెడ్డి, కిషోర్‌రెడ్డి, వాణిశ్రీపాల్గొన్నారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పీవో దివ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో అమయ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో డెరైక్టర్ (ఆపరేషన్స్) రమేష్‌కుమార్, జిల్లా పోలీస్ కేంద్రంలో డీటీసీ డీఎస్పీ గంగారాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. పం చాయతీ రాజ్ ఎస్ఈ కార్యాలయం లో గంగారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. డీఈ మహేష్‌బాబు, ఈఈ రాం బాబు, శివగణేష్ పాల్గొన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ బి.శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు రంగరాజు, వెంకటపతిరాజు, ఖాజామియా, కోడి లింగయ్య, కోటేశ్వరరా వు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఆర్డీవో సం జీవరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దుమ్ముగూడెం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ శంకర్‌నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు చిరంజీవులు, బాబూరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల్, హసన్, రామారావు, రంగయ్య పాల్గొన్నారు. ట్రెజరీ కార్యాలయంలో డీడీ నీలిమ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖాజామియా, కృష్ణారావు, వేలాద్రి, వల్లోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. నగరంలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కె.మహేష్‌బాబు, ఆర్టీవో కార్యాలయంలో ఆర్టీవో మెహిమిన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు రవీందర్, ఈశ్వరయ్య, ఏవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు. డీఆర్డీఏలో పీడీ శ్రీనివాస్‌నాయక్ జాతీయజెండాను ఆవిష్కరించారు. డ్వామాలో పీడీ వెంకటనర్సయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు అప్పారావు, మీరా, రాజేష్ పాల్గొన్నారు. -
సంబరాలకుసర్వం సిద్ధం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెల్లారితే చాలు... 60 ఏళ్ల కల సాక్షాత్కారమవుతున్న తరుణం... అమరుల త్యాగాల పునాదులపై ఆవిర్భవిస్తున్న నవజాత శిశువు తెలంగాణ రాష్ట్రాన్ని గుండెలకు హత్తుకుని మనసు నిండా ఆనందం నింపుకునేందుకు ఖమ్మం మెట్టు ముస్తాబవుతోంది. తరతరాల ఆకాంక్ష నెరవేరుతున్న వేళ.. నవ తెలంగాణ రాష్ట్రానికి అఖండ రీతిలో స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజానీకం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమించిన ఉద్యోగులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలందరి చిరకాల స్వప్నం తీరబోతున్న తరుణంలో జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాయాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో పలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులు, రంగులతో కళకళలాడుతున్నాయి. ఆదివా రం అర్ధరాత్రి నుంచే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎక్కడా ఏ విధమైన అడ్డంకులు రాకుండా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ చర్యలు తీసుకుంటున్నారు. మండల కేంద్రాల్లో కూడా వేడుకలను నిర్వహించాలని కలెక్టర్ ఆయా మండలాల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. జూన్ 2న ఉద్యోగులందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంబరాల్లో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి బాణాసంచా కాల్చు తూ ఆనందంగా గడిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. వారం రోజులపాటు మండల, పంచాయతీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అక్కడ జిల్లా స్థాయి అధికారులు కూడా బాగస్వాములు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్సవాలకు ప్రత్యేక కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించారు. మండలాల్లో వేడుకల నిర్వహణకు రూ.10 వేలు నిధులు సైతం విడుదల చేసినట్లు తెలిసింది. ఈ వేడుకలను పురస్కరించుకొని జూన్ 2న ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లో జాతీయ పతాకం ఆవిష్కరించి పావురాలు ఎగరవేయనున్నారు. భక్తరామదాసు కళాక్షేత్రం వద్ద బెలూన్లు ఎగురవేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడే రైతులకు, స్వశక్తి సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు పంపిణీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ పాఠశాలల ఉపాధ్యాయులకు, అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బాగా పనిచేసిన సిబ్బందిని సన్మానించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో అత్యుత్తమ సేవలందిస్తున్న డాక్టర్లను కూడా సన్మానించనున్నారు. అలాగే బతుకమ్మ, తదితర తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 2 తరువాత ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు సైతం తెలంగాణ పేరుతో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో.... తెలంగాణ రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ జేఏసీ, ఉద్యోగ జేఏసీలు సైతం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆయా శాఖల నేతలు తమతమ కార్యాయాల్లో జెండాలను ఎగురవేసి, వినూత్న రితీలో పలు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. వినోదం పంచేలా పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కార్యాలయాలకు తెలంగాణ రాష్ట్రం పేరుతో ప్లెక్సీలు, బోర్డులు, ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ , బీజేపీ, న్యూడెమోక్రసీ పార్టీలు సైతం వేడుకలను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. -
‘తెలంగాణ’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులకు సూచించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జూన్ 1న అర్ధరాత్రి బాణసంచా పేల్చి స్వాగతం పలకాలని, ఆ తర్వాత తెలంగాణ గీతాలు ఆలపించాలని చెప్పారు. 2వ తేదీ ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లో పావురాలు ఎగురవేసి, భక్త రామదాసు కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించాలని సూచించారు. కళాక్షేత్రం వద్ద బెలూన్లు ఎగురవేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు, స్వశక్తి సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ పాఠశాలల ఉపాధ్యాయులకు, అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చురుకుగా పనిచేసిన సిబ్బందిని, గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమ సేవలందిస్తున్న వైద్యులను సన్మానించనున్నట్లు వివరించారు. ఇందుకోసం అర్హులైన వారి జాబితాలను తయారు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇదే రోజున భక్తరామదాసు కళాక్షేత్రంలో బతుకమ్మ, తదితర తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పాల్గొని బంగారు తెలంగాణకు బాటలు వేయాలని కోరారు. సమావేశంలో జేసీ కె.సురేంద్రమోహన్, ఆర్డీవో సంజీవరెడ్డి, మెప్మా పీడీ వేణుమనోహర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భానుప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జగన్మోహన్రెడ్డి, హౌసింగ్ పీడీ భాస్కర్, జేడీ (ఎ) భాస్కర్, ఎల్డీఎం శ్రీనివాస్, డ్వామా పీడీ వెంకటనర్సయ్య, సమాచార శాఖ సహాయ సంచాలకులు ఎం.వెకంటేశ్వర ప్రసాద్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఆంజనేయశర్మ, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు మరియన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలు ఇప్పించండి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోతున్న నేపథ్యంలో జిల్లాకు రావాల్సిన నిధుల బకాయిలన్నింటిని వెంటనే విడుదల చేయించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర విభజన కసరత్తుపై చర్చించిన అధికారులు జిల్లాల వారీగా సమీక్ష జరిపారు. అందులో భాగంగా కలెక్టర్ శ్రీనరేశ్ మన జిల్లాకు రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన రూ.10 కోట్లు, ఆన్లైన్లో నిలిచిపోయిన రూ.37 కోట్ల మేర హౌసింగ్ నిధులు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి కేటాయించిన రూ.20 కోట్లతో పాటు పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లు, విద్యుత్‌బిల్లులు, మెడికల్ సర్వీసు డాక్టర్ల వేతనాలను వీలున్నంత త్వరగా ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశం అనంతరం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లకు వేడుకగా వీడ్కోలు విందు ఇచ్చారు. శభాష్... ఆనంద్ జిల్లా కలెక్టర్ల సమావేశం ఎవరెస్టు అధిరోహకులు ఆనంద్, పూర్ణలకు అభినందనలు తెలియజేసింది. సమావేశంలో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రావత్‌లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యంత సాహసోపేతమైన ఎవరెస్టు యాత్రను విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. దీంతో కలెక్టర్లంతా చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. జిల్లా కలెక్టర్ శ్రీనరేశ్ ప్రత్యేకంగా ఆనంద్ గురించి ప్రస్తావించి అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ను కలిసిన కలెక్టర్... తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)ను జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ కలిశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేసీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. మన కలెక్టర్‌తో పాటు మహబూబ్‌నగర్, కరీంనగర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లు కూడా కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
కొత్తగూడెం, న్యూస్‌లైన్: జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో మంగళవా రం నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొత్తగూడెంలోని 161వ పోలింగ్ బూత్ పరిధిలో మొత్తం 1008 ఓట్లు ఉన్నాయని, పాత కొత్తగూడెం, శ్రీరామచంద్ర స్కూల్లో పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు జిల్లాలో సజావుగా జరిగాయని, మంగళవారం నాటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు కూడా ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు. భద్రాచలం నియోజకవర్గంలోని 8 మండలాల కౌంటింగ్‌ను భద్రాచలంలోనే ఏర్పాటు చేశామని, మిగిలినవన్నీ ఆయా మండల కేంద్రాల్లోనే ఏర్పాటు చేశామని తెలి పారు. కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్, డీఎస్పీ రంగరాజు భాస్కర్ తదితరులున్నారు. వీఆర్‌పురంలో కట్టుదిట్టమైన భద్రత వీఆర్‌పురం: రీపోలింగ్ జరగనున్న జల్లివారిగూడెం గ్రామంలో పోలీసులు, అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై సీఐ అమృతరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలింగ్ సందర్భం గా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. -
పోరు నేడే
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. జిల్లా వ్యాప్తంగా రెండు పార్లమెంట్, 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 20,17,030 మంది ఓటర్లు ఉండగా, 2,291 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి 27 మంది, జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 143 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 15, 362 మంది సిబ్బందిని నియమించారు. వీరికి రెండు విడతల్లో ఎన్నికలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బ్యాలెట్ అందజేశారు. వీరితో పాటు మరో 374 మంది సర్వీస్ ఓటర్లు , ఎన్నికల విధులో పాల్గొంటున్న సిబ్బంది 14,097 మంది ఉండగా, వారిలో 12,547 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను మే 16వ తేదీ ఉదయం 7.55 నిమిషాలలోపు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల తీరును పరిశీలించేందుకు 243 రూట్లను ఏర్పాటు చేసి 232 మంది సెక్టార్ అధికారులను నియమించారు. విధుల్లో పాల్గొనే సిబ్బంది మంగళవారం ఉదయం రెవెన్యూ డివిజన్ కేంద్రాల నుంచి సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వీరిని తరలించేందుకు 328 ఆర్టీసీ, 279 ప్రైవేట్ బస్సులు, సెక్టార్ అధికారులకు 243 కార్లు ఏర్పాటు చేశారు. కాగా పోలింగ్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించారు. వెబ్‌కాస్టింగ్‌తో చిత్రీకరణ... ఈ ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 1,209 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 1388 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, లెక్చరర్లకు శిక్షణ ఇచ్చారు. వీరంతా ఎన్నికల సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా చిత్రీకరించనున్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, ఆయా మండల కేంద్రాల్లో వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కమ్యూనికేషన్ లేని ప్రాంతాల్లో సైతం శాటిలైట్ ద్వారా ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మరికొన్ని చోట్ల సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేశారు. వీరు ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు జిల్లా అధికార యంత్రాంగానికి అందజేస్తారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 281 అతి సమస్యాత్మక, 424 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. కాగా, జిల్లాలో 248 కేంద్రాలు ఎల్‌డబ్ల్యూ ఈ ప్రాంతాలలో ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా సిబ్బంది... ఎన్నికల నిర్వహణకు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,082 మంది పీవో, ఏపీవోలతో పాటు 10,288 మంది ఇతర సిబ్బందిని నియమించారు. ఓటర్లను క్యూలో ఉంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బందితో పాటు ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ 500 మందిని నియమించారు. ఈసారి ఓటర్లకు ఫొటోతో కూడిన ఓటరు స్లిప్‌లను బీఎల్వోలు పంపిణీ చేశారు. ఈ స్లిప్‌లు అందని వారికి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఆరుగురు ఎన్నికల సిబ్బందితో పాటు పోలీస్, ఇతర సిబ్బందిని నియమించారు. పినపాక నియోజకవర్గంలో 436 మంది, ఇల్లెందులో 484 మంది, ఖమ్మంలో 550, పాలేరు 530, మధిర 522, వైరాలో 434, సత్తుపల్లిలో 540, కొత్తగూడెంలో 514, అశ్వారావుపేటలో 452, భద్రాచలంలో 620 మంది పీవో, ఏపీవోలను నియమించారు. ఈవీఎంలు సిద్ధం.... 10 నియోజకవర్గాలకు గాను 10,200 బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, 5530 కంట్రోల్ యూనిట్లు కేటాయించారు. జిల్లాకు కేటాయించిన ఈవీఎంలన్నీ అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించినవి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 1610 కంట్రోల్ యూనిట్లు, 3,220 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో 250 కంట్రోల్ యూనిట్లు, 500 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇక మిగితా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్ల వివరాలిలా ఉన్నాయి. పినపాకలో 199, ఇల్లందులో 218, భద్రాచలంలో 264, పాలేరులో 241, వైరా 198, సత్తుపల్లి 246, కొత్తగూడెం 234, అశ్వారావుపేట 206 ఈవీఎంలను కేటాయించారు. మొత్తం ఓటర్లు 20,17,030 మంది... సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 20,17,030 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 9,97,366 మంది పురుషులు,10,19,538 మంది మహిళలు, 126 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గంలో 2,64,024 మంది ఓటర్లు, అత్యల్పంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 1,67,493 మంది ఉన్నారు. -
నేటితో నామినేషన్ల ఘట్టం పూర్తి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం సాయంత్రం 3 గంటలతో ముగియనుంది. ఈ నెల 2వ తేదీన కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. తొమ్మిదో తేదీ చివరి తేదీగా ప్రకటించారు. మంగళవారం ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు 34నామినేషన్లు దాఖలయ్యా యి. సత్తుపల్లిలో నాలుగు, కొత్తగూడెంలో ఐదు, అశ్వారావుపేటలో ఐదు, భద్రాచలంలో ఐదు, ఇల్లెందులో నాలుగు, ఖమ్మంలో ఐదు, పాలేరులో రెండు, మధిరలో నాలుగు నామినేషన్లు దాఖల య్యాయి. ఇప్పటి వరకు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు మొత్తం 83నామినేషన్లు దాఖలయ్యా యి. వాటిలో ఖమ్మం నియోజక వర్గం నుంచి 13, పినపాకకు నాలుగు, ఇల్లెందుకు 11, పాలేరుకు ఎనిమిది, మధిరకు పది, వైరాకు నాలుగు, సత్తుపల్లికి ఆరు, కొత్తగూడెంకు 15, అశ్వారావుపేటకు ఐదు, భద్రాచలంకు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం పార్లమెంటు స్థానానికి దొడ్డా రాంబాబు యాదవ్ మంగళవారం బీఎస్పీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఇప్పటి వరకు 20 నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ అభ్యర్థుల వివరాలివే.. జిల్లావ్యాప్తంగా పది అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. పినపాక, వైరాలకు మాత్రం ఒక్కటి కూడా దాఖలు కాలేదు. మంగళవారం దాఖలైన నామినేషన్ల వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి : బీఎస్పీ అభ్యర్థిగా దామళ్ల సత్యనారాయణ, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా అమర్లపూడి రాము, వీరెల్లి లజర్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా రెంటపల్లి కోటయ్యలు నామినేషన్లు వేశారు. కొత్తగూడెం : జైసమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా నరాల సత్యనారాయణ, లోక్‌సత్తా అభ్యర్థిగా కూడికల ఆంజనేయులు, స్వతంత్య్ర అభ్యర్థి గా గుగులోతు రాజేష్, టీఆర్ఎస్ అభ్యర్థిగా జలగం వెంకటరావు, జనతా పార్టీ అభ్యర్థిగా పల్లి సురేష్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. అశ్వారావుపేట: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరుపున పోడియం కృష్ణ, స్వతంత్య్ర అభ్యర్థులుగా ఆంగోతు కృష్ణ, కారం భద్రమ్మ, కాంగాల మణమ్మ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా బాణోతు జాన్‌బాబులు నామినేషన్లు వేశారు. భద్రాచలం: పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా భూక్య పార్వతి, బీఎస్పీ అభ్యర్థిగా ఇర్ఫ కామరాజు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఇస్లావత్ స్వరూప, మరం లక్ష్మీదే వి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కుంజా ధర్మారావులు నామినేషన్లు వేశారు. ఇల్లందు : వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గుగులోతు రవిబాబు, టీఆర్ఎస్ అభ్యర్థిగా చుంచు నాగేశ్వరరావు, స్వతంత్య్ర అభ్యర్థిగా మెసు రాజశేఖర్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా లావుడ్యా నాగేశ్వరరావులు నామినేషన్లు వేశారు. ఖమ్మం : స్వతంత్య్ర అభ్యర్థులుగా మడిశెట్టి యర్రప్ప, బత్తుల ప్రణీత్ చైతన్య, షేక్ మదార్‌సాహెబ్, బాణోతు మంగీలాల్ నాయక్, ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థిగా మహ్మద్ అసద్‌లు నామినేషన్లు వేశారు. పాలేరు: స్వతంత్య్ర అభ్యర్థిగా తిమ్మిడి సైదమ్మ, సీపీఎం నుంచి బత్తుల లెనిన్ నామినేషన్లు వేశారు. మధిర: స్వతంత్య్ర అభ్యర్థిగా బంక బాబురావు, ఎంఎస్పీ అభ్యర్థిగా యాతాకుల భాస్కర్, బీఎస్పీ అభ్యర్థిగా కర్రి కృష్ణ, తెలంగాణ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మర్కపుడి రామదాసులు ఉన్నారు. నేడే చివరి రోజు... సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ బీఫారం రాని అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.దశమి మంచిరోజు కావడంతోపాటు నామినేషన్ల ఘట్టం చివరి రోజు కావడంతో ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచేందుకు నామినేషన్లు వేయనున్నారు. -
నేడు ‘సార్వత్రిక’ నోటిఫికేషన్
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఘట్టానికి తెరలేచింది. జిల్లాలో ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ విడుదల చేయనున్నారు. గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించిన ప్రకారం జిల్లాలోని 10 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైనందున భద్రాచలం నియోజకవర్గంలో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఎన్నికల నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. బుధవారం నుంచి ఈనెల 9 వరకు (ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యన) నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ఉంటుంది. ఉపసంహరణకు 12 వరకు అవకాశమిస్తారు. ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహించి, మే 16న ఫలితాలు వెల్లడిస్తారు. ఏర్పాట్లు పూర్తి .... ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంతా్రంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఎన్నికల పరిశీలకులతో పాటు ఖర్చుల నమోదుకు కూడా పరిశీలకులను నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వృద్ధ, వికలాంగ ఓటర్ల కోసం ర్యాంప్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. భద్రాచలం డివిజన్లో ఆరు పోలింగ్ సెంటర్లలో శాటిలైట్ ద్వారా ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ డివిజన్లో ఎన్నికల నిర్వహణకు హెలికాప్టర్‌ను ఉపయోగించుకునేందుకు కూడా ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 19,71,797 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 9,75,432 మంది మహిళలు, 9,96,254 మంది పురుషులు, 111 మంది ఇతరులు ఉన్నారు. అయితే గత నెల 31 వరకు దరఖాస్తు చేసుకున్న అర్హత గల వారికి కూడా ఓటు హక్కు రానుండడంతో ఓటర్ల సంఖ్య పెరగనుంది. డిపాజిట్ల వివరాలిలా.. పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీచేసే అభ్యర్థులు రూ. 25 వేలు, అసెంబ్లీకి పోటీచేసే వారు రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ అభ్యర్థులు రూ.5 వేలు, పార్లమెంట్ అభ్యర్థులు రూ.12,500 చెల్లించాలి. నామినేషన్లు వేసేది ఇక్కడే... జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్ వ్యవహరించనున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి కలెక్టరేట్లో, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వరంగల్ కలెక్టరేట్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. పినపాక అసెంబ్లీకి మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో, ఇల్లందు నియోజకవర్గానికి ఇల్లందు తహశీల్దార్ కార్యాలయంలో, ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో, పాలేరు నియోజకవర్గానికి ఖమ్మం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో, మధిర నియోజకవర్గానికి మధిర తహశీల్దార్ కార్యాలయం, వైరా నియోజకవర్గానికి వైరా తహశీల్దార్ కార్యాలయం, సత్తుపల్లి నియోజకవర్గానికి సత్తుపల్లి తహశీల్దార్ కార్యాలయం, కొత్తగూడెం నియోజకవర్గానికి కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయంలో, అశ్వారావుపేట నియోజకవర్గానికి అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయంలో, భద్రాచలం నియోజకవర్గానికి భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. -
15 వేల ఎకరాల భూపంపిణీ
సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్ : ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 15 వేల ఎకరాల భూమి పంపిణీ చేసినట్లు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో 568 మంది లబ్ధిదారులకు 711.25 ఎకరాలకు సంబంధించిన పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి పొందిన వారికి రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాం కర్లతో సమావేశాలు నిర్వహించామన్నారు. వచ్చే ఖరీఫ్‌లో రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇందిర జలప్రభ ద్వారా కూడా ఈ భూముల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. రోడ్లపై ఫుల్‌వీల్స్‌తో ట్రాక్టర్లు తిరగటంతో రోడ్లు మరమ్మతులకు గురవుతున్నాయని, అలా తిరగకుండా ఉండేందుకు జిల్లాస్థాయిలో అధికారులతో సమావేశాలు ఏ ర్పాటు చేసి చర్యలు చేపడతామని వివరించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సత్తుపల్లిలో భూమిని గుర్తించామని, త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. రచ్చబండలో వచ్చిన సమస్యలన్నీ ఆన్లైన్ చేసి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా వికలాంగుల శిబిరా లు పూర్తి అవుతాయని, 20 నుంచి 40 శాతం ఉన్న వికలాంగులకు కూడా పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిరుపేదలకు భూమిపై హక్కులు కల్పించటం శుభ పరిణామన్నారు. సత్తుపల్లి మండలం యాతాలకుంటలో గిరిజనులకు, అటవీ శాఖకు మధ్య భూ వివాదం సాగుతోందని, దీనిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ సంజీవరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, తహశీల్దార్లు జి.నర్సింహారావు, అమర్నాథ్, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులంతా కేంద్ర స్థానాల్లో ఉండాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు కేంద్ర స్థానాల్లో 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. ఈ నెల 28న తీరం దాటనున్న లెహర్ తుపానును ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓ, తహశీల్దారులు, ఐకేపీ, పీహెచ్సీ మెడికల్ ఆపీసర్లు, వ్యవసాయ శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలలో నీరు సమృద్ధిగా ఉందని అన్నారు. లెహర్ తుపానుతో నష్టం జరగకుండా మండల పరిధిలోని అన్ని చెరువులను తనిఖీ చేయాలని రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కల్లాలు.. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని భద్రపరచాలని రైతులకు సూచించారు. వరదలతో ఎలాంటి నష్టం తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. నదులు, వాగుల్లోకి వచ్చే వరదల ప్రవాహంపై వివరాలను కంట్రోల్ రూమ్‌కు తెలపాలన్నారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ.. ప్రసవ తేదీ వారం లోపు ఉన్న గర్భిణులను సమీపంలోని పీహెచ్సీలలో చేర్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని భద్రపరిచే విషయంలో రైతులకు సహకరించాలని మార్కెటింగ్, ఐకేపీ ఏపీఎంలకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ కలెక్టర్ మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకాధికారుల నియామకం తుపాను పరిస్థితులను మానిటరింగ్ చేసేందుకుగాను జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారులను నియమించినట్టు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం- నగర పాలక సంస్థ కమిషనర్ బి.శ్రీనివాస్, పాలేరు- ఖమ్మం ఆర్డీవో సంజీవరెడ్డి, మధిర- స్పెషల్ కలెక్టర్ (పోలవరం) లక్ష్మయ్య, ఇల్లందు- బీసీ సంక్షేమ శాఖాధికారి వెంకటనర్సయ్య, పినపాక- ఎస్డీసీ పాల్వంచ నారాయణరెడ్డి, సత్తుపల్లి- సీపీఓ ఆనందరత్నాబాబు, కొత్తగూడెం- ఆర్డీవో అమయ్‌కుమార్, అశ్వారావుపేట- పాల్వంచ ఆర్డీవో శ్యాంప్రసాద్, భద్రాచలం- ఇన్చార్జి సబ్ కలెక్టర్ వైవి.గణేష్, వైరా- సీఈఓ జడ్పీ జయప్రకాష్ నారాయణ్‌ను నియమించారు.